ఊపిరితిత్తుల్లో సూది.. అయస్కాంతంతో వెలికి తీసిన వైద్యులు

ఎలాంటి సర్జరీలు చేయకుండానే.. ఊపిరితిత్తుల్లో ఉన్న సూదిని అయస్కాంతంతో వెలికితీశారు వైద్యులు. బాధిత బాలుడు ఆరోగ్యకరంగా ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ ఏడేండ్ల బాలుడు తీవ్రవమైన దగ్గుతో బాధపడుతున్నాడు. దగ్గుతో పాటు రక్తం వస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. బాలుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా, ఎడమ ఊపిరితిత్తిలో సూది ఉన్నట్లు గుర్తించారు. సూది ఉన్న ప్రాంతంలో తక్కువ ఉన్న స్థలం ఉండటంతో సర్జరీ చేయడం సాధ్యం కాదని డాక్టర్లు భావించారు.
దీంతో ఎండోస్కోపి విధానంలో మందం ఉన్న ఒక అయస్కాంతాన్ని పంపారు. సూదిని అయస్కాంతానికి ఆకర్షితమయ్యేలా చేశారు. ఊపిరితిత్తిలో ఉన్న సూది 4 సెం.మీ. ఉన్నట్లు తెలిపారు. అది కుట్టు మిషన్ సూది అని వైద్యులు పేర్కొన్నారు. ఒకవేళ ఇది విఫలమైతే.. ఛాతీకి సర్జరీ చేయాల్సి వచ్చేదని డాక్టర్లు చెప్పారు. ఆ బాలుడి పేరెంట్స్ మాత్రం అతడి ఊపిరితిత్తుల్లోకి సూది ఎలా వెళ్లిందో బయటపెట్టకపోవడం గమనార్హం.