లగ్జరీ కారులో వచ్చి.. బీజేపీ నేత మేకను ఎత్తుకెళ్లారు..
మేకలను, గొర్రెలను దొంగలు అపహరిస్తుంటారు. ఆ తర్వాత వాటిని అమ్ముకోవడం లేదా వారే వండుకొని తినడం చూస్తుంటాం

రాయ్‌పూర్ : మేకలను, గొర్రెలను దొంగలు అపహరిస్తుంటారు. ఆ తర్వాత వాటిని అమ్ముకోవడం లేదా వారే వండుకొని తినడం చూస్తుంటాం. అయితే బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన 120 కిలోల ఓ మేకను దొంగలు లగ్జరీ కారులో వచ్చి అపహరించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో వెలుగు చూసింది.
బీజేపీ నేత సురేశ్ గుప్తా.. ఓ మేకను పెంచుకుంటున్నారు. దాని బరువు 120 కేజీలు. అయితే రూ. 18 లక్షల విలువ చేసే కారులో దొంగలు బీజేపీ ఇంటి వద్దకు చేరుకున్నారు. పట్టపగలే అందరూ చూస్తుండగా ఆ మేకను కారులో ఎక్కించుకుని పారిపోయారు. ఈ ఘటన ఫిబ్రవరి 8వ తేదీన చోటు చేసుకుంది. ఇక బీజేపీ నేత మేక చోరీకి గురైందని అంబికాపూర్‌లో విస్తృతంగా ప్రచారం జరిగింది.
ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న మేక దొంగలపాలు కావడంతో.. బీజేపీ నేత రఘునాథ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారం రోజుల తర్వాత మేకను దొంగిలించిన ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన మేకను మటన్ షాపు వ్యక్తికి రూ. 27 వేలకు విక్రయించినట్లు తేలింది. రూ. 27 వేలకు గానూ నిందితుల నుంచి పోలీసులు రూ. 1,100 స్వాధీనం చేసుకున్నారు. దొంగలకు సంబంధించిన లగ్జరీ కారును సీజ్ చేశారు. అనంతరం జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.