ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో బుధవారం ఓ కారుపై అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ మద్దతుగల మిలీషియా గ్రూప్ కతైబ్ హిజ్బుల్లా సభ్యులు హతమయ్యారు

  • మిలీషియా కమాండర్‌తో సహా ముగ్గురు

Iraq Drone Strike | ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో బుధవారం ఓ కారుపై అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ మద్దతుగల మిలీషియా గ్రూప్ కతైబ్ హిజ్బుల్లా సభ్యులు హతమయ్యారు. ఇందులో టాప్‌ కమాండర్‌ సైతం ఉన్నాడు. తూర్పు బాగ్దాద్‌లోని మష్టల్ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై యూఎస్ డ్రోన్ లక్ష్యంగా దాడికి పాల్పడింది. మృతుల్లో కతైబ్‌ హిజ్బుల్లా కమాండర్‌తో పాటు అతని ఇద్దరు అనుచరులు ఉన్నారు. అత్యవసర సేవల బృందం ఘటనా స్థలానికి చేరుకునేలోపే కారు కాలి బూడిదైంది.

ఆ తర్వాత సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. కతైబ్‌ హిజ్బుల్లా టాప్ కమాండర్‌ను డ్రోన్‌ స్ట్రయిక్‌లో టార్గెట్‌గా చేసుకున్నట్లు యూఎస్‌ అధికారి ఒకరు తెలిపారు. మృతుల్లో ఒకరిని సిరియాలోని కతైబ్‌ హిస్బుల్లా కార్యకలాపాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న విస్సామ్‌ మొహమ్మద్‌ అబూ బకర్‌ అల్‌ సౌదీగా గుర్తించినట్లు ఇరాకీ అధికారులు తెలిపారు. జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై దాడి తర్వాత, ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపుల డజన్ల కొద్దీ స్థానాలపై అమెరికా గత వారం బాంబులతో దాడి చేసింది.

ఇందులో చాలా మంది మిలీషియా సభ్యులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ఉద్రిక్తత మధ్య అమెరికా మరోసారి డ్రోన్ దాడి చేసింది. జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై దాడికి ఇరాక్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కారణమని అమెరికా ఆరోపించింది. హతమైన మిలీషియా కమాండర్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఆర్గనైజేషన్ నాయకుడని అధికారులు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తర్వాత ఇరాక్‌లో యూఎస్ దళాలపై దాడికి ఇస్లామిక్ రెసిస్టెన్స్ బాధ్యత వహించిన విషయం తెలిసిందే.

Updated On 8 Feb 2024 3:20 AM GMT
Somu

Somu

Next Story