మూడు గంటల పాటు అల్లు అర్జున్‌ని ఎండలో నిలబెట్టిన సుకుమార్.. పుష్ప2 ఆలస్యానికి కారణం ఇదా?

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన చిత్రాలలో పుష్ప మూవీ ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాకే కాకుండా ఇందులోని డైలాగ్స్‌కి, పాటలకి ప్రతి ఒక్కరు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. సెలబ్రిటీలు, క్రికెటర్స్ సైతం ఇందులోని పాటలకి స్టెప్పులేసి రచ్చ చేశారు. ఈ క్రమంలో పుష్ప క్రేజ్ విపరీతంగా పెరిగి పెద్ద హిట్ అయింది. ఈ సినిమాతో అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. ఇక బన్నీ ఇప్పుడు పుష్ప 2 అనే చిత్రం చేస్తుండగా, ఈ సినిమా గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం ఇదికాగా, ఈ మూవీ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం అని అంటున్నారు.
ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్యా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె ఇందులో రిపోర్టర్‌గా కనిపించి సందడి చేయనుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి తన పాత్ర గురించి మాట్లాడుతూ..న్యూస్ రిపోర్టర్ రోల్ చేయడం అంత ఈజీ కాదు. కొందరు నటులతో పాటు రియల్ న్యూస్ రిపోర్టర్స్ తో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించగా, ఆ సమయంలో కొందరు నన్ను నెట్టుకుంటూ వెళ్లిపోయారు. అప్పుడు నేను కిందపడిపోయాను. సుకుమార్ గారు పర్‌ఫెక్షన్ వచ్చే వరకు ఆ సీన్‌ని తెరకెక్కిస్తూనే ఉంటారు. పుష్ప 2లో ప్రతి షాట్ కి ఆయన 5 నుండి 35 టేక్స్ తీసుకుంటున్నారు. నటులు ఎటునుంచి రావాలి, ఎలా చూడాలి… ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు.
ఆలస్యమైన పర్వాలేదు. మంచి ఔట్‌పుట్ రావాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఓ సీన్ కోసం అల్లు అర్జున్ 40 టేకులు తీసుకున్నారు. మూడు గంటల పాటు ఎండలో నిలుచున్నారు. సుకుమార్ తాను అనుకున్నది అనుకున్నట్టు తీయాలని అనుకుంటున్నారు. అందుకే అంత ఆలస్యం అవుతుందని , పుష్ప2 మాత్రం అందరి అంచనాలకి మించి ఉంటుందని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఈ మూవీని ఆగస్ట్ 15న విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు.