త‌ల్లిని చితక‌బాది, చిత్ర‌హింస‌ల‌కు గురిచేసిన లాయ‌ర్..

త‌ల్లిని చితక‌బాది, చిత్ర‌హింస‌ల‌కు గురిచేసిన లాయ‌ర్..

వృధ్యాపంలో ఉన్న త‌ల్లికి సేవ‌లు చేయాల్సింది పోయి, ఆమెను చిత‌క‌బాది, హింసించాడు ఓ కుమారుడు. ఏ మాత్రం క‌నిక‌రం లేకుండా మంచంపై ప‌డుకున్న త‌ల్లిపై దాడి చేశాడు. ఇందుకు అత‌ని భార్య‌, కుమారుడు కూడా స‌హ‌క‌రించారు. ఈ దృశ్యాల‌న్నీ అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

వివ‌రాల్లోకి వెళ్తే.. పంజాబ్ రూప్‌న‌గ‌ర్‌కు చెందిన ఆశారాణి(73) అనే వృద్ధురాలు త‌న కుమారుడు అంకూర్ వ‌ర్మ‌, కోడ‌లు సుధా, మ‌నుమ‌డితో క‌లిసి ఉంటోంది. అంకూర్ వ‌ర్మ వృత్తిరీత్యా లాయ‌ర్. ఆశారాణికి ఓ కూతురు కూడా ఉంది. ఆమెకు వివాహ‌మైంది.

ఇక‌ బెడ్‌కే ప‌రిమితమైన ఆశారాణిని ప్ర‌తిరోజూ కుమారుడు, కోడ‌లు, మ‌నుమ‌డు హింసించేవారు. ఇటీవ‌లే ఒక రోజు మ‌నుమ‌డు కావాల‌ని నాన‌మ్మ బెడ్‌పై నీళ్లు పోశాడు. అనంత‌రం ఆమె మూత్ర విస‌ర్జ‌న చేసింద‌ని తండ్రికి అబద్దాలు చెప్పాడు. దీంతో ఏ మాత్రం క‌నిక‌రం లేకుండా త‌ల్లిపై దాడి చేశాడు. చిత‌క‌బాది, చిత్ర‌హింస‌ల‌కు గురి చేశాడు. భార్య‌, కుమారుడు కూడా స‌హ‌క‌రించారు.

అయితే ఆశారాణి కూతురు దీప్‌శిఖా.. త‌ల్లిని చూసేందుకు శ‌నివారం ఇంటికి వ‌చ్చింది. అంకూర్ దాడి చేసిన వివ‌రాల‌ను బిడ్డ‌కు చెప్పుకుని ఆశారాణి విల‌పించింది. దీంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆశారాణి గ‌దిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని, ప‌రిశీలించారు. అంకూర్ దాడి చేసిన దృశ్యాలు స్ప‌ష్టంగా క‌నిపించాయి. సెప్టెంబ‌ర్ 19, అక్టోబ‌ర్ 21, 24 తేదీల్లో ఆశారాణిని హింసించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. అంకూర్‌ను అరెస్టు చేశారు.