Kia Car Price Hike | కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన కియా.. ఆ మోడల్స్ కార్లపై ఏప్రిల్ నుంచి ధరల పెంపు..!

Kia Car Price Hike | దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా మోటార్స్ కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. కియా సోనెట్, క్యారెన్స్, సెల్టోస్ మోడల్స్‌పై గరిష్ఠంగా 3శాతం వరకు ధర పెరగనున్నది. కమోడిటీస్ ధరల పెరుగుదల, సరఫరా గొలుసు సంబంధిత ఇన్‌పుట్ కాస్ట్ పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీ చెప్పింది. ఈ ఏడాదిలో ధరలు పెంచడం ఇదే తొలిసారి అని కంపెనీ పేర్కొంది. అయితే, ఏ మోడల్‌పై ఎంత పెరగనున్నదో వెల్లడించలేదు.
అయితే, మోడల్, వేరియంట్ బట్టి ధరల్లో మార్పులుండవచ్చని సమాచారం. సోనెట్ రూ.7.99 లక్షల నుంచి 14.69లక్షల వరకు ఉంటుంది. కియా క్యారెన్స్ ఎంపీవీ ధర రూ.10.45లక్షల నుంచి రూ.18.95లక్షల వరకు ఉంటుంది. దేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా ఉన్న సెల్టోస్ ధర రూ.10.90 లక్షల నుంచి నుంచి రూ.20.30లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ షోరూం ధరలు కాగా.. ఆన్ రోడ్ ధరలు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. అయితే, ధరల సర్దుబాటుపై కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ స్పందిస్తూ.. వినియోగదారులకు ప్రీమియం, సాంకేతికంగా అత్యాధునిక ఉత్పత్తులను అందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు.
అయితే, కమోడిటీస్ ధరల పెరుగుదల, ఎక్స్‌ఛేంజ్ రేట్, పెరుగుతున్న ఇన్‌ఫుట్ ధరల కారణంగా పాక్షికంగా ధరలను పెంచకతప్పడం లేదన్నారు. వినియోగదారులపై ఎక్కువగా ప్రభావం పడకుండా కంపెనీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. భారత్‌లో కియా జోరు కొనసాగుతున్నది. సెల్టోస్ 6.13 లక్షల యూనిట్లు, సోనెట్ 3.95 లక్షల యూనిట్లు, క్యారెన్స్ 1.59 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈవీ 6 ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) మార్గంలో భారత్‌లోకి ఈసుకువచ్చింది. ఇదిలా ఉండగా.. మరికొన్ని ఆటో మొబైల్ కంపెనీలు సైతం ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నాయి.