టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో నిందితుల గైర్హాజర్‌పై నాంపల్లి కోర్టు సీరియస్‌గా స్పందించింది. శనివారం జరుగాల్సిన విచారణకు ఏడుగురు నిందితులు

విధాత, హైద్రాబాద్ : టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో నిందితుల గైర్హాజర్‌పై నాంపల్లి కోర్టు సీరియస్‌గా స్పందించింది. శనివారం జరుగాల్సిన విచారణకు ఏడుగురు నిందితులు గైర్హాజర్ కావడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏడుగురు నిందితులకు ఒకేసారి నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది. నిందితుల గైర్హాజర్ పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది. ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో వంద మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు. సిట్‌తో విచారణ చేపట్టారు. అయినా టీఎస్‌పీఎస్సీలో వరుస ప్రశ్నాపత్రాల లీకేజీపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకేత్తించింది. ఒకరకంగా నిరుద్యోగులకు, యువతకు బీఆరెస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరగడానికి, అసెంబ్లీ ఎన్నికలలో బీఆరెస్ పార్టీ ఓటమికి ప్రశ్నాపత్రాల లీకేజీ కూడా ప్రధాన కారణమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ కేసు వివరాలు, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ఆయన వెల్లడించారు. దీనికోసం జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఈ పరిణామాల క్రమంలో టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులంతా చైర్మన్ సహా రాజీనామాలు చేశారు. ప్రస్తుతం ఆ రాజీనామాలు గవర్నర్ వద్ధ పెండింగ్‌లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నపత్రాల లీకేజీ లేకుండా టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయడం లేక యూపీఎస్సీ తరహాలో బోర్డును పునర్ వ్యవస్థీకృతం చేయడంపై దృష్టి సారించారు. ఇందుకోసం ఢీల్లీ పర్యటనలో యూపీఎస్సీ చైర్మన్‌ను సైతం సీఎం రేవంత్‌రెడ్డి కలిసి సలహాలు సూచనలు తీసుకోవడం ఈ సందర్భంగా గమనార్హం.