రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు.. క్రేజీ అప్‌డేట్ అందించిన సౌరవ్ గంగూలి

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌలర్ల గుండెలలో వణుకు పుట్టించే బ్యాట్స్‌మెన్స్‌లలో పంత్ ఒకరు. రిషబ్ పంత్ గతేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేని కారణంగా పంత్ 2023 ఐపీఎల్‌తో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ , వరల్డ్ కప్ 2023కి కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే పంత్ రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభిమానుల ఎదురు చూపులకి త్వరగా పులిస్టాప్ పెట్టేందుకు పంత్ కూడా చాలా కష్టపడుతున్నాడు.
తాజాగా పంత్ రీఎంట్రీ గురించి. ఆయన ఫిట్‌నెస్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు సౌరవ్ గంగూలి. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న పంత్.. వచ్చే సీజన్ వరకు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని దాదా ఆశాభావం వ్యక్తంచేశాడు.పంత్ ఐపీఎల్ తదుపరి ఎడిషన్‌లో ఆడతాడని , ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా తిరిగి వస్తాడని గంగూలీ అన్నారు. పంత్ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, అతను జట్టు శిబిరంలో ప్రాక్టీస్ చేయలేదు. పంత్‌తో ప్రస్తుతం టీమ్ మేనేజ్‌మెంట్ చర్చిస్తుంది. త్వరలో జరగనున్న వేలం గురించి చర్చ జరిగిందని గంగూలీ తెలియజేశారు. ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడనుండగా వాటితో పాటు, మార్చి నెలాఖరులో వచ్చే ఐపీఎల్ లో రిషబ్ పంత్ బ్యాట్‌తో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
కొన్ని రోజుల క్రితం, పంత్ భారత దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటాడని వార్తలు వచ్చిన కూడా అవి అవాస్తవాలుగానే మిగిలిపోయాయి. వచ్చే ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే సిరీస్ కోసం పంత్ టీమ్ ఇండియాకు తిరిగి వస్తాడని నేషనల్ మీడియా చెప్పుకొస్తుంది. కాగా, గతేడాది డిసెంబర్ 30న పంత్ ఢిల్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై కారు బోల్తా పడడంతో పంత్ గాయపడ్డాడు. ఈ క్రమంలో ఆయన లిగమెంట్ సమస్యతో బాధపడ్డాడు. ఇందుకోసం అతనికి శస్త్రచికిత్స జరిగింది.