అసమ్మతిని సహించేది లేదన్న కాంగ్రెస్.. 39మందిపై వేటు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 39 మంది నాయకులను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆరేళ్లపాటు బహష్కరించింది.

- మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో కలకలం
- ఆరేళ్లపాటు పార్టీ నుంచి రెబెల్ అభ్యర్థుల బహిష్కరణ
విధాత : పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 39 మంది నాయకులను ఆరేళ్లపాటు బహష్కరిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పార్టీ నిర్ణయానికి వ్యతిరేకించి, రెబెల్ అభ్యర్థులుగా పోటీలో నిలిచినవారే కావడం గమనార్హం.
కీలక నేతలైన మాజీ ఎంపీ ప్రేమ్ చంద్ కుడ్డూ, మాజీ ఎమ్మెల్యేలు అంతర్ సింగ్ దర్బార్, యాద్వేంద్ర సింగ్, రాష్ట్ర పార్టీ మాజీ అధికార ప్రతినిధి అజయ్ సింగ్ యాదవ్ తదితరులు క్రమశిక్షణ చర్యలకు గురైనవారిలో ఉన్నారు. బహిష్కరణకు గురైనవారిలో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండగా, మరికొందరు సమాజ్‌వాది, బహుజన సమాజ్‌వాది, ఆమ్ ఆద్మీ టికెట్‌లపై పోటీ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించేందుకు మంచి అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
అనేక సర్వేలు సైతం ఈ సారి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం ఖాయమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని దెబ్బతీసేందుకు జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ఈ చర్య ద్వారా అధిష్ఠానం స్పష్టం చేసిందని పార్టీ నేతలు అంటున్నారు. నవంబర్ 17న ఒకే విడుతలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎలాగైనా అధికారం నిలుపుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే.. ఈసారి తప్పకుండా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పోరాడుతున్నది.