ఇది నిజంగా రోహిత్ శ‌ర్మ ఫ్యాన్స్‌కి పెద్ద షాకే.. కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో హార్ధిక్

ఇది నిజంగా రోహిత్ శ‌ర్మ ఫ్యాన్స్‌కి పెద్ద షాకే.. కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో హార్ధిక్

ప్ర‌స్తుతం టీమిండియా క్రికెట్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్స్‌కి విశ్రాంతి ఇచ్చి యువ ప్లేయ‌ర్స్‌ని ఆడించ‌డం, కొత్త వారిని కెప్టెన్‌గా తెర‌పైకి తీసుకురావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియాకి ముగ్గురు కెప్టెన్స్ ఉన్నారు. టీ20ల‌కి సూర్య కెప్టెన్సీ చేయ‌గా, వ‌న్డేల‌కి కేఎల్ రాహుల్ సారధ్యం వహించ‌నున్నాడు. ఇక టెస్ట్‌ల‌కి రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడు. అయితే 2013 నుంచి ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించి… అయిదు టైటిళ్లను సాధించి గొప్ప నాయకుడిగా పేరు సంపాదించుకున్న రోహిత్ శ‌ర్మ‌కి ముంబై ఇండియ‌న్స్ పెద్ద షాకిచ్చింది.

రోహిత్ శర్మను కాదని, హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించిన‌ట్టు ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఇటీవల గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను ముంబయి బదిలీ చేసుకోగా, ఇప్పుడు ఆయ‌న‌ని కెప్టెన్‌గా నియ‌మించ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. హార్ధిక్ గత రెండు సీజన్లలో గుజరాత్‌ జట్టును గొప్పగా నడిపించాడు. సక్సెఫుల్ కెప్టెన్‌గా రెండు సార్లు ఫైనల్‌కు చేర్చడమేగాక 2022 సీజన్‌లో విజేతగా నిలిపిన క్ర‌మంలో అత‌నికి కెప్టెన్ బాధ్య‌త‌లు అప్ప‌గించారా అనే చ‌ర్చ న‌డుస్తుంది. కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ ప్రదర్శన దిగజారుతూ వస్తున్న కార‌ణంగా కూడా హార్దిక్ పాండ్యాను నూతన కెప్టెన్ గా నియమించినట్టు తెలుస్తోంది.

దీంతో రోహిత్ శ‌ర్మ శకం ముగిసిన‌ట్టే అని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. ముంబయి ఇండియన్స్ సిద్ధాంతాలకు అనుగుణంగా భవిష్యత్ అవసరాల కోసం జట్టును నిర్మించే క్రమంలో ఇదొక భాగం అని జ‌య‌వ‌ర్ధనే తెలియ‌జేశారు. ముంబయి ఇండియన్స్ జట్టుకు మొదటి నుంచి మెరుగైన నాయకత్వం ద‌క్కుతూ వ‌చ్చింది. రోహిత్ శర్మ అమోఘమైన నాయకత్వం పట్ల ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2013 నుంచి ముంబయి ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ ప్రస్థానం ఎంతమాత్రం తీసివేయదగ్గది కాదు… రోహిత్ శర్మ సారథ్యం ఎంతో ఘనంగా సాగింది. రోహిత్ నాయకత్వం ముంబయి ఇండియన్స్ కు అసమాన విజయాలను అందించడమే కాదు, అతడిని ఐపీఎల్ చరిత్రలో సర్వోత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిపింది. అని జయవర్ధనే ఓ ప్రకటనలో తెలియ‌జేశారు.