రామంతపూర్ టూ సూర్యాపేట..ఎస్‌బీఐలో మరో 10కోట్ల స్కామ్‌

హైదరాబాద్‌లోని రామంతపూర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ సైదులు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

రామంతపూర్ టూ సూర్యాపేట..ఎస్‌బీఐలో మరో 10కోట్ల స్కామ్‌

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రామంతపూర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ సైదులు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో రామంతపూర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేసిన సైదులు నకిలీ పత్రాలు సృష్టించి ఖాతాదారులకు తెలియకుండా 2.80 కోట్లను కాజేశాడు. ఈ కేసు విచారణ జరుపుతున్న పోలీసులకు సైదులు గతంలో సూర్యాపేట ఎస్‌బీఐ బ్రాంచ్‌లోనూ ఇదే తరహా మోసానికి పాల్పడి 10కోట్లు కొట్టేసినట్లుగా గుర్తించారు. దీంతో అక్కడి ధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

స్కామ్ సాగింది ఇలా

హైదరాబాద్‌లోని రామంతపూర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మేనేజర్‌ షేక్‌ సైదులు పనిచేసిన సమయంలో గంగ మల్లయ్య అనే మరో బ్యాంక్‌ ఉద్యోగి సహాయంతో ఖాతాదారులకు తెలియకుండా వాళ్ల డాక్యుమెంట్లు తీసుకుని లోన్‌లు అప్లై చేశాడు. 19 మంది పేరిట నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు రూ.2.80 కోట్లను కాజేశాడు. రామంతపూర్‌ బ్రాంచ్‌ నుంచి సైదులు బదిలీ అయి వెళ్లగా, కొత్త మేనేజర్‌ రావడంతో సైదులు, మల్లయ్యలు చేసిన మోసం బయటపడింది. దీంతో సైదులుపై కొత్త మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలియడంతో భార్య, కొడుకుతో కలిసి మేనేజర్‌ సైదులు పరారయ్యాడు. వీరికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో విచారణ చేస్తున్న పోలీసులు సైదులు గతంలో ఇలాంటి మోసాలు చేశాడా అన్న కోణంలో విచారణ కొనసాగించారు. ఈ క్రమంలోనే సూర్యాపేట బ్రాంచ్‌లో పనిచేసినప్పుడు ఇదే తరహా మోసం చేసి రూ. 10 కోట్లు కొట్టేసినట్లుగా గుర్తించారు. దీంతో సైదులు బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. సైదులు దొరికితేగాని ఆ స్కామ్‌ల పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.