Hyderabad | ఉద్యోగంలో కొనసాగాలంటే.. ఆ పురుషులకు ముద్దులు ఇవ్వాల్సిందే..

Hyderabad | ఓ మహిళను ఫిట్‌నెస్ శిక్షకురాలిగా ఉద్యోగంలోకి తీసుకున్నారు. కానీ ఆమె చేత అసాంఘిక కార్యకలాపాలు చేయించేందుకు ఒత్తిడి చేస్తున్నారు. తాము చెప్పినట్టు చేస్తేనే ఉద్యోగంలో కొనసాగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. పంజాగుట్ట కేంద్రంగా నిర్వహిస్తున్న ఓ మర్దన కేంద్రంలో ఫిట్‌నెస్ శిక్షకురాలిగా చేరారు. ఇక ఆ కేంద్రానికి వచ్చే వారికి మర్దన చేయడం, శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయాలని ఆమెకు నిర్వాహకులు సూచించారు. ఇందుకు గానూ నెలకు రూ. లక్ష వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు.
కానీ 20 రోజుల తర్వాత ఆమెకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. మర్దనకు వచ్చే పురుషులకు ముద్దులు ఇవ్వాలని, వారి కోరికలను తీర్చాలని ఫిట్‌నెస్ శిక్షకురాలికి నిర్వాహకుల నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. ఉద్యోగంలో కొనసాగాలంటే తాము చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. నిర్వాహకుల బెదిరింపులు అధికమవడంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్వాహకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.