బిగ్ బాస్ విన్న‌ర్‌కి 14 రోజుల పాటు రిమాండ్..గెలిచిన ఆనందం కూడా లేదుగా..!

బిగ్ బాస్ విన్న‌ర్‌కి 14 రోజుల పాటు రిమాండ్..గెలిచిన ఆనందం కూడా లేదుగా..!

రైతు బిడ్డ‌గా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టి రైతు బిడ్డ సెంటిమెంట్‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకొని బిగ్ బాస్ విన్న‌ర్‌గా అవ‌త‌రించాడు. అయితే ఎప్పుడైతే హౌజ్ నుండి ప్ర‌శాంత్ బ‌య‌ట‌కు వ‌చ్చాడో అప్ప‌టి నుండి అత‌ను వివాదాల‌లో మునిగి తేలుతున్నాడు. రీసెంట్‌గా బిగ్ బాస్ 7 విజేత, ప్రముఖ యూట్యూబర్ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించకుండా మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.ఈ కేసుపై విచారణ జరుగుతుందనీ, తదుపరి విషయాలు త్వరలో వెల్లడిస్తామ‌ని ఏసీపీ హరి ప్రసాద్ మీడియాతో అన్నారు. ఇలాంటి అసాంఘిక చర్యల్లో యువ‌త పాల్గొన‌వ‌ద్దని కూడా ఆయ‌న సూచించారు.

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఈనెల 17వ తేదీన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన ఘర్షణలు ఏ రేంజ్‌లో జ‌రిగాయో మ‌నం చూశాం. పల్లవి ప్రశాంత్‌కు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్న ఆయన అభిమానులు రోడ్డుపై నానా భీబ‌త్సం సృష్టించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడంపై ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యూసెన్స్ క్రియేట్ చేయడాన్ని సుమోటోగా తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేయ‌గా, పల్లవి ప్రశాంత్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు.

ఈ కేసులో మొత్తం ఐదుగురిని నిందితులుగా పేర్కొనగా..ముందుగా ప్ర‌శాంత్ కారు డ్రైవర్లు సాయికిరణ్, రాజులను అరెస్టు చేశామనీ, అలాగే బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మహా విరాన్ లను అరెస్టు చేసినట్టు ఏసీపీ తెలిపారు. A1 గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చారు పోలీసులు. 105 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఆటాడి, పోరాడి విజేతగా నిలిచిన ప‌ల్ల‌వి ప్ర‌శాంత్… బిగ్ బాస్ చరిత్రలోనే విజేతగా నిలిచిన సామాన్యుడిగా, రైతుగా స‌రికొత్త రికార్డ్ నెల‌కొల్పాడు. కాని ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చాక చేసిన భీబ‌త్సం చూసి ఎందుకు గెలిపించామా అని చాలా మంది బాధ‌ప‌డ్డారు కూడా.