Danam Nagender | దానం నాగేందర్ ఆరోసారి గెలుస్తారా..? అసెంబ్లీ గడప తొక్కేనా..?

Danam Nagender | దానం నాగేందర్ ఈ పేరు తెలియని వారుండరు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దానం అందరికీ సుపరిచితమే. మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అంతేకాదు.. ఎంతో ఖ్యాతి గాంచిన అతిపెద్ద గణేషుడు కొలువయ్యే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతనిధ్యం వహిస్తున్నారు. ఖైరతాబాద్ అనే పేరు తెలుగు రాష్ట్రాలకే కాదు.. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఆయా రాష్ట్రాలకు సుపరిచితం.
అయితే ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దానం నాగేందర్ ఆరోసారి అసెంబ్లీ గడప తొక్కడమే లక్ష్యంగా ఆయన తన ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఖైరతాబాద్‌లోని ప్రతి గల్లీని చుట్టేస్తున్నారు దానం. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పీ విజయా రెడ్డి, చింతల రామచంద్రారెడ్డిని చిత్తు చేసేలా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
దానం రాజకీయ ప్రస్థానం ఇది..
1994 రాజకీయ ప్రవేశం చేసిన దానం నాగేందర్ ఇప్పటి వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆసిఫ్‌నగర్ నుంచి మూడుసార్లు, ఖైరతాబాద్ నుంచి రెండు సార్లు విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు.
1994 ఆసిఫ్‌నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ఎంబీటీ పార్టీ అభ్యర్థి ఎండీ విజారత్ రసూల్‌పై 1966 ఓట్ల తేడాతో ఆయన నెగ్గారు. 1999 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఆసిఫ్‌నగర్ నుంచి రెండోసారి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థి విజారత్ రసూల్‌పై 20,720 ఓట్ల తేడాతో గెలిచారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆసిఫ్‌నగర్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 2774 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 13,848 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో 20,846 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వీడి, ఖైరతాబాద్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిని 28,402 ఓట్ల తేడాతో ఓడించారు.