గోవాలో తొలిసారిగా మహిళకు బీజేపీ ఎంపీ టికెట్.. ఎవరీ పల్లవి డెంపో..?
గోవాలో తొలిసారిగా ఓ మహిళకు బీజేపీ ఎంపీ టికెట్ కేటాయించి, చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు గోవాలో బీజేపీ మహిళలకు అవకాశం ఇవ్వలేదు. ప్రముఖ పారిశ్రామివేత్త పల్లవి డెంపోను సౌత్ గోవా నుంచి బరిలోకి దింపుతున్నట్లు బీజేపీ ప్రకటించింది.

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 111 మంది అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను బీజేపీ ఆదివారం రాత్రి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో చాలా వరకు కొత్త ముఖాలు కనిపించాయి. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు మండీ(హిమాచల్‌ప్రదేశ్) ఎంపీ టికెట్ కేటాయించారు. ఇకపోతే గోవాలో తొలిసారిగా ఓ మహిళకు బీజేపీ ఎంపీ టికెట్ కేటాయించి, చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు గోవాలో బీజేపీ మహిళలకు అవకాశం ఇవ్వలేదు. ప్రముఖ పారిశ్రామివేత్త పల్లవి డెంపోను సౌత్ గోవా నుంచి బరిలోకి దింపుతున్నట్లు బీజేపీ ప్రకటించింది.
ఎవరీ పల్లవి డెంపో..?
గోవాలోని డెంపో ఇండస్ట్రీస్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పల్లవి డెంపో(49) కొనసాగుతున్నారు. పారిశ్రామికవేత్తగా, విద్యావేత్తగా ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. పుణెలోని ఎంఐటీలో ఆమె కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పట్టా కూడా పుచ్చుకున్నారు.
పల్లవి డెంపో ఇండో – జర్మన్ ఎడ్యుకేషనల్, కల్చరల్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. వెండెల్ రోడ్రిక్స్ ప్రారంభించిన ఫ్యాషన్, టెక్స్‌టైల్ మ్యూజియం మోడా గోవా ఫౌండేషన్‌కు ఆమె ట్రస్టీగా ఉన్నారు. 2012 నుండి 2016 వరకు గోవా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అకడమిక్ కౌన్సిల్‌లో సభ్యురాలిగా పనిచేశారు.
డెంపో భర్త శ్రీనివాస్ డెంపో.. ప్రముఖ పారిశ్రామికవేత్త. గోవా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌కు అధిపతిగా కొనసాగుతున్నారు. రూరల్ స్కూల్ అడాప్షన్ ప్రోగ్రామ్ కింద ఓ ప్రభుత్వ పాఠశాలను డెంపో కుటుంబం దత్తత తీసుకుంది. పాఠశాలలోని బాలికలకు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తున్నారు.
సౌత్ గోవా స్వరూపం ఇదే..
ప్రస్తుతం సౌత్ గోవా నుంచి లోక్‌సభకు కాంగ్రెస్ నేత ఫ్రాన్సిస్కో సర్దిన్హా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1962 నుంచి ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే సౌత్ గోవా నుంచి బీజేపీ గెలుపొందింది. 1999, 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. సౌత్ గోవా లోక్‌సభ పరిధిలో మొత్తం 20 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.