Hyderabad | నాన్న ఇక టీవీ, ఫోన్ చూడనంటూ.. కూతురు ఆత్మహత్య

హైదరాబాద్ : ఇంట్లోనే ఉండి టీవీ, ఫోన్ చూస్తూ కాలం గడుపుతున్న ఓ కూతురిని తండ్రి మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా, రావల్‌వెల్లి మండలం కేశంపేట గ్రామానికి చెందిన కే స్వామిగౌడ్ కొన్నేండ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని పాపిరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నారు. తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వామిగౌడ్ డ్రైవర్‌గా పని చేస్తుండగా, కుమారుడు రవికుమార్ ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన కూతురు దివ్య(21) కొన్నాళ్లు ప్రయివేటు ఉద్యోగం చేసింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. ఇక నిత్యం ఫోన్‌లో మునిగితేలుతూ, టీవీ చూస్తుండటంతో ఉద్యోగం చూసుకోవాలని తండ్రి మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కూతురు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ సూసైడ్ నోట్ లభ్యమైంది. నాన్నా ఇక నేను టీవీ చూడను.. ఫోన్ చూడను.. చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇకపై మీకు ఎటువంటి సమస్య ఉండదు అని దివ్య సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.