జీవన్ముక్తి అంటె ఏమిటి?
విధాత: సముద్రపు ఒడ్డున కూర్చుని సంధ్యా సమయాన్ని ఆస్వాధిస్తున్న నాకు అక్కడ ఇసుకలో గూళ్లు కట్టుకుంటూ ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. ఎంతో శ్రద్ధగా కడుతున్నారు. ఎవరి గూడు అందరికంటే బావుంటుందో అనే పోటి కూడా కనిపిస్తోంది వారిలో. నత్తగుల్లలు, గవ్వలు తెచ్చి అందంగా ఆగూడును అలంకరిస్తున్నారు కూడా కొందరు పిల్లలు. వారిని చూస్తే సరదాగా ఉంది, ముచ్చటగాను ఉంది. చీకటి పడుతుండగా ఆట ముగింపుకు వచ్చింది. పిల్లల్లో కొందరి తల్లి దండ్రులు వచ్చి పోదాం రమ్మని పిలుచుకుపోతున్నారు. […]

విధాత: సముద్రపు ఒడ్డున కూర్చుని సంధ్యా సమయాన్ని ఆస్వాధిస్తున్న నాకు అక్కడ ఇసుకలో గూళ్లు కట్టుకుంటూ ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. ఎంతో శ్రద్ధగా కడుతున్నారు. ఎవరి గూడు అందరికంటే బావుంటుందో అనే పోటి కూడా కనిపిస్తోంది వారిలో. నత్తగుల్లలు, గవ్వలు తెచ్చి అందంగా ఆగూడును అలంకరిస్తున్నారు కూడా కొందరు పిల్లలు. వారిని చూస్తే సరదాగా ఉంది, ముచ్చటగాను ఉంది. చీకటి పడుతుండగా ఆట ముగింపుకు వచ్చింది.
పిల్లల్లో కొందరి తల్లి దండ్రులు వచ్చి పోదాం రమ్మని పిలుచుకుపోతున్నారు. ఒక నిమిషం కూడా ఆలస్యం చెయ్యకుండా లేచి వెళ్లి పోతున్నారు కూడా. కొంత మంది పిల్లలు తాము కట్టిన భవంతులు తామే కూల్చేసి మరీ వెళ్లిపోతున్నారు. ఆట ఆడిన సంతృప్తితో ఆనందంగా ఇంటి దారి పడతారు. అప్పటివరకు ఎంతో ప్రేమగా కట్టుకున్న గూడు ఏమైపోతుందో అన్న బెంగ ఒక్కరంటే ఒక్కరి ముఖంలో కూడా కనిపించలేదు. ఆ కట్టడాలకు సంబంధించిన మమకారాలు, వియోగదు:ఖాలు ఏవీ వారికి లేవు.
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ‘‘త్ర్యంబకం యజామహే …‘‘అని మొదలయ్యే మహా మృత్యుంజయ మంత్రం సారాంశమూ ఇలాంటిదే. జీవితాన్ని ఎంత గొప్పగా ప్రణాళికా బద్ధంగా నిర్మించుకున్నప్పటికీ, ఎన్ని గొప్ప ఆత్మీయ బంధాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఎంత ప్రేమానురాగాలను పంచిపెట్టినప్పటికీ, తిరిగి పొందినప్పటికీ ఆట ముగిసే సమయానికి అన్నింటినీ సునాయసంగా తెచ్చుకోవాలని ఆ మంత్రం బోధిస్తుంది.
ఈ అనుబంధాలు, ఈతి బాధలు, జీవిత మమకారాలు ‘‘ఊర్వారుక మివ బంధనం’’ మాదిరిగా ఉండాలనేదే ఈ మంత్ర ఉద్దేశ్యం. దోసపాదుతో దోసకాయ ఎంత గట్టి బంధాన్ని కలిగి ఉంటుందంటే అది పక్వానికి రాక ముందు దోసకాయ పట్టుకొని లాగితే మొత్తం దోస పాదు అంతా కదిలి వచ్చేస్తుంది. నిజానికి మనిషి కూడా జీవితంలో అనుబంధాలు, ఆస్తిపాస్తులు, జయాపజాలు వంటి వాటన్నిటితో ఇటువంటి బంధమే కలిగి ఉంటాడు. అంత త్వరగా వాటిని వదులుకోవడం ఇష్టం ఉండదు. కొన్ని సందర్భాల్లో సాధ్యపడదు కూడా.
పిల్లలు ఇసుక గూళ్లు కట్టినంత ప్రేమగా తన వారికోసం ఏదో సమకూర్చుతుంటాడు. ఆరాట పడుతుంటాడు. అయితే దోసకాయ పండిపోయి పక్వానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. పాదుతో గట్టి బంధం కలిగి ఉన్న దోస పండు దోసపాదు నుంచి చటుక్కున విడిపోతుంది. అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది.
మనిషి కూడా అంతే వయసు పండేకొద్ది జీవితంపై నుంచి పట్టు సడలించుకోవాలి. ఆట ముగిసే సమయానికి పిల్లలు పిచ్చుక గూళ్లు వదిలినంత సులభంగా వదులుకునేందుకు సిద్ధంగా ఉండాలి. తల్లి పిలవగానే పిల్లవాడు అప్పటి వరకు నిర్మించిన గూడును వదిలి ఆనందంగా వెళ్లిపోయినట్టు తుది పిలుపు వినబడగానే ఉన్నఫళంగా వెళ్లేందుకు సంసిద్ధంగా ఉండాలి. పండిన దోసకాయ పాదును వదిలిన చందంగా జీవితాన్ని వదలగలగాలి.
వయసుతో సంబంధం లేకుండా.. అవ్వను సంతోషపరిచిన తాత.. వీడియో వైరల్
సునాయాసంగా మరణించాలని కోరుతూ చేసే ప్రార్థనను పెద్దలు ‘మృత్యుంజయ మంత్రం’గా ప్రకటించడం ఓ విశేషం! ఆ రహస్యం బోధపడితే, మృత్యువును ఆహ్వానించగల స్థితికి మనిషి చేరుకోగలడు. మృత్యువును జయించడం అంటే చావు లేకుండాపోవడం కాదు, మృత్యుభీతిని జయించడం! చివరన తెంచుకోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది.
సాయంత్రం అయ్యేసరికి పిల్లలు అప్పటివరకు నిర్మించిన గూటిని వదిలి నిశ్చింతగా తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ శరీరం, దాని వల్ల మన చుట్టూ అల్లుకున్న అనుబంధాలన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! ఈ శిథిల గృహాన్ని వీడుతున్నాను అనేది అమృత భావన. అటువంటి అమృత భావనకు చేరుకోవడమే ముక్తి. ఇటువంటి ముక్తిని జీవం వదలక ముందే సాధించగలగడాన్ని జీవన్ముక్తి అంటారు.