మోదీ స‌ర్కార్‌పై క‌న్నెర్ర‌.. మార్చి 31న ఇండియా కూట‌మి మ‌హా ర్యాలీ..

దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇండియా కూటమి మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ‘మహా ర్యాలీ’ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కులు గోపాల్ రాయ్ ఆదివారం ప్ర‌క‌టించారు. ఇండియా కూట‌మిలో భాగమైన ఆప్, కాంగ్రెస్ క‌లిసి ఈ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాయి.

మోదీ స‌ర్కార్‌పై క‌న్నెర్ర‌.. మార్చి 31న ఇండియా కూట‌మి మ‌హా ర్యాలీ..

న్యూఢిల్లీ : దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇండియా కూటమి మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ‘మహా ర్యాలీ’ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కులు గోపాల్ రాయ్ ఆదివారం ప్ర‌క‌టించారు. ఇండియా కూట‌మిలో భాగమైన ఆప్, కాంగ్రెస్ క‌లిసి ఈ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాయి.

దేశంలో ప్ర‌స్తుతం చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌కు వ్య‌తిరేకంగా ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మ‌హా ర్యాలీ నిర్వ‌హించ‌బోతున్నామ‌ని గోపాల్ రాయ్ తెలిపారు. ఇండియా కూట‌మిలోని అగ్ర నాయ‌కులంతా ఈ ర్యాలీలో పాల్గొంటార‌ని పేర్కొన్నారు. దేశం, ప్ర‌జాస్వామ్యం రెండు కూడా ప్ర‌మాదంలో ప‌డ్డాయ‌ని, దేశ ప్ర‌యోజ‌నాల‌ను, ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించేందుకు కూట‌మిలోని అన్ని పార్టీలు ర్యాలీలో పాల్గొంటాయ‌ని చెప్పారు. బీజేపీ ప్ర‌భుత్వం అర‌వింద్ కేజ్రీవాల్‌ను ఒక్క‌రిని మాత్ర‌మే బెదిరించ‌డం లేదు. మొత్తం ప్ర‌తిప‌క్షాన్ని బెదిరిస్తున్నారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థ‌ల‌ను అడ్డం పెట్టుకుని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. వారికి లొంగ‌క‌పోతే.. బెదిరింపుల‌కు పాల్ప‌డి త‌ప్పుడు కేసులు న‌మోదు చేస్తున్నార‌ని రాయ్ పేర్కొన్నారు.

ఇండియా కూట‌మిలోని నేత‌లంద‌రినీ లక్ష్యంగా చేసుకుని, త‌ప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. బీజేపీ ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర‌సిస్తుంటే.. త‌మ‌ను నిర్బంధిస్తున్నార‌ని తెలిపారు. కేజ్రీవాల్ కుటుంబాన్ని గృహ‌నిర్బంధంలో ఉంచారు. ఆప్ కార్యాల‌యానికి సీల్ వేశారని రాయ్ గుర్తు చేశారు. ఇక హేమంత్ సోరెన్, మ‌మ‌తా బెన‌ర్జీ, తేజ‌స్వీ యాద‌వ్‌ను కూడా మోదీ స‌ర్కార్ టార్గెట్ చేసింద‌న్నారు. దేశాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయని ఆప్ నేత రాయ్ స్ప‌ష్టం చేశారు.