Gangula Kamalakar | క‌రీంన‌గ‌ర్‌లో ‘కాపు’ రాజ‌కీయం.. నాలుగోసారి ‘గంగుల’ గ‌ట్టేక్కేనా..?

Gangula Kamalakar | క‌రీంన‌గ‌ర్‌లో ‘కాపు’ రాజ‌కీయం.. నాలుగోసారి ‘గంగుల’ గ‌ట్టేక్కేనా..?

Gangula Kamalakar | క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. క‌రీంన‌గ‌ర్ రాజ‌కీయాల‌న్ని కాపుల చుట్టే తిరుగుతున్నాయి. 15 ఏండ్ల క్రితం వ‌ర‌కు కూడా అగ్ర‌వ‌ర్ణాలు పాలించిన క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ.. 2009 సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీసీల చేతిలోకి వెళ్లింది. ఆ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీసీ నినాదం తెర‌పైకి రావ‌డంతో.. వెల‌మ సామాజిక వ‌ర్గం వెన‌క్కి నెట్ట‌బ‌డింది. 60 వేల ఓట‌ర్లకు పైగాఉన్న మున్నూరు కాపు సామాజిక వ‌ర్గం వైపు ఆయా పార్టీలు దృష్టి సారించాయి. ఒక్క‌సారిగా స‌మీక‌ర‌ణాలు మార‌డంతో.. అన్ని రాజ‌కీయ పార్టీలు మున్నూరు కాపుల‌కే టికెట్లు కేటాయించాయి.

2009లో మున్నూరుకాపు సామాజిక వ‌ర్గానికి చెందిన‌ గంగుల కమలాకర్ టీడీపీ త‌ర‌పున భారీ మెజార్టీతో గెలుపొంది, తొలిసారిగా అసెంబ్లీ గ‌డ‌ప తొక్కారు. 2014, 2018 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న విజ‌యం సాధించారు. వరుస గెలుపుతో విజయకేతనం ఎగురవేస్తున్న గంగులపై వెలమ సామాజికవర్గాన్ని బరిలోకి దించడానికి సాహాసించని ఇతర పార్టీలు.. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలనే బరిలోకి దించుతున్నాయి.

ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున బండి సంజ‌య్ పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నిక‌ల్లో గంగుల‌పై సంజ‌య్ పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో గంగుల క‌మ‌లాక‌ర్ 14,976 ఓట్ల మెజార్టీతో హాట్రిక్‌ సాధించారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి ఇంకా ఖ‌రారు కాలేదు. కానీ పురుమ‌ల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి బ‌రిలో ఉండే అవ‌కాశం ఉంద‌ని స్థానిక నాయ‌క‌త్వం చ‌ర్చించుకుంటోంది. బొమ్మకల్ గ్రామ సర్పంచ్‌గా చేసిన అనుభవంతో పాటు కరీంనగర్ మండల జడ్పీటీసీగా తన సతీమణిని గెలిపించుకున్న పురుమల్ల ఈ సారి అసెంబ్లీకి మొదటిసారి తలపడుతున్నారు. 23 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో వరుస విజయాలే తప్ప ఓటమి అంటే తెలియని గంగుల‌.. బండి సంజ‌య్‌ను, కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని ఎదుర్కోని, నాలుగోసారి అసెంబ్లీ గ‌డ‌ప తొక్కుతారా..? అనే ప్ర‌శ్న‌కు డిసెంబ‌ర్ 3న స‌మాధానం దొర‌క‌నుంది.

గంగుల రాజ‌కీయ నేప‌థ్యం..

బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన గంగుల క‌మ‌లాక‌ర్ త‌న రాజ‌కీయ ప్రస్థానాన్ని 2000 సంవ‌త్స‌రంలో ప్రారంభించారు. 2000 నుంచి 2005 వరకు కరీంనగర్‌ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌, 2005-09 వరకు కరీంనగర్‌ నగరపాలకసంస్థ కార్పొరేట‌ర్‌గా సేవ‌లందించారు. 2009, 2004, 2018 ఎన్నిక‌ల్లో కరీంనగర్‌ ఎమ్మెల్యేగా విజయాలు అందుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 30,450 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తెలంగాణేతర పార్టీలో ఉంటూ అవమానాలు భరించలేమని టీడీపీకి రాజీనామా చేసి 2013 ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో 24,750 ఓట్ల మెజార్టీ, తిరిగి 2018 ఎన్నికల్లో 14,976 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించిన తొలి ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. 2019 సెప్టెంబర్‌ 8న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రివర్గంలో బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా చేరారు.