CM KCR | రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకే.. కేసీఆర్ రాజ శ్యామ‌ల యాగం..!

CM KCR | రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకే.. కేసీఆర్ రాజ శ్యామ‌ల యాగం..!

CM KCR | తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. 2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్.. మూడోసారి కూడా ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను మ‌ట్టి క‌రిపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందుకోసం కేసీఆర్ అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. రాజ‌కీయంగా ఎదుర్కోంటూనే.. మ‌రోవైపు దైవ‌భ‌క్తిని కేసీఆర్ న‌మ్ముకుంటున్నారు. గ‌తంలో యాగాలు చేసి విజ‌యాల‌ను అందిపుచ్చుకున్న కేసీఆర్.. ఈ ఎన్నిక‌ల్లోనూ భారీ విజ‌యం సాధించేందుకు యాగాలు నిర్వ‌హిస్తున్నారు.

కేసీఆర్‌కు దైవ‌భ‌క్తి ఎక్కువ అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సంద‌ర్భంలో కేసీఆర్ అనేక యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయుత చండీ యాగం నిర్వహించారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిష్టతో నిర్వహించారు. రాజశ్యామ‌ల యాగం కూడా రెండుసార్లు నిర్వ‌హించారు. 2018 ఎన్నిక‌ల‌కు ముందు రాజశ్యామల యాగం నిర్వ‌హించారు. ఆ ఎన్నిక‌ల్లో కేసీఆర్ భారీ విజ‌యం సాధించారు. ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీ యాగం చేశారు. 2022లో ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా కూడా కేసీఆర్ రాజ‌శ్యామ‌ల యాగం నిర్వ‌హించారు.

2023 ఎన్నిక‌ల్లోనూ కేసీఆర్ అదే బాట‌లో ప‌య‌నిస్తున్నారు. రాజ‌శ్యామ‌ల యాగం చేస్తే రాజ్యాధికారం సొంతమవుతుందని.. శత్రువుల మీద విజయం సాధిస్తారని పండితులు చెబుతారు. రాజ్యలక్ష్మి వరించాలని..విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామలయాగం. ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయ లక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల పోలింగ్‌కు ముందు కేసీఆర్ ఎర్ర‌వ‌ల్లిలోని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో మూడురోజుల పాటు రాజ‌శ్యామ‌ల యాగం నిర్వ‌హిస్తున్నారు.

గ‌తంలో నిర్వ‌హించిన రాజ‌శ్యామ‌ల యాగం.. విశాఖ‌ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు కూడా ఆయ‌న చేతుల మీదుగానే రాజ‌శ్యామ‌ల యాగం నిర్వ‌హిస్తున్నారు. కేసీఆర్‌ కూడా యాగం చేసిన ప్రతిసారీ విజయం అందుకున్నారు. ఈ సారికూడా రాజ శ్యామల యాగం ద్వారా రాష్ట్ర రాజ‌కీయాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించి, హ్యాట్రిక్ కొడుతార‌ని గులాబీ శ్రేణుల విశ్వాసం.