Viral Video | బుర‌ద‌లో చిక్కుకున్న గొర్రెను కాపాడిన మ‌హిళ‌.. నెటిజ‌న్లు ఫిదా

Viral Video | బుర‌ద‌లో చిక్కుకున్న గొర్రెను కాపాడిన మ‌హిళ‌.. నెటిజ‌న్లు ఫిదా

Viral Video | ఈ భూమ్మీద నివ‌సించే ప్ర‌తి జంతువు, మ‌నిషి ప్రాణం ఎంతో అమూల్య‌మైన‌వి. మ‌నిషి కానీ, జంతువు కానీ ఆప‌దలో ఉందంటే క‌చ్చితంగా అక్కున చేర్చుకుంటాం. ఆదుకుంటాం. సాధ్య‌మైనంత వ‌ర‌కు వాటిని ప్రాణాల‌తో ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నిస్తాం. బుర‌ద‌లో చిక్కుకున్న గొర్రెను ఓ మ‌హిళ ప్రాణాల‌తో కాపాడింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గొర్రెను ప్రాణాల‌తో కాపాడిన మ‌హిళ‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఐర్లాండ్‌లోని మౌర్నె ప‌ర్వతాల్లో లిన్ అనే మ‌హిళ అడ్వెంచ‌ర్‌కు వెళ్లింది. అయితే అక్క‌డున్న ఓ కాలువ వ‌ద్ద బుర‌ద‌లో ఓ గొర్రె పిల్ల చిక్కుకుపోయింది. బురద‌లో నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు గొర్రె ప్ర‌య‌త్నించ‌డాన్ని ఆమె చూసింది. దీంతో ఆ మ‌హిళ గొర్రెను ప్రాణాల‌తో కాపాడేందుకు త‌న శ‌క్తినంతా ఉప‌యోగించింది. గొర్రె కొమ్ముల‌ను ప‌ట్టుకుని బుర‌ద‌లో నుంచి బ‌య‌ట‌కు లాగింది. అనంత‌రం అక్క‌డే ఉన్న కాలువ‌లోకి గొర్రెను లాక్కెళ్లి, బుర‌ద‌నంతా క‌డిగేసింది. ఆ త‌ర్వాత ఒడ్డుకు చేర్చి, గొర్రెను దాని మంద‌లోకి పంపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను త‌న ఇన్‌స్టా ఖాతాలో లిన్ షేర్ చేసింది.

బుర‌ద‌లో చిక్కుకున్న గొర్రెను ఆమె ప్రాణాల‌తో కాపాడ‌డాన్ని నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఓ మూగ‌జీవాన్ని కాపాడినందుకు ఫిదా అయిపోయారు. సూప‌ర్ హీరో అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.