పుట్ట తేనంత చ‌క్క‌ని తీర్థం! ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌.. మేడారం అమ్మ‌ల జాత‌ర‌

నాగరిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి అందచందాలతో అలరారే కీకారణ్యం మాఘశుద్ధ పౌర్ణమి వచ్చిందంటే జనారణ్యంగా మారుతుంది.

పుట్ట తేనంత  చ‌క్క‌ని తీర్థం! ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌.. మేడారం అమ్మ‌ల జాత‌ర‌
  • ఆదివాసీ సంస్కృతికి అద్దం ప‌ట్టే పండుగ‌
  • విగ్ర‌హారాధ‌న లేక‌పోవ‌డం ప్ర‌త్యేక‌త‌
  • గ‌ద్దెల రూపంలో కొలువుదీరే వ‌న దేవ‌త‌లు
  • పోరాట స్ఫూర్తికి నిద‌ర్శ‌నంగా తల్లులు
  • కాక‌తీయుల‌పై యుద్ధంలో అమ‌ర‌త్వం
  • తెలంగాణ పోరాట స్ఫూర్తికి ఆద్యులు
  • ఒక‌ప్పుడు ఆదివాసీ, గిరిజ‌నుల‌కే ప‌రిమితం
  • నేడు పెరుగుతున్న‌ గిరిజ‌నేత‌రుల జోక్యం
  • 24 వ తేదీ వరకు మేడారం జ‌న‌సంద్ర‌మే
  • కిట‌కిట‌లాడుతున్న తాడ్వాయి మండలం

అడవితల్లి ఆకాశమంత సంబురం చేసుకుంటోంది.. గిరిజనులు పుట్టతేనంత చక్కని తీర్థాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొంటున్నారు.. దారిపొడవునా నేలనున్న ఎర్రని ధూళి పైకెగసి ఎగసి భక్తులతో హోళీ ఆడుకుంటోంది.. జంపన్న వాగు లక్షలాది భక్తులను పునీతులను చేస్తోంది.. దేశంలోనే అతి పెద్ద గిరిజనుల జాతర మేడారం సమ్మక్కసారలమ్మ జాత‌ర‌ ఒక అపురూప సంబురం.. అపూర్వ సన్నివేశం… దాన్ని చూడటమే ఒక గొప్ప అనుభూతి!

(రవి సంగోజు)

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి:

పోరాట స్ఫూరికి, చైతన్యానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తూ.. ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన ధీర వనితలుగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మల జాత‌ర మొద‌లైంది. ఇప్ప‌టికే ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజులు మంగ‌ళ‌వార‌మే మేడారం బ‌య‌ల్దేరారు. న‌ర్సంపేట ద‌గ్గ‌ర‌లోని పూనుగొండ్ల‌ నుంచి 73 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మేడారానికి న‌డుచుకుంటూ బ‌య‌ల్దేరారు. ఈసారి మేడారం జాతరలో భాగంగా 21వ తేదీన సారలమ్మ, 22వ తేదీన సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటారు. 23వ తేదీన భక్తులకు దర్శనమిస్తారు. 24వ తేదీన గిరిజన దేవతలు వనప్రవేశం చేస్తారు. ఏడాది పొడువునా మ‌నుషులే క‌నిపించ‌ని ఈ ప్రాంతం.. ఈ నాలుగు రోజులూ జ‌న‌సంద్ర‌మ‌వుతుంది. మొక్కులు చెల్లించుకుంటూ, బంగారం స‌మ‌ర్పించుకుంటూ భ‌క్త‌జ‌నం సిగ‌లూగుతుంది.

ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌లు

అణచివేతను సహించని ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆదివాసీల గుండెల్లో వనదేవతలుగా స్థిరపడ్డారు. ఇక్కడ విగ్రహారాధ‌న లేక పోవడం జాతరలో అత్యంత ప్రత్యేకాంశం. సమక్క, సారలమ్మలతోపాటు జంపన్న, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు మాత్రమే ఉంటాయి. గద్దెల వద్దనే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ సమ్మక్క సారలమ్మలకు చెందిన వంశస్తులు పూజారులుగా కొనసాగడం మరో ప్రత్యేకత. తెలంగాణ సమాజంలో, సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఈ మహా జాతర ఆదివాసీ గిరిజన సామాజిక జీవన సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్న‌ది. ఆదివాసీ ప్రజాకళలకు, ఆచార వ్యవహారాలకు, నమ్మకాలకు సంబంధించి సంస్కృతుల మాధ్యమంగా ఈ జాత‌ర‌ ప్రపంచానికి చాటి చెప్పుతోంది. అడవుల్లోని ఆదివాసీ సంస్కృతిని తెలిపే మేడారం జాతరలో బలమైన సాంస్కృతిక వాతావరణమే కన్పిస్తుంది. తెలంగాణ ప్రజల సృజనాత్మక జీవనోత్సవాన్ని దర్శింపజేసే మేడారం జాతర, ఆదివాసీ సంస్కృతి మూలాలపై కాలానుగుణమైన మార్పులకు తోడు, రకరకాలు సాగుతున్న దాడిని తట్టుకొని తమదైన ఆత్మగౌరవ ప్రతీకను దాటిచెబుతోంది. ఆదివాసీల విశ్వాసం, ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. ఈ జాతరలో సాంస్కృతిక పునరుజ్జీవన చైతన్యం కనిపిస్తుంది. 1996 నుంచి రాష్ట్ర పండుగగా మేడారం జాతర సాగుతోంది.

రెండేళ్లకోసారి మేడారం మహా జాతర

ప్రతి రెండేళ్లకోసారి వరంగల్- జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క- సారలమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ఆదివాసీ గిరిజనుల శౌర్యానికి, సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు నిదర్శనంగా గిరిజనుల ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా సమ్మక్క, సారలమ్మలు చరిత్రలో నిలిచిపోయారు. స్థల, జానపదుల పురాణం, చారిత్రక అంశాల ప్రకారం రకరకాల కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందారనే అంశం మాత్రం అందరూ అంగీకరించేదిగా నిలిచింది. కాకతీయుల కాలంలో 800 ఏళ్ల క్రితం కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజల నుండి కప్పం వసూలు చేయడాన్ని వ్యతిరేకించి మేడారం పరగణాకు రాజుగా ఉన్న పగిడిద్దరాజు కాకతీయ సేనాని యుగంధరుని సైన్యంతో యుద్ధానికి సిద్ధపడుతాడు. ఈ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు, కుమారుడు, సేనాని జంపన్న హోరాహోరీ పోరు చేసి వీరమరణం పొందుతారు. సంపెంగవాగులో పడి మృతి చెందినందున ఆ వాగు అప్పటి నుంచి జంపన్నవాగుగా పేరొందినట్లు చెబుతారు. అనంతరం యుద్ధరంగంలోకి దిగిన సమ్మక్క, సారలమ్మలు శత్రుసైన్యాలను చీల్చిచెండారు. ఈ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సమ్మక్క గుర్రంపై చిలుకలగుట్టవైపు వెళ్ళి అదృశ్యమైనట్లు ఆదివాసీల విశ్వాసం. సమ్మక్క రాక కోసం ఎదురుచూసిన గిరిజనులు చిలుకలగుట్టకు వెళ్ళి వెదికినా ఫలితం కన్పించదు. గుట్టమీద ఉన్న నెమిలినార చెట్టు సమీపంలో కుంకుమ భరిణి కన్పిస్తుంది. ఈ లంక కుంకుమ భరిణినే సమ్మక్కకు ప్రతిరూపంగా అదివాసీలు భావిస్తున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చిలుకలగట్టు నుంచి సమ్మక్కను (కుంకుమ భరిణి) ఆచార, సంప్రదాయాలతో వడ్డెలు (పూజారులు) తీసుకొచ్చి గద్దెపై ప్ర‌తిష్ఠిస్తారు. దీనికి ముందే వెదురు బొంగుతో చేసిన ఒక మొంటెలో ఒక ర‌హ‌స్య‌మైన వ‌స్తువును ఉంచి.. ఒక చిన్న‌పిల్లాడి త‌ల‌పై పెట్టి.. అత‌డి ముఖం క‌న‌ప‌డ‌కుండా తీసుకొస్తారు. ఆ మొంటెనే సారలమ్మగా భావిస్తారు. ఆమె కన్నెపల్లి నుంచి మేడారంలోని గద్దెలపైకి చేరుతుంది.

పోరాటానికి ప్రతీకగా మారారు

ప్రజలు తరపున నిలబడిన సమ్మక్క-సారలమ్మలు ఈ ప్రాంతంలో పోరాటతత్వానికి స్ఫూర్తిదాత‌ల‌య్యారు. కరువుకాటకాల సమయంలో కప్పం ఎందుకు కట్టాలని ఎదురు తిరిగి, కాకతీయ‌ సైన్యంతో పోరాడి నేలకొరిగారు. సమ్మక్క, ఆమె కూతురు సారలమ్మలతో పాటు సమ్మక్క భర్త, కుమారుడు సైతం కాకతీయులతో హోరాహోరి పోరాడి ప్రజల కోసం ప్రాణాలిచ్చారు. నాటి నుండే ఈ ప్రాంత ప్రజలకు పోరాట వారసత్వం అలనడినట్లు స్పష్టమవుతోంది. నాటి రాచరికపు పెత్తనం నుండి నేటి అప్రజాస్వామిక విధానాలను ఎదురించడంలోనూ ఈ ప్రాంతంలో ధిక్కార స్వభావమే కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలకు ధిక్కార స్వరంగా సమ్మక్క, సారమ్మలు నిలిచిపోయారు. ‘నిజాం నిరంకుశ పాలనపై జమిందారుల, దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యాలు, అరాచకాలపై సాగిన సాయుధ పోరాటం, డెబ్బైవ దశకం నుండి దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నక్సల్బరీ ఉద్యమాలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ సమ్మక్క- సారలమ్మల పోరాట స్ఫూర్తి కనిపిస్తుంది. నాటి నుండి నేటి వరకు వరంగల్ జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నోళ్లలో నిరంతరం సమ్మక్క, సారలమ్మల పేర్ల నిత్యం నానుతుంటాయి. వారి పోరాట పటిమ గురించి మాట్లాడని, వాళ్ల త్యాగనిరతిని తలుచుకోని వారే లేరంటే అతిశయోక్తి కాదు. అంతటి స్ఫూర్తిమంత‌మైన మేడారం జాతర నేడు తెలంగాణ ప్రజల జీవితంలో భాగమైంది.

నాగ‌రిక ప్ర‌పంచం దాడిని త‌ట్టుకుని..


 


గిరిజన సంప్రదాయాలను న‌వ‌ నాగ‌రిక‌త‌ క్రమంగా కబళిస్తున్న ప్రస్తుత తరుణంలోనూ సమ్మక్క సారలమ్మపై ఏ మాత్రం భక్తి విశ్వాసాలు సన్నగిల్లలేదు. గిరిపుత్రుల్లో ఉండే పట్టుదల, నమ్మకం, నిజాయితీలకు ఈ జాతరే ప్రత్యక్ష సాక్షి, నాగరిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి అందచందాలతో అలరారే కీకారణ్యం మాఘశుద్ధ పౌర్ణమి వచ్చిందంటే జనారణ్యంగా మారుతుంది. మేడారం ప్రధాన జాతరతోపాటుగా తెలంగాణ జిల్లాలో అనేక చోట్ల జాతరలు జరుగుతాయి. జిల్లాలోని అగ్రహంపహాడ్, వెంకటాపురం మండలంలో, స్టేషన్ ఘన్పూర్ తదితర ప్రాంతాల్లో జాతరలు నిర్వహించుకుంటున్నారు.

మహాజాతరగా మేడారం రూపాంతరం

ఒకప్పుడు దట్టమైన కీకారణ్యంలో ఎలాంటి సౌకర్యాలు, రవాణా మార్గాలు లేని స్థితిలో మేడారం జాతర ప్రారంభమైంది. మేడారం, చిలుకలగుట్ట, స్థానిక గిరిజన ఆవాసాలకే పరిమితమైన జాతర ఇప్పుడు కోటిన్నర మందికిపైగా వచ్చే ప్రపంచ ప్రఖ్యాత గిరిజన మహాజాతరగా రూపాంతరం చెందింది. ప్రతి రెండేళ్ల కోసారి. మేడారం జాతరలో లక్షల మంది సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే సంప్ర‌దాయం బహుళ ప్రాచుర్యం పొందింది. 1980 దశకం నుంచి వేగంగా మార్పులొచ్చాయి. 1990 నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయి జాతర నాలుగు రోజులు మేడారం అటవీప్రాంతం జనారణ్యంగా మారిపోతోంది. మహానగరంగా రూపు సంతరించుకుంటోంది. ప్రస్తుత తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి గిరిజనులతో పాటు, ఇతరులు లక్షలాదిగా వ‌స్తుంటారు. ప్రస్తుతం కోటిన్నర మందికి పైగా జనం హాజరయ్యే మహాజాతరగా మారిపోయింది.

ఆ ఐదుగురు …. ఆ ప్రాంతాలు

సమ్మక్క, సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజు, గోవిందరాజులు.. ఈ జాతర ప్రధానమైన దేవదేవతలు వీరే. వడ్డెలు, సమ్మక్క, సారలమ్మ, చిలుకలగుట్ట, కన్నెపల్లి, జంపన్నవాగు, కొండాయి, పూనుగొండ్ల ప్రజల నోళ్ళల్లో విన్పించే ప్రాంతాలు. వీటికి ప్రత్యేకతలున్నాయి. వనదేవతలకు సంబంధించిన గాథలు ఇలా ఉన్నాయి.

సమ్మక్క తల్లి

గోదావరి నదీతీరాన ఉన్న దట్టమైన అటవీప్రాంతం ఆ ఆదివాసీల నెలవు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున అడవిలో పులుల మధ్య కోయదొరలకు దొరికిన శిశువుకు సమ్మక్కగా పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచి పెద్దచేశారు. కరీంనగరు అటవీప్రాంతాన్ని ఏలుతున్న పగిడిద్దరాజుతో సమ్మక్కకు వివాహం చేశారు. కాకతీయులపై పోరాడి వీరమరణం పొంది ఆదివాసీల ఇలవేల్పుగా మారింది.

సారలమ్మ తల్లి

సమ్మక్క పెద్ద కుమార్తె సారలమ్మ కన్నెపల్లిలో కొలువుదీరింది. మేడారానికి సమీపంలోని జంపన్నవాగు ఒడ్డున ఈ గ్రామం ఉంటుంది. సారలమ్మ ధైర్యసాహసాలతో పెరిగి కాకతీయులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ తీసుకరావడంతో జాతర ప్రారంభమవుతోంది.

జంపన్న

సమ్మక్క కుమారుడు కోయసైన్యానికి సేనాని. యుద్ధంలో కాకతీయుల కత్తివేటుకు బలై, సంపెంగవాగులో వీరమరణం పొందాడు. ఈయన పేరుతోనే జంపన్నవాగు జనం నోళ్ళల్లో నానుతోంది.

పగిడిద్దరాజు

పగిడిద్దరాజు సమ్మక్క భర్త. మేడారం పరగణాకు రాజు. పేదలు, ఆదివాసీలపాలిట దైవంగా పేరొందారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని సేనలను ఎదురించే క్రమంలో వీరమరణం పొందారు. కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి ఆయన వంశీకులు జాతర సందర్భంగా మేడారం జాతర గద్దెపైకి తీసుకొస్తారు.

గోవిందరాజులు

సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలకు పినతండ్రి గోవిందరాజులు. సోదరుడు పగిడిద్దరాజుతో కలిసి కాకతీయ సేనలను ఎదురొడ్డి పోరాడారు. ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి ఆయన వంశీకులు జాతర సందర్భంగా మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్ర‌తిష్ఠిస్తారు.

జాతరలో వడ్డెలు (పూజారులు)

మేడారం జాతర పూజారులుగా ఆయా వంశాలకు చెందిన వారు వడ్డెలుగా ఉన్నారు. సమ్మక్కను విశేషం. తమ ఇంటికొడలిగా భావించే చందా వంశీయులే సమ్మక్క పూజారులు. వీరి వంశస్థులు మొదటిసారి జాతర నిర్వహించారు. జాతరలో చందా వంశీయులకు ప్రధాన పాత్ర ఉంది. నమ్మక్క పూజారులుగా సిద్ధబోయిన, చందా, కొక్కెర వంశీయులు ఐదుగురు పూజారులుగా ఉన్నారు. సారలమ్మకు కాక, కోరం వంశానికి చెందిన ఆరుగురు పూజారులుగా ఉన్నారు. పగిడిద్దరాజుకు తెనక, గోవిందరాజులుకు దబ్బగట్ల వంశీకులు పూజారులుగా ఉన్నారు. దేవతలను గద్దెలపైకి తీసుకొచ్చే ఆదివాసీ పూజారులను వడ్డెలు అంటారు. చిలుకలగుట్టపై నుంచి సమ్మక్కను, కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజలు చేసి ఈ వడ్డెలు తోడ్కొని వస్తారు. సమ్మక్కను తీసుకొచ్చేవారిని పెద్దవడ్డెలుగా, సారలమ్మను తీసుకొచ్చేవారిని చినవడ్డెలుగా పిలుస్తారు.

ఆదివాసీ సంస్కృతికి నిదర్శనం

గ్రామీణ ఆదివాసీ జీవితాలలో జాతరలు ప్రధాన పాత్ర పోషిస్తాయనడానికి మేడారం నిదర్శనం. వీరవనితలు దేవతలుగా మారిన విశ్వాసాలు, నమ్మకాలు మన ఆచరణలను, సంప్రదాయాలను తెలియచేస్తాయి. గిరిజనుల ఆచార వ్యవహారాలు, పూజా విధానాలు, దేవతల రూపాలు, పేర్లు మాత్రమే కాక అనేక అంశాలు వాటి సంస్కృతికి అద్దం పడుతాయి. ముఖ్యంగా మేడారం జాతరలో పూనకాలు (శివసత్తులు), ఎదురుకోలు (ఎదురు కోళ్లు), నిలువెత్తు బంగారం (బెల్లం) తూకాలు, కొబ్బరికాయలు, సంతానం కోసం వ్రతం, తొట్టెలు (ఊయలలు), పిట్టలు, కోడలు కట్టడం, సమ్మక్కకు కంక బియ్యం, జువ్విచెట్టు మహిమ, పవిత్ర బండారి, బని, మద్యపానం, కుల దేవతా పద్ధతి విత్తనం పండుగ, పొట్ట పండుగ (వెన్ను గట్టి పండుగ), పెద్దల పండుగ (కొత్తల పండుగ), చిక్కుడుకాయ కోత పండుగ, మండ మెలిగే పండుగ, నిప్పుపువ్వు పండుగ, కోలు కడిగే పండుగ, పచ్చపండుగ లాంటి ఆచారాలు దర్శనమిస్తాయి. జనం రాక పెరిగి, సాంకేతికత పెరిగి విస్తృత ప్రచారం జరిగిన అనంతరం గడిచిన రెండు దశాబ్దాల కాలంలో మేడారం జాతరకు పెద్ద ఎత్తున ప్రజలు త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో గిరిజన ఆచార వ్యవహారాలు దెబ్బతింటున్నాయి. గిరిజనుల కంటే గిరిజనేతరులే అధిక సంఖ్యలో ఈ జాతరలను దర్శించుకుంటున్న నేపథ్యంలో గిరిజనుల మొక్కుబడుల తీరు మారుతున్నది. శాంతిభద్రతల పేరుతో భారీ జనసంద్రం రాకతో గిరిజనులు వాస్తవ సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. మరో వైపు భారీగా తరలివచ్చే జన ప్రవాహం కారణంగా జాతరలు జరిగే గ్రామాలు అస్తవ్యస్థమైతున్నాయి.