ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆరెస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు ఇటు బీఆరెస్‌కానీ, అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో అభ్యర్థుల ఖరారులో ఇరుపార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

నల్లగొండకు కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరికి భిక్షమయ్య గౌడ్?
ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన
హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు ఇటు బీఆరెస్‌కానీ, అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో అభ్యర్థుల ఖరారులో ఇరుపార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. నల్లగొండ ఎంపీ స్థానానికి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరికి భిక్షమయ్య గౌడ్ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
భువనగిరికి భిక్షమయ్య గౌడ్ ఖరారు వెనుక….
బీఆరెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. బి.భిక్షమయ్యగౌడ్, చెరుకు సుధాకర్, బాలరాజ్ యాదవ్, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన తనయుడు ప్రశాంత్‌రెడ్డి, జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల పేర్లు ప్రముఖంగా పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. ఒకదశలో 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న పోచంపల్లి ఎంపిపీ ఎం. ప్రభాకర్‌రెడ్డి పేరు కూడా తీవ్రంగా పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ నల్లగొండ ఎంపీ రెడ్డికి ఇచ్చి, భువనగిరి కూడా రెడ్డి కమ్యూనిటీకి ఇస్తే బావుండదని, రెండింటిలో ఏదో ఒకటి బీసీలకు కేటాయించాలని ఉమ్మడి నల్లగొండకు చెందిన ఒక సీనియర్ నాయకుడు అధిష్టానానికి సూచించినట్లు తెలిసింది. నల్లగొండ ఎంపీ సీటు బీసీలకు ఇస్తే యాదవులకు ఇవ్వాలని, భువనగిరి ఇవ్వాల్సివస్తే గౌడ కమ్యూనిటీకి ఇవ్వాలని సీనియర్ నేత ప్రతిపాదన తెచ్చినట్లు తెలిసింది. గతంలో నల్లగొండ పార్లమెంటు పరిధిలో యాదవులకు మంచి అవకాశాలు ఇవ్వడం జరిగిందని, ఒక రాజ్యసభ, రెండు చోట్ల ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వడంతోపాటు కార్పొరేషన్ పదవులు కూడా ఇచ్చిన దృష్ట్యా ఈసారి నల్లగొండ స్థానాన్ని రెడ్డి సామాజికవర్గానికి ఇచ్చి, భువనగిరి సీటు బీసీ(గౌడ)లకు ఇవ్వాలన్నస్పష్టతకు బీఆరెస్ అధినేత వచ్చినట్లు సమాచారం. ఇక్కడ గౌడ సామాజికవర్గం మద్దతు ఎక్కువగా బీఆరెస్‌కే ఉందని అధిష్టానం నమ్ముతోంది. దీంతో వారికి టికెట్ ఇవ్వడం సముచితంగా ఉంటుందన్న ఆలోచనకు వచ్చింది. గతంలో ఇక్కడ బూర నర్సయ్య గౌడ్‌కు బీఆరెస్ అవకాశం ఇచ్చినా, ఆయన పార్టీ మారిపోవడంతో భిక్షమయ్య గౌడ్‌కు భువనగిరి ఎంపీ సీటు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆది, సోమవారాల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
నల్లగొండకు కంచర్ల పేరు ఖరారు..
నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీఆరెస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి తాను నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తానని పలుమార్లు అభిప్రాయం వెల్లబుచ్చారు. కానీ వారు కాంగ్రెస్‌లోకి మారుతారనే ప్రచారం నేపధ్యంలో ఆయన పేరును అధిష్టానం సీరియస్‌గా పరిశీలించలేదని సమాచారం. ఇంకా ఈ స్థానానికి మాజీ ఎంపీ (రాజ్యసభ) బడుగుల లింగయ్య యాదవ్ పేరును అధిష్టానం సీరియస్‌గా పరిశీలించినా, ఇప్పటికే భువనగిరి సీటు బీసీలకు ఖరారు చేసినందున నల్లగొండ స్థానం కూడా బీసీలకు ఇవ్వడం సరికాదనే అభిప్రాయానికి రావడంతో ఆయన పేరు తప్పించినట్లు తెలుస్తోంది. దీంతో కంచర్ల కృష్ణారెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌ల పేర్లను అధిష్టానం తీవ్రంగా పరిశీలించింది. ఒక దశలో నల్లగొండ ఎంపీ స్థానానికి గిరిజన అభ్యర్థిని నిలిపితే బావుంటుందనే ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కంచర్ల కృష్ణారెడ్డిని భువనగిరి ఎంపీగా పోటీ చేయిస్తే నల్లగొండలో యాదవ, ఎస్టీ సామాజికవర్గాలకు అవకాశం ఇవ్వాలని చర్చకు వచ్చినట్లు సమాచారం. అంతిమంగా భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే, ప్రజల్లో ఆదరణ ఉన్న బీసీ నేత భిక్షమయ్య గౌడ్‌ను, మునుగోడు ఎమ్మెల్యే స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన కంచర్ల కృష్ణారెడ్డిని నల్లగొండ ఎంపీగా నిలిపితే బావుంటుందనే నిర్ణయానికి పార్టీ అధిష్టానం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.