Silver Price | త్వరలోనే అందనంత ఎత్తుకు చేరనున్న వెండి..! కిలోకు రూ.1.25లక్షలకు చేరువలో ధర…!

ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వెండి ధర భారీగా పెరుగుతూ వస్తున్నది. ఇప్పటికే వెండి ధర కిలోకు లక్ష మార్క్‌ను దాటింది. త్వరలోనే లక్షను అధిగమించి రూ.1.25లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా.

Silver Price | త్వరలోనే అందనంత ఎత్తుకు చేరనున్న వెండి..! కిలోకు రూ.1.25లక్షలకు చేరువలో ధర…!

Silver Price | ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వెండి ధర భారీగా పెరుగుతూ వస్తున్నది. ఇప్పటికే వెండి ధర కిలోకు లక్ష మార్క్‌ను దాటింది. త్వరలోనే లక్షను అధిగమించి రూ.1.25లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఓ నివేదికలో వెండి ధరలకు సంబంధించిన కీలక నివేదికను విడుదల చేసింది. బ్రోకరేజ్‌ సంస్థ నివేదికలో ధరలు తగ్గుతున్న నేపథ్యంలో వెండిని కొనుగోలు చేయాలని పెట్టుబడిదారులకు సూచించింది. బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజాగా వెండిపై త్రైమాసిక నివేదికను విడుదల చేసింది. దీనిలో పెట్టుబడిదారులు ధ‌ర‌లు త‌గ్గిన‌ప్పుడే వెండిని కొనుగోలు చేయాలని తెలిపారు. బ్రోకరేజ్ హౌస్ వెండి ధరలకు సంబంధించి దాని పాత టార్గెట్ ధరను సవరించింది. మోతీలాల్ ఓస్వాల్ ఇటీవల వెండికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. వెండి టార్గెట్‌ కిలో ధర రూ.లక్ష నుంచి రూ.1.25లక్ష వరకు పెంచింది. కామెక్స్‌లో టార్గెట్‌ ఔన్స్‌కు 40 డాలర్లుగా పేర్కొంది. రాబోయే ఏడాది నుంచి ఏడాదిన్నర నెలలో లక్ష్యం చేరే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ కంపెనీ నివేదికలో వెల్లడించింది. కంపెనీ ప్రకారం.. ఇటీవల నెలల్లో వెండి ధరలు 30శాతం వరకు ఎగిశాయి. దాంతో స్వల్ప విరామాల్లో ప్రాఫిట్‌ బుకింగ్స్‌ కనిపించవచ్చని.. వెండిలో ఏదైనా తగ్గుదల కనిపిస్తే కొనుగోలుకు అవకాశం తీసుకోవాలని చెప్పింది. వెండి రూ.86వేల నుంచి రూ.86,500 మధ్య వెండికి ప్రధాన మద్దతు స్థాయి అని బ్రోకరేజ్‌ సంస్థ పేర్కొంది. వెండి స్లో మూవర్ అనే ట్యాగ్ బయటపడి.. ఈ ఏడాది ధరలు భారీగా పెరిగినట్లుగా నివేదిక వెల్లడించింది.

బంగారం, వెండి పోటాపోటీగా పెరుగుతున్నాయి.. దాంతో వెండి భారీ పెరుగుదల దిశగా ముందుకు సాగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వడ్డీరేట్ల తగ్గింపుపై ఫెడ్ నిర్ణయం కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికాలో బలహీనత కారణంగా బంగారం, వెండికి డిమాండ్‌ కనిపిస్తున్నది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఫెడ్‌ సమావేశం కానున్నది. ఇందులో వడ్డీ రేట్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా వెండి దిగుమతి భారీగానే పెరిగింది. ఈ ఏడాది నాటికి 4వేల టన్నులకు చేరుకున్నది. ప్రస్తుతం వెండిని జనం పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా వెండి సరఫరా డిమాండ్‌ కంటే తక్కువగా ఉండవచ్చని సిల్వర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. చైనాలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి కారణంగా వెండి ధరలు పెరిగే అవకాశాలున్నట్లుగా అంచనా.