చిన్న వయస్సులో.. గుండెపోటు ప్రమాదకరం
ఈ అకస్మాత్తు మరణాలు.. పోస్ట్ కొవిడ్ పరిణామాలేనా? విధాత: ఈ మధ్య మనం తరుచూ నడుస్తూ, జిమ్ చేస్తూ, పెళ్లి పీటల మీద ఇలా పలు విధాలుగా ఉన్నట్టుండి కుప్పకూలి మరణిస్తున్న యువత అన్న వార్తలను వింటూ ఉన్నాం.. గడిచిన దశాబ్దాలలో ఇలాంటి వార్తలును మనం చదివింది, వినింది 5% కన్నా తక్కువే. కానీ ఇప్పుడు రోజూ వినాల్సి వస్తుంది. ముఖ్యంగా కరోనా వచ్చి వెళ్లాక ఈ వార్తలు మరి ఎక్కువగా వినిపిస్తున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల […]

ఈ అకస్మాత్తు మరణాలు.. పోస్ట్ కొవిడ్ పరిణామాలేనా?
విధాత: ఈ మధ్య మనం తరుచూ నడుస్తూ, జిమ్ చేస్తూ, పెళ్లి పీటల మీద ఇలా పలు విధాలుగా ఉన్నట్టుండి కుప్పకూలి మరణిస్తున్న యువత అన్న వార్తలను వింటూ ఉన్నాం.. గడిచిన దశాబ్దాలలో ఇలాంటి వార్తలును మనం చదివింది, వినింది 5% కన్నా తక్కువే. కానీ ఇప్పుడు రోజూ వినాల్సి వస్తుంది. ముఖ్యంగా కరోనా వచ్చి వెళ్లాక ఈ వార్తలు మరి ఎక్కువగా వినిపిస్తున్నాయి.
సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎందరో ఇలా అకస్మాత్తుగా మరణిస్తున్నారు. ఇలా రోజుకు రెండు మూడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకు పట్టుమని ముఫ్పై వయసు కూడా లేని వీళ్లంతా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు? ఎన్నడూ లేని విధంగా ఇలా యువకుల్లో ఎందుకు గుండెపోటు సమస్య అకస్మాత్తుగా పెరిగింది? కారణం మరి కోవిడేనా? ఇలా అనేకానేక ప్రశ్నలు జనంలో గుబులు రేపుతున్నాయి.
ఈ సందర్భంలో తప్పనిసరిగా మన వారి గుండె ఆరోగ్యం గురించిన విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. కార్డియాక్ అరెస్ట్ అనే మాట తరచుగా వినిపిస్తోంది. ఇంతకు ముందు కనీసం 40 వయసు వచ్చే వరకు గుండె సమస్యలతో బాధ పడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది.
చిన్న వయసులో గుండెపోటు చాలా ప్రమాదకరం..
అయితే చిన్న వయసులో వచ్చే గుండెపోటు పెద్ద వారిలో వచ్చే గుండెపోటుతో పోలిస్తే మరింత ప్రమాద కరం, ప్రాణాంతకం కూడా. పెద్ద వయసు వారిలో గుండె పోటు అకస్మాత్తుగా మీద పడే ప్రమాదం కాదు. ఎందుకంటే గుండెకు రక్త ప్రసరణ జరిగే రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు క్రమంగా పెరుగుతూ వస్తాయి.
ఇలాంటి బ్లాకేజీలు మొదలైనపుడు ప్రధాన రక్తనాళాలకు పక్కనుంచి కొల్లేటరల్స్ అనే చిన్నచిన్న రక్త నాళాలు ఏర్పడుతాయి. ప్రధాన రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడినా కూడా పక్కన కొత్తగా ఏర్పడిన కొల్లెటరల్ రక్తనాళాల ద్వారా గుండెకు కాస్త రక్త ప్రసరణ జరుగుతుంది. యువకుల్లో అంత అవకాశం ఉండదు. కొల్లేటరల్ రక్తనాళాలు ఏర్పడేంత సమయం ఉండకపోవడం వల్ల ఒక్కసారిగా గుండెకు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మరణానికి దారి తీస్తుంది.
కారణాలు అనేకం
గుండెపోటు రావడానికి కారణాలు వయసు పైబడిన వారిలో అయినా చిన్న వయసు వారిలో అయినా ఒకటే. లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం. ప్రస్తుత పరిస్థితుల్లో యువకుల్లో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో వేళా పాళా లేకుండా పనిలో గడుపుతున్నారు. ఇది వరకు రోజుల్లో కేవలం మధ్యాహ్నాలు లేదా రాత్రుళ్లు ఉద్యోగాలు చేసుకునే వారు కానీ ఇప్పుడు మాత్రం ఎనీ టైం వర్క్ అన్న చందంగా ఉన్నాయి పని వేళలు. ఇది వారిలో ఒత్తిడిని మరింత పెంచుతోంది. నిద్ర వేళలు, తీసుకునే ఆహారం వంటివన్నీ కూడా గుండె ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి.
ఆరోగ్యం కోసం కంటే కూడా అందం కోసం వర్కవుట్ చేసే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. తక్కువ సమయంలో బరువు తగ్గాలని, శరీరాకృతి అందంగా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైన దాని కంటే ఎక్కువ ప్రొటీన్ వాడకం, త్వరగా కండలు పెంచాలన్న తొందరలో స్టెరాయిడ్స్ వాడుతున్న వారిలో కూడా గుండెపోటు రావచ్చట. మితిమీరిన జిమ్ వ్యాయామాలు కూడా శరీరాన్ని ఒక రకమైన ఒత్తిడికి లోను చేస్తున్నాయి. బరువులు ఎత్తే వ్యాయామాల వల్ల పెద్దగా ఉపయోగం లేదనేది కొందరి వాదన. మానసిక ఒత్తిడి ఒక రకమైన ప్రభావాన్ని చూపితే, ఇలాంటి శారీరక ఒత్తిడి మరోరకంగా శరీరం మీద ప్రభావాన్ని చూపుపుతుంది.
ఎలాంటి జాగ్రత్తలు అవసరం?
తరచుగా డయాబెటిస్, లిపిడ్ ప్రొఫైల్, బీపీ వంటి వాటిని పరీక్షించుకోవడం అవసరం. ఒక వేళ ఇప్పటికే ఇలాంటి సమస్యలు ఉన్నవారు కచ్చితంగా వాటిని అదుపులో పెట్టుకోవాలి. సైకిలింగ్, రన్నింగ్, వాకింగ్ వంటివి గుండె ఆరోగ్యానికి మేలు చేసే వ్యాయామాలు. ఇవి క్రమం తప్పకుండా చేస్తుండాలి. జిమ్‌లలో బరువులెత్తడం వల్ల శరీరాకృతి మెరుగవుతుందేమో కానీ గుండె ఆరోగ్యానికి పెద్ద మేలు లేదు. 5 కిలోల వరకు బరువులు ఎత్తితే చాలనేది నిపుణుల సలహా. బరువు ఎత్తడం గుండె మీద ఒత్తిడి పెంచే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.
పని ఎప్పుడూ ఉండేదే, కాస్త సమయం ఆత్మీయులతో గడపడం అవసరమని గుర్తించాలి. పని నుంచి బ్రేక్ అంటే టీవీ చూడడం లేదా మోబైల్‌తో గడపడం కాదనే సంగతి తెలుసుకోవాలి. గాడ్జెట్స్ వాడకం తగ్గించు కోవడం ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిదే. ఆత్మీయులతో గడపడం అత్యంత ఉత్తమమైన స్ట్రెస్ బూస్టర్ అని మరచిపోవద్దు. చిన్నచిన్న హాబీలు ఉండడం కూడా అవసరమే.
పొగ తాగే అలవాటు చాలా ప్రమాదకరం. రోజుకు ఒక సిగరెట్ అయినా సరే గుండె ఆరోగ్యానికి చెరుపు చేస్తుంది. భోజనంలో పచ్చి కూరలు, తాజా పండ్లు కూడా తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. ఉప్పు వినియోగం బాగా తగ్గించాలి. ఆల్కాహాల్ పరిమితులు మించకూడదు, సాఫ్ట్ డ్రింక్స్ అసలు తీసుకోకూడదు. – భవాని
భారతీయులు జాగ్రత్తగా ఉండాలి..
మామూలుగా భారతీయుల్లో గుండెజబ్బుల ముప్పు ఎక్కువే. మామూలుగా ప్రపంచ దేశ పౌరులదో పోలిస్తే దశాబ్ధం ముందుగానే గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కనుక భారతీయులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొవిడ్ కచ్చితంగా కారణమే. మైల్డ్ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వారిలో ఫర్వాలేదు కానీ కొవిడ్ తో తీవ్రంగా బాధపడిన వారిలో రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ కనిపిస్తోంది. కనుక అలాంటి వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకొని బ్లడ్ థిన్నర్స్ వాడడం అవసరం. ఒత్తిడి పెరిగిన నేటి జీవన శైలిలో తప్పనిసరిగా ఆరోగ్యకరమైన అలవాట్లు తప్పనిసరి.
పొగ, మద్యం, సెడంటరీ లైఫ్ స్టైల్‌కి దూరంగా ఉండాలి. జీవితంలో క్రమశిక్షణ తప్పితే ప్రస్తుత కాలంలో ప్రాణాలకే ప్రమాదం కనుక తప్పనిసరిగా క్రమశిక్షణ కలిగిన జీవన శైలిని అలవరచుకోవాలి. ఏది పరిమితి మించినా అది ప్రమాదకరమే. అది వ్యాయామమైనా సరే. కనుక ఎలాంటి వ్యాయామాలు ఎంత పరిమాణంలో చేసుకోవాలో తెలుసుకొని అందుకు తగిన వ్యాయామ రీతులను అనుసరించడం అవసరం. యోగా, మెడిటేషన్ వంటివి ఒత్తిడిని తగ్గించే మంచి పద్ధతులని మరచిపోవద్దు.
– డాక్లర్. శ్రీనివాస్ కుమార్, ఇంటర్వేన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్