Telangana politics: తెలంగాణ రాజకీయాల్లో స్టేచర్..స్ట్రెచర్.. మార్చురీ లొల్లి!

Telangana politics: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం స్టేచర్.. స్ట్రెచర్.. మార్చురీ లొల్లి రచ్చ రేపింది. నిన్న విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన విమర్శలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పరస్పరం మాటల మంటలు రేపాయి. కొంతమంది స్టేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకు పంపించారని.. ఇట్లానే చేస్తే మార్చురీకి కూడా పంపిస్తారని వ్యాఖానించారు. స్టేచర్ అనేది స్థానానికి తప్ప వ్యక్తులకు ఉండదన్నారు.
ఇంకేముంది సీఎం రేవంత్ రెడ్డిపై సాధరణంగానే ఒంటికాలిపై గయ్యున లేచే బీఆర్ఎస్ నాయకులు మూకుమ్మడిగా విమర్శల దాడికి దిగారు. ఈ పిచ్చి కుక్క మర్యాద యొక్క ప్రతి ఒక్క పరిమితిని దాటిందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. అతని కుటుంబ సభ్యులు వీలైనంత త్వరగా ఆయనను మానసిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లమని నేను అభ్యర్థిస్తున్నాను, లేకుంటే అతని నిరుత్సాహ స్థితిలో చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరినీ కొరుకుతాడని ఎద్దేవా చేశారు. స్టేచర్ లేకున్నా, పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయని కేటీఆర్ మండిపడ్డారు.
రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందిస్తూ రేవంత్ రెడ్డి కి కాన్సిల్ జబ్బు సోకిందని, ఎన్నికలపుడు తాను చెప్పినవన్నీ కాన్సిల్ అంటున్నాడని వంగ్యంగా విమర్శించారు. ప్రతిపక్షనేతలు ప్రజల పక్షాన పోరాడుతుంటే వాళ్ళ మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డి ది అని మండిపడ్డారు. పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం మార్చురీ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పాలన చేతకాక రేవంత్ ‘పరనింద”నే పనిగా పెట్టుకున్నారు. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి తాను ఉన్నది సీఎం పదవిలో అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుని చిల్లర వేషాలు మానితే మంచిదని హితవు పలికారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ ఉద్యమ నేత, ప్రజా నాయకుడు కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర అక్షేపనీయమన్నారు. మానవత్వం లేని ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకోవాలని, ఇటువంటి దుశ్చర్యను తెలంగాణ సమాజం గమనిస్తోందని.. సమయం వచ్చినపుడు ఇంతకింత మీకు శాస్తి జరుగుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా సైతం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కౌంటర్లు వేస్తుంది. స్టేచర్..స్ట్రెచర్..మార్చురీ అనే పదాలు వాడి సీఎం రేవంత్ రెడ్డి పలుచనైపోయాడని.. పెద్దవారిని తిడితే పెద్దగైపోతాననే భ్రమలో తేలియాడుతున్నాడని.. ఇక కాంగ్రెస్ కాటికే.. వయా మార్చురీ! అంటూ విమర్శలు గుప్పించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం రేవంత్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 లక్షల పిచ్చి కుక్కలకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని, నువ్వొక మాటంటే, మేము 100 మాటలు అంటాం తస్మాత్ జాగ్రత్తా అంటూ హెచ్చరించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ అధిష్టానం నమ్మక , పరిపాలన చేతగాక ప్రజాక్షేత్రంలో జీరో అవుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి పోయి ప్రస్టేషన్ లో రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మాటలు జుగుప్సాకరమని, సీఎం హోదాను దిగజార్చేలా మాట్లాడుతున్నాడని ఆక్షేపించారు. పాలన చేత కాక బజారు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు.
రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నేతల విమర్శలపై కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. పిచ్చి కుక్క కరిచినట్టు కేటీఆర్ మాట్లాడితే…తెలంగాణ ప్రజలు కేటీఆర్ ను రాళ్లతో తరిమికొడతారని వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి పిచ్చి ముదిరిందో…ఎవరు అసెంబ్లీకి రాకుండా…ఫాంహౌజ్ కు పరిమితమై పడుకున్నారో…తెలంగాణ ప్రజలందరికీ తెలుసంటూ చురకలేశారు. సీఎం హోదాలోని వ్యక్తిపై అడ్డగోలుగా మాట్లాడటం రివాజుగా మారిందని..80వేల పుస్తకాలు చదివిన మీ నాయన సీఎం కుర్చీని గౌరవించేది ఎట్లనో నేర్పలేదా అని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని కేటీఆర్ కు బల్మూరి వెంకట్ హెచ్చరించారు.