జనవరి 22న మద్యం, మటన్, చికెన్ దుకాణాలు బంద్
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

లక్నో : అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణప్రతిష్ఠ నిర్వహించే జనవరి 22న యూపీ వ్యాప్తంగా మటన్, చికెన్ దుకాణాలను మూసివేయాలని యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక 22వ తేదీన యూపీ ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది.
జనవరి 22వ తేదీన మటన్, చికెన్ దుకాణాలతో పాటు మద్యం షాపులను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, కమిషనర్లకు యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎస్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. జనవరి 14 నుంచి 21వ తేదీ వరకు శానిటేషన్ క్యాంపెయిన్ చేపట్టాలని ఆదేశించారు. జనవరి 22 నుంచి 26వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలను విద్యుత్ దీపాలతో అలకరించాలని సూచించారు.
అయోధ్యకు వచ్చే దారులన్నింటినీ సుందరంగా ముస్తాబు చేయాలన్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తరలివచ్చే ప్రముఖులకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయోధ్యకు వెళ్లే మార్గాల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు ఉంటే వాటిని తొలగించాలని సీఎస్ ఆదేశించారు.