ముదురుతున్న ఇజ్రాయెల్ సంక్షోభం.. లెబ‌నాన్ స‌రిహ‌ద్దుల్లోనూ కాల్పులు

ముదురుతున్న ఇజ్రాయెల్ సంక్షోభం.. లెబ‌నాన్ స‌రిహ‌ద్దుల్లోనూ కాల్పులు
  • ద‌క్షిణ గాజాపైనా బాంబుల వ‌ర్షం.. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న గాజా వాసులు
  • విదేశీ బందీల‌ను అతిథులుగా పేర్కొన్న హ‌మాస్‌


విధాత‌: గాజాపై ఇజ్రాయెల్ (Israel War) )దాడులు కొన‌సాగుతుండ‌గా.. ఆ ప్రాంతంలో సంక్షోభం మ‌రింత ముదురుతోంది. ల‌క్ష‌ల మంది సామాన్యులు ఉత్త‌ర గాజా నుంచి ద‌క్షిణ గాజాకు వెళుతున్న‌ప్ప‌టికీ ..కొన్ని వేల మంది ఇప్ప‌టికీ సుర‌క్షితం కాని ప్ర‌దేశాల్లోనే ఉన్నారు. ఒక‌వైపు ఐరాస‌, ఇత‌ర అంత‌ర్జాతీయ సంస్థ‌లు ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ.. ఇజ్రాయెల్ – హ‌మాస్ (Hamas) పోరు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కూ వ్యాపిస్తోంది.


లెబ‌నాన్ స‌రిహ‌ద్దుల్లో త‌ల‌దాచుకున్న హిజ్‌బుల్లా ద‌ళాల‌పై ఇజ్రాయెల్ మ‌రోసారి కాల్పులు జ‌ర‌ప‌డంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్నాయి. లెబ‌నాన్ స‌రిహ‌ద్దుల నుంచి త‌మ దేశంలోకి చొరబ‌డేందుకు ప్ర‌య‌త్నించిన న‌లుగురిని మ‌ట్టుబెట్టామ‌ని సైన్యం పేర్కొంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింక‌న్‌తో స‌మావేశ‌మైన అనంత‌రం సైతం.. ఇది చాలా సుదీర్ఘ కాలంపాటు సాగే యుద్ధ‌మ‌ని ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ మంత్రి పేర్కొన్నారు.


దీంతో మ‌రికొన్ని రోజుల పాటు పోరు త‌ప్ప‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. దీనికి అనుగుణంగానే ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 50 ల‌క్ష‌ల మంది ఇజ్రాయేలీయులు త‌మ దేశంలోనే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిపోయారు. మ‌రికొంద‌రు అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అమెరికా (America) సైతం ఆదేశాలు వ‌స్తే ఇజ్రాయెల్‌కు స‌హాయంగా క‌ద‌న రంగంలోకి దూక‌డానికి 2000 మంది సైనికులను సిద్ధం చేసింది. ఇదిలా ఉండ‌గా సుర‌క్షితంగా ఉంటారంటూ త‌మ‌ను ద‌క్షిణ గాజాకు వెళ్లిపోవాల‌ని చెప్పిన ఇజ్రాయెల్ అక్క‌డా బాంబుల‌ను కురిపిస్తోంద‌ని గాజా వాసులు వాపోతున్నారు.


ద‌క్షిణ గాజా న‌గ‌రాలైన ఖాన్ యూనిస్‌, ర‌ఫా న‌గ‌రాల్లో బాంబుల వ‌ర్షం కురుస్తోంద‌ని ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాడుల్లో 2800 మంది గాజా పౌరులు మ‌ర‌ణించిన‌ట్లు తాజా లెక్క‌లు చెబుతున్నాయి. గాయాలు పాలైన, ఆక‌లితో అల‌మ‌టిస్తున్న వారికి నిత్యావ‌స‌రాలు తీసుకెళుతున్న కాన్వాయ్‌ను ర‌ఫా బోర్డ‌ర్ ద్వారా గాజాలోకి పంపేందుకు ఈజిప్ట్ అనుమ‌తించింది. మంగ‌ళ‌వారం ఉద‌యం ఈ కాన్వాయ్‌.. గాజాలోని ర‌ఫాకు బ‌య‌లుదేరింది. అపరిశుభ్ర‌మైన నీరు మాత్ర‌మే ఇక్క‌డి పౌరుల‌కు అందుబాటులో ఉండ‌టంతో.. కొన్ని రోజుల్లో ఇక్క‌డ అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాద‌ముంద‌ని యునైటెడ్ నేష‌న్స్ రిలీఫ్ అండ్ వ‌ర్క్స్ ఏజెన్సీ హెచ్చ‌రించింది.


త‌మ వ‌ద్ద బందీలుగా ఉన్న సుమారు 200 మంది భ‌ద్ర‌త‌పై హ‌మాస్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇజ్రాయెల్‌లో ఉన్న పాల‌స్తీనీయుల‌ను ద‌క్కించుకునేందుకు కావాల్సిన దానిని చేజిక్కించుకున్నామ‌ని ప్ర‌క‌టించింది. వారు త‌మ వ‌ద్ద ఉన్న బందీలను విడుద‌ల చేయాలంటే.. ఇజ్రాయెల్ త‌మ వారిని విడుద‌ల చేయాల‌నే డిమాండ్‌ను హ‌మాస్ బ‌య‌ట‌కు తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. అనంత‌రం విడుద‌ల చేసిన మ‌రో ప్ర‌క‌ట‌న‌లో త‌మ ద‌గ్గ‌ర ఉన్న వివిధ దేశాల పౌరుల‌ను మాత్ర‌మే అతిథులుగా పేర్కొంది. వారికి త‌గిన ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నామ‌ని తెలిపింది. వారు విడుద‌ల చేసిన ఒక వీడియోలో టీనేజ్ యువ‌తికి చికిత్స చేయిస్తున్న దృశ్యాలు ఉన్నాయి.