గుజరాత్: బీజేపీకి మజ్లీస్‌తో సంబరం.. ఆప్‌తో కలవరం!
ఓట్ల చీలిక ఏ పార్టీకి విజయం.. విధాత: బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు ఏ ఎన్నికల ప్రచారంలోనూ మజ్లీస్ ఊసెత్తకుండా ఉండలేరు. ఆ పార్టీని, ఆ పార్టీ నేతలను బూచిగా చూపెట్టి హిందువుల ఓట్లు గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవడానికి మజ్లీస్ పేరు పదే పదే ప్రస్తావిస్తుంటారు. నిజంగా బీజేపీ మజ్లీస్‌పై రాజకీయంగా సీరియస్‌గా పని చేస్తున్నదా? ఆ పార్టీని ఓడగొట్టడానికే ప్రయత్నిస్తున్నదా? అంటే అది సత్యదూరం అని స్పష్టమౌతుంది. ఎందుకంటే పాతబస్తీలోని హైదరాబాద్ పార్లమెంట్ స్థానం […]

- ఓట్ల చీలిక ఏ పార్టీకి విజయం..
విధాత: బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు ఏ ఎన్నికల ప్రచారంలోనూ మజ్లీస్ ఊసెత్తకుండా ఉండలేరు. ఆ పార్టీని, ఆ పార్టీ నేతలను బూచిగా చూపెట్టి హిందువుల ఓట్లు గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవడానికి మజ్లీస్ పేరు పదే పదే ప్రస్తావిస్తుంటారు. నిజంగా బీజేపీ మజ్లీస్‌పై రాజకీయంగా సీరియస్‌గా పని చేస్తున్నదా? ఆ పార్టీని ఓడగొట్టడానికే ప్రయత్నిస్తున్నదా? అంటే అది సత్యదూరం అని స్పష్టమౌతుంది.
ఎందుకంటే పాతబస్తీలోని హైదరాబాద్ పార్లమెంట్ స్థానం అయినా, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మజ్లీస్‌కు కంచుకోటలే. అక్కడ వారి సిట్టింగ్ స్థానాలకు ఢోకా ఉండదు. వాస్తవానికి మజ్లీస్ టీఆర్ఎస్ మా మిత్ర పక్షం అని బహిరంగంగా చెప్పుకుంటున్నా అంతర్గతంగా మాత్రం ఆ పార్టీ బీజేపీ గెలుపుకోసం పనిచేస్తుందని కాంగ్రెస్, ఎస్పీ ఇతర విపక్షాలు చేస్తున్న వాదనలు నిజమే అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై దేశ ప్రజలంతా దృష్టి సారించారు. అక్కడ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మధ్యే ముక్కోణపు పోటీ ఉండబోతున్నదన్నది స్పష్టమైంది. అయితే ఆప్ దూకుడు ప్రచారం అటు కమలం నేతలను, ఇటు కాంగ్రెస్ నేతలను కలవరానికి గురిచేస్తున్నది.
కానీ ముస్లిం జనాభా అధికంగా ఉన్న13 నియోకవర్గాల్లో మజ్లీస్ 11 చోట్ల ముస్లిం అభ్యర్థులకే సీట్లు కేటాయించింది. ఇది మాకే లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారంటే ఆ పార్టీ నేతలు మజ్లీస్ పై చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు పొంతనే ఉండదు అనడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.
ముఖ్యంగా ఇటీవల బీహార్‌లోని గోపాల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. అక్కడ ఆర్జేడీ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు. ఆయకు వచ్చిన మెజారిటీ 1,794 మాత్రమే. అయితే అక్కడ మజ్లీస్ తరఫున పోటీ చేసిన అబ్దుల్ సలాంకు 12, 214 ఓట్లు దక్కాయి. ఆర్జేడీ అభ్యర్థి ఓటమికి కారణం ఎవరు అన్నది దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు యూపీ ఎన్నికల్లోనూ ఎస్పీ అభ్యర్థులు 10 నుంచి 25 స్థానాల్లో 1000 నుంచి 10 వేల లోపు మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఆయా చోట్ల మజ్లీస్ కు, బీఎస్పీకి వచ్చిన ఓట్లను బట్టి కొన్ని పార్టీలు బీజేపీ గెలుపు కోసం ఎలా ఉపయోగపడుతున్నాయో ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయనే విశ్లేషణలు వెలువడ్డాయి.
ప్రస్తుతం గుజరాత్ లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితే తిరిగి పునరావృతమవుతుందా? అంటే అవ్వొచ్చు అంటున్నారు. గుజరాత్‌ని అహ్మదాబాద్ జిల్లా జమల్పూర్ ఖడియా, బాపూనగర్లతో పాటు ఎస్పీ రిజర్వుడు స్థానాలైన డానిలిమ్డాలో, ప్రముఖ సామాజిక కార్యకర్త జిగ్నేశ్ మేవానీ పోటీ చేస్తున్నవడ్డాం నియోజకవర్గంలో మజ్లీస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలో దింపింది. ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చీలక ఎవరికి లాభం చేకూర్చనున్నది బీజేపీ నేతలు ఇప్పటికే చెబుతున్నారు.