BJP | ఆకలితో.. అమృత్ కాల్‌కు ఎదురుచూస్తారా
BJP | బీజేపీకి ధరల వణుకు! ఎన్నికల వేళ జనంలో ఆగ్రహం పదేళ్లుగా పెరుగుతున్న ధరలు అయినా నియంత్రణ చర్యల్లేవ్ అమృత్ కాల్ అంటూ తాయిలం దానికి జనం ఎదురు చూస్తారా? మోదీ సర్కారుకు బుద్ధి చెప్తారా? విధాత, న్యూఢిల్లీ: దేశ ప్రజలు ఆకలితో అమృత్ కాల్ రోజుల కోసం ఎదురుచూస్తారా ? లేక అధిక ధరలను అదుపు చేయలేని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారా? ఏం చేస్తారన్నదానిపై ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఎన్నికల […]

BJP |
- బీజేపీకి ధరల వణుకు!
- ఎన్నికల వేళ జనంలో ఆగ్రహం
- పదేళ్లుగా పెరుగుతున్న ధరలు
- అయినా నియంత్రణ చర్యల్లేవ్
- అమృత్ కాల్ అంటూ తాయిలం
- దానికి జనం ఎదురు చూస్తారా?
- మోదీ సర్కారుకు బుద్ధి చెప్తారా?
విధాత, న్యూఢిల్లీ: దేశ ప్రజలు ఆకలితో అమృత్ కాల్ రోజుల కోసం ఎదురుచూస్తారా ? లేక అధిక ధరలను అదుపు చేయలేని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారా? ఏం చేస్తారన్నదానిపై ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఎన్నికల రూపంలో వచ్చేస్తుంది. బీజేపీ పాలకులు చెబుతున్న అమృత్ కాల్ మాటలు ఆచరణలో కనిపించక పోగా, ఇంకెన్నాళ్లకు వస్తాయో కూడా తెలియడం లేదు.
తాము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ధరల పెరుగుదలపై ఏకిపారేసిన బీజేపీ ఇప్పుడు తన దశాబ్ధకాల పాలనలో అంతకు పదిరెట్లు పెరిగిన ధరలను నియంత్రించలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది. త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే జమిలి.. మినీ జమిలి ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పెరిగిన ధరలు తమ పార్టీని ఎక్కడా ముంచెస్తాయోనన్న భయం బీజేపీలో వ్యక్తమవుతుంది.
విశ్వగురువుగా అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక ప్రజాదరణ నాయకుడిగా పేరొందిన తమ ప్రధాని ఇంకా ఎప్పుడు ధరలను అదుపు చేస్తారన్న ప్రశ్న ప్రజల్లో, బీజేపీ శ్రేణుల్లో వినిపిస్తుంది. వంటనూనే, తిండి గింజలు, నిత్యావసర సరుకులు మొదలు అన్ని రకాల ధరలు పెరుగడం, పైగా వాటిపై జీఎస్టీలు వసూలు చేస్తుండటం ప్రజలకు భారంగా తయారైంది.
మోడీ ప్రభుత్వం తొలినాళ్లలో ధరల నియంత్రణ దిశగా చేపట్టిన చర్యలు ఫలించినా అవి ఎక్కువ కాలం నిలువలేదు. మళ్లీ రెక్కలు విప్పుకున్న ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. మోడీ అధిక ధరల నియంత్రణ వాగ్ధానం చూసి చూసి ప్రజలు కూడా అలిసి పోయారు. మోడీ పదేండ్ల కాలం లో ధరలు దిగిందిలేకపోగా, పెరగటం ఆగిందిలేదు.
అధిక ధరలతో ప్రజలు సతమతమవడం నిరంతరం కొనసాగుతూ వస్తూనే ఉంది. దేశంలోని అత్యధిక జనాభా కలిగిన పేద, మధ్యతరగత ప్రజలు కొనుగోలు చేసే కూరగాయలు, ఉప్పులు, పప్పుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమృత్ కాల్ మాటలు, అచ్చేదిన్ భ్రమలలో ఎక్కువ కాలం ప్రజల్లో ఉంచలేమని కమల దళాని తెలియంది కాదు.
ఆందోళనలో బీజేపీ
ఇప్పుడు పలు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంటు దగ్గర పడుతున్నకొద్దీ సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజల్లో ధరల పెరుగుదలపై గూడుకట్టుకొనివున్న వ్యతిరేకతను పసిగట్టిన బీజేపీ అందోళనకు గురవుతోందని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 2013 సంవత్సరం అర్ధభాగం నుంచి పెరగడం మొదలెట్టిన తిండిఈసరకుల ధరలు, ఇప్పుడు 2023లో కూడా మరింత వేగంతో పెరుగుతున్నాయే తప్ప అదుపు లోకి వచ్చింది లేదు.
ఈసంవత్సరం జులై-ఆగస్టు నాటికి ధరల పెరుగుదల రేటు పదిశాతానికి మించిపోయింది. అంటే డబుల్ డిజిట్స్ లోకి పెరిగింది. 8 సంవత్సరాల్లో మొదటి సారి దేశంలో వర్షాకాలం సీజన్ లో వర్షాలు తక్కువ పడి ధరలు మండిపోవచ్చని నిపుణులు ముందుగానే అంచనావేసారు. వారి అంచనాలకు మించి కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పోగా, టమాటాలు కొనటం కూడా ప్రజలు బంద్ పెట్టుకొన్నారు. తాజాగా ఉల్లి ధరలు పెరుగుతున్నాయి.
అడ్డూ అదుపు లేని ధరల పెరుగులతో రానున్న మధ్యప్రదేశ్ రాజస్థాన్ , తెలంగాణా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో తమకు ప్రతికూల ఫలితాలు అందిస్తాయన్న బెంగ కమలనాథులను కలవర పెడుతుంది. కర్ణాటక ఎన్నికల్లో వంట గ్యాస్ ధరలు పెరగటంతో దాని పరిణామాలు ఎన్నికల ఫలితాలపై ఘోరంగా చూపించి బీజేపీకి ఓటమి పాలు చేశాయి. అందుకే మోడీ ఈ మధ్య వంట గ్యాస్ రేట్లు 200 రూపాయలు తగ్గించారు. అయినా కాని పెట్రోల్, డీజిల్ రేట్లుమాత్రం దిగలేదు. బహుశా ఎన్నికల వేళ తగ్గింపు చేస్తారేమో.
ఇవే కాకుండా ఈ మిగతా సరుకుల ధరలు కూడా యథావిధిగానే పెరుగుతున్నాయి. వీటన్నింటితో నిత్యం భాధలు అనుభవిస్తున్నప్రజలు మోడీ, బీజేపీలు చెబుతున్న అమృత్ కాల్ కోసం ఆకలి తో ఎదురు చూస్తూ బీజేపీకి మరొక అవకాశం ఇస్తారా, లేక అశేష ప్రజానీకం రాత్రికి రాత్రే తమమదిలో పేరుకొనివున్నఅధిక ధరలపైవున్న కసిని చూపి బీజేపీపైన వ్యతిరేకతను ఉప్పొంగే ధరల తుఫాన్ ప్రవాహంలో ముంచెస్తారా అనేది వేచిచూడాల్సివుంది.