ఆ ఊర్లో ఓ బూచాడు.. ఎవ‌రికీ చిక్క‌డు దొర‌క‌డు

ఆ ఊర్లో ఓ బూచాడు.. ఎవ‌రికీ చిక్క‌డు దొర‌క‌డు
  • హ‌డ‌లిపోతున్న గ్రామ‌స్థులు



విధాత‌: స్కాట్లాండ్ (Scotland) లోని ఆ గ్రామ ప్ర‌జ‌లు ఓ బూచోడి గురించి త‌ల‌చుకుని తెగ భ‌య‌ప‌డిపోతున్నారు. ఒక విచిత్ర‌మైన వేష‌ధార‌ణ‌ (Clown) ను వేసుకుంటున్న గుర్తు తెలియ‌ని వ్య‌క్తి.. రాత్రుళ్లు ఆ ఊర్లో తిర‌గుతూ గ్రామ‌స్థుల‌ను బెద‌ర‌గొడుతున్నాడు. మీడియాకు, పోలీసుల‌కు ఎప్పటిక‌ప్పుడు స‌మాచారం ఇస్తూ త‌న‌ను ప‌ట్టుకోవాల‌ని స‌వాలు విసురుతున్నాడు. త‌ల‌కు ఎరుపు వెంట్రుక‌ల బ్యాండ్‌, ఎరుపు కాల‌ర్‌, విచిత్ర‌మైన లెగ్గింగ్స్‌తో వింత‌గా ఉంటున్న ఈ వ్య‌క్తి క‌నిపించే ఊరిపేరు స్కెల్‌మోర్లే. ఇది రాజ‌ధాని ఎడెన్‌బ‌రోకు 35 కి.మీ. దూరంలోనే ఉండ‌టం గ‌మ‌నార్హం.


సుమారు 2000 మంది జ‌నాభా ఉండే ఈ చిన్ని గ్రామంలో అత‌డు మూడేళ్లుగా క‌నిపిస్తున్నాడ‌ని స‌మాచారం. పైగా క‌నిపించిన ప్ర‌తి ఒక్కరూ అత‌డి చేతిలో ఒక ఎరుపు బెలూన్ ఉంటుంద‌ని తెలిపారు. పోలీసులు ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌డుతూ ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రినీ క‌నీసం అనుమానితులుగా గుర్తించ‌లేక‌పోయార‌ని స్కై న్యూస్ పేర్కొంది. అత‌డిని ఎలాగైనా ప‌ట్టుకుని కాల్చి ప‌రేయాల‌ని గ్రామ‌స్థులు పోలీసుల‌ను డిమాండ్ చేస్తున్నారు.


ఈ ప‌ని చేస్తున్న ఎవ‌రైనా స‌రే.. దానిని ఆపేయండి అని ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రి ఒక‌రు విజ్ఞ‌ప్తి చేశారు. ఆ వేష‌గాడితో ఎవ‌రైనా మాట్లాడి అత‌డికి ఏమైనా మాన‌సిక స‌మ‌స్య ఉందేమో క‌నుక్కోవాల‌ని మ‌రొక‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. నిందితుడి వేష‌ధార‌ణ స్టీఫెన్ కింగ్ రాసిన ప్ర‌సిద్ధ న‌వ‌ల ఐటీ లో విల‌న్ వేష‌ధార‌ణ‌ను పోలి ఉంద‌ని కొంద‌రు పేర్కొన్నారు. ఈ న‌వ‌ల ఆధారంగా మూడు సినిమాలు సైతం రావ‌డం విశేషం. సినిమాలో ఆ క్యారెక్ట‌ర్‌ను ప‌రిశీలిస్తే ప్ర‌తి 27 ఏళ్ల‌కో సారి పిల్ల‌ల‌ను చంపే వ్యక్తిగా చూపించారు. ఇది కూడా గ్రామ‌స్థుల భ‌యానికి కార‌ణ‌మ‌వుతోంది.


ఇంత చ‌ర్చ జ‌రుగుతున్నా స‌ద‌రు వ్య‌క్తి త‌న హెచ్చ‌రిక‌ల‌ను మాత్రం ఆప‌లేదు. తాజాగా ఫేస్‌బుక్‌లో ఛాలెంజ్ విసురుతూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. మీడియాకు ఒక సందేశం పేరిట విడుద‌లైన ఆ వీడియోలో.. నాలోని బాధ‌ను దాచిపెట్టి మీ కెమెరాల‌కోసం న‌వ్వ‌మంటారా అని ప్ర‌శ్నించాడు. కోలే డెమోస్ అనే పేరుతో ఉన్న ఎకౌంట్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. ఆ ఎకౌంట్ వివ‌రాల‌ను ప‌రిశీలించ‌గా.. మిచిగ‌న్‌లోని హెల్ (న‌ర‌కం) న‌గ‌రం త‌న ఊర‌ని, హెల్‌గేట్ హై స్కూల్‌లో చ‌దివాన‌ని రాసి ఉండ‌టం గ‌మ‌నార్హం.