అయోధ్యకు తెలంగాణ నుంచి బీజేపీ రైళ్లు..! 29 నుంచి షెడ్యూల్‌ ఖరారు..!

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ క్రమంలో చాలా మంది అయోధ్యకు దర్శనానికి వెళ్లాలని భావిస్తున్నారు

అయోధ్యకు తెలంగాణ నుంచి బీజేపీ రైళ్లు..! 29 నుంచి షెడ్యూల్‌ ఖరారు..!

Ayodhya | అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ క్రమంలో చాలా మంది అయోధ్యకు దర్శనానికి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారికి బీజేపీ శుభవార్త చెప్పింది. తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడపాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 29 నుంచి అయోధ్యకు తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన వారిని అయోధ్య రామ దర్శనానికి తీసుకెళ్లనున్నది.


ఈ మేరకు ఈ నెల 29 నుంచి ఆస్తా రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా భక్తులను అయోధ్యకు తీసుకెళ్లనున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నుంచి 200 మందికి అవకాశం కల్పించనున్నారు. అయోధ్యకు వెళ్లి వచ్చేందుకు ఐదురోజులు సమయం పట్టనున్నది. ప్రతి బోగికి ఒక ఇన్‌చార్జీ నియమించారని, రైలులో మొత్తం 20 బోగీలు ఉండనున్నట్లు తెలుస్తున్నది. ఒక ట్రైన్‌లో 1400 మందిని తీసుకెళ్లి రామ దర్శనం కల్పించనున్నారు.


ఈ నెల 29న సికింద్రాబాద్‌, 30న వరంగల్, 31, హైదరాబాద్‌, ఫిబ్రవరి 1న కరీంనగర్‌, 2న మల్కాజ్‌గిరి, 3న ఖమ్మం, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్‌ నుంచి భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 8న ఆదిలాబాద్‌, 9న మహబూబ్‌నగర్‌, 10న మహబూబాబాద్‌. 11న మెదక్‌, 12న భువనగిరి, 13న నాగర్‌ కర్నూల్‌, 14న నల్గొండ, 15న జహీరాబాద్‌ నుంచి అయోధ్యకు భక్తులు తీసుకెళ్లనున్నారు.


అయితే, ఆయా రైళ్లన్నీ సికింద్రాబాద్‌, కాజీపేట నుంచి బయలుదేరుతాయి. సికింద్రాబాద్, నిజమాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్‌గిరి, మెదక్ పార్లమెంట్ నియోజక వర్గాలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి.. నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, పెద్దపల్లి కాజీపేట నుంచి రైలు ప్రయాణం ఉంటుందని బీజేపీ పేర్కొంది.