Talasani Srinivas Yadav | సనత్ నగర్‌లో తలసాని హ్యాట్రిక్ కొడతారా..? మంత్రిపదవి దక్కేనా..?

Talasani Srinivas Yadav | తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈ పేరు అందరికీ సుపరిచితమే. పక్క రాష్ట్రాల్లోని యాదవుల్లో కూడా తలసానికి ఫాలోయింగ్ ఉంది. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో కూడా తలసానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి పోటీ పడుతున్నారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మూడోసారి బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి తలసాని హ్యాట్రిక్ కొట్టి, మంత్రి పదవి దక్కించుకుంటారా..? అని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఐదు సార్లు గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరో సారి గెలుపు కోసం ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలెట్టారు.
తలసాని రాజకీయ నేపథ్యం..
తలసాని రాజకీయ జీవితం 1986లో ప్రారంభమైంది. మోండా మార్కెట్ కార్పొరేటర్‌గా 1986లో పోటీ చేశారు. జనతా పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆయన ఓటమి చవిచూశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 1994లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తలసాని కాంగ్రెస్ పార్టీకి చెందిన మేరీ రవీంద్రనాథ్‌పై విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో కార్మిక, పర్యాటక శాఖల మంత్రిగా పని చేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి టీ పద్మారావు గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పిట్ల కృష్ణపై 18 వేల మెజార్టీతో గెలుపొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ చేతిలో ఓటమి పాలయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో సనత్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సమక్షంలో చేరారు. కేసీఆర్ కేబినెట్‌లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సినిమాటోగ్రఫి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ సనత్ నగర్ నుంచి గెలుపొందిన తలసాని, కేసీఆర్ కేబినెట్‌లో మత్స్యశాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఇక ఈ నియోజకవర్గం నుంచి తలసాని హ్యాట్రిక్ కొడుతారా..? అనేది డిసెంబర్ 3న తేలనుంది. ఇక కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా సతీమణి కోట నీలిమ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. గతంలో ఆమె జర్నలిస్టుగా పని చేశారు. బీజేపీ తరపున మర్రి శశిధర్ రెడ్డి బరిలో ఉన్నారు.