బీఆరెస్‌ పరిస్థితికి బాధ్యత ఎవరిది?

బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల అన్నింటికీ కర్త, కర్మ, క్రియ కేసీఆర్‌ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు

  • Publish Date - March 29, 2024 / 07:37 AM IST

  • నాయకులదా? అధినాయకులదా?
  • నాయకత్వంలో నిరంకుశ పోకడలు
  • పార్టీ కోసం కష్టపడినవారికి మొండిచెయ్యి
  • బయటి నుంచి వచ్చినవారికి పెద్ద పీట
  • చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
  • బీఆరెస్‌ నేతల విమర్శలు, ఆరోపణలు

విధాత ప్రత్యేకం: బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటికీ కర్త, కర్మ, క్రియ కేసీఆర్‌ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఉద్యమనాయకుడిగా కేసీఆర్‌పై ఉద్యమకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఆయన నాయకత్వంపై నమ్మకం ఉన్నది. అందుకే 2014 నాటికి పార్టీ నిర్మాణం లేకున్నా అన్నిచోట్ల ఆయనే అభ్యర్థి అన్నట్టు 63 సీట్లు నాడు బీఆర్‌ఎస్‌ గెలుచుకోగలిగింది. 2014 నుంచి 2018 వరకు ఆయన పాలన పట్ల, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల పట్ల పూర్తిస్థాయి సంతృప్తిలేకున్నా ప్రత్నామ్నాయం లేకపోవడంతో 2018లో ఏకంగా 88 స్థానాలను బీఆర్‌ఎస్‌కు కట్టబెట్టారు. బహుశా ఈ ఫలితాలే కేసీఆర్‌లో ఎవరినీ లెక్కచేయని, ఎవరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోని, ఎవరి విమర్శలకు సహించలేని నియంతృత్వ లక్షణాలకు తీసుకెళ్లాయని అనుకోవచ్చు. అందుకే మొన్నటి ఎన్నికల ఫలితాల వరకు కేసీఆరే కాదు ఆ పార్టీ ముఖ్యనేతలతో పాటు ఎమ్మెల్యేలు కూడా తమ ప్రభుత్వంపై విమర్శలు చేసినా, తమ పాలన విధానాలను ప్రశ్నించినా ఒంటికాలిపై లేచారు. అందుకే చాలాచోట్ల ఎమ్మెల్యేల వైఖరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా కొన్నిచోట్ల తమ ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వొద్దని ప్రజలతోపాటు, సొంతపార్టీ కార్యకర్తలు, శ్రేణులను రోడ్లపై బైఠాయించిన దృశ్యాలూ కనిపించాయి. ‘అప్పటికైనా కేసీఆర్‌ వైఖరిలో మార్పు వచ్చి ఉంటే పరిస్థితి చేజారకపోయేది. కానీ నేను ఇంతే. నా మాటే శాసనం. నా నిర్ణయమే ఫైనల్‌ అన్నట్లు ఒంటెత్తు పోకడలతో సిటింగ్‌లతోనే ఎన్నికలకు వెళ్లారు. కొంతమంది అభ్యర్థులపై ప్రజాగ్రహాన్ని పట్టించుకోకుండా వారినే నిలబెట్టారు. దీంతో 104 నుంచి 39 స్థానాలకు పార్టీ పడిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు’ అని ఒక విశ్లేషకుడు చెప్పారు.

కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు

కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు అనే సామెత లెక్క పాలనలో అందరికీ భాగస్వామ్యం కల్పించలేదనే అసంతృప్తిలో (బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో) చాలామందిలో ఉన్నదనే అభిప్రాయా వినిపిస్తున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్నిపథకాలు వృత్తి కులాలను అభివృద్ధి చేసినప్పటికీ నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర అసంతృప్తికి కారణమైంది. వివిధ పార్టీలు, కొన్ని సంస్థలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను పక్కదోవపట్టిస్తూ.. పథకాలపై బురద చల్లుతున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. తమ కుటుంబాలకు లబ్ధి చేకూరినప్పటికీ నిరుద్యోగులు తమను కేసీఆర్‌ ప్రభుత్వం పథకాల పేరుతో మోసం చేస్తున్నదనే అభిప్రాయానికి వచ్చేశారు. కొవిడ్‌ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేకుండా, ప్రభుత్వంలో లేని ఆయా రంగాల నిపుణుల సూచనలను పరిశీలించకుండా.. చారాన కోడికి బారానా మసాల అన్నట్టు కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. కేసీఆర్‌ అధికారం కోల్పోయిన తర్వాత విమర్శలు చేస్తున్నారు. నాడు స్పందించలేదని ఆ పార్టీ నేతలు తమ విధానాలను సమర్థించుకోవచ్చు. కానీ కేసీఆర్‌ నేల విడిచి సాము చేస్తున్నారని నాడు కొంతమంది ఉద్యమకారుల సూచనలు, సద్విమర్శలను కూడా రాజకీయ ప్రత్యర్థుల విమర్శలుగానే చూశారు. పదేళ్లు పదవులు అనుభవించి పార్టీ మారుతున్నారు అని బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల ఆవేదన కూడా ఇదే. పార్టీ కోసం ముందు నుంచి పనిచేసిన వాళ్లను కాదని ఉద్యమకాలంలో వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లకు వారికి, ఇతర పార్టీల నేతలకే పెద్దపీట వేశారని, దీంతో తమకు అన్యాయం జరుగుతున్నదని వారు వాపోయినా ఏమీ చేయలేని స్థితి. అందులో కొంతమంది ఇంకా ఇక్కడే ఉంటే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని పార్టీ వీడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వారి బాటలోనే మరికొందరు నడుస్తున్నారు.

కేసీఆర్‌ నిర్ణయం కరెక్ట్‌ కాదేమో!

బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని వీడి బీజేపీ, కాంగ్రెస్‌లలో నేతలు చేరినా, చేరుతున్నా.. అవి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు కాదని అర్థమవుతున్నది. సమయం, సందర్భాన్ని బట్టి వాళ్లంతా ఒక్కొక్కరిగా బైటపడ్డారు. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి పేరును కేటీఆర్‌ అందరి కంటే ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత తాను పోటీ నుంచి వైదొలిగి.. రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్టు తనతో చెప్పినట్టు కేటీఆర్‌ అన్నారు. ఆయనకు బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని ఆయన ఉద్దేశం. అందుకే అధికారికంగా టికెట్‌ ప్రకటించకముందే కారు దిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా చేవెళ్ల లోక్‌సభ బరిలో నిలిచారు. మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పార్టీ మార్పు ముచ్చట అసెంబ్లీ ఎన్నికలకు ముందునాటిదే. మహేందర్‌రెడ్డి దంపతులు పార్టీ వీడితే తాండూరు, కొడంగల్‌ వంటి స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం ఉంటుందని మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఒకరకంగా ఇవి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలే. అయినా కేసీఆర్‌కు మరో మార్గం లేక ఆయనకు ఆ పదవి కట్టబెట్టారు. పార్టీ వీడాలనే ఆలోచన ఉన్నవాళ్లు కొన్నిరోజులు తర్వాత అయినా దానికే మొగ్గుచూపుతారని మహేందర్‌రెడ్డి దంపతుల విషయంలో రుజువైంది. ఇప్పుడు వాళ్లను నిందించడం కంటే కేసీఆర్‌ నిర్ణయం కరెక్టు కాదంటే బాగుంటుందేమో!

సిట్టింగులను మార్చి ఉంటే..

ఇప్పుడు పార్టీ వీడి ఇతర పార్టీలో చేరుతున్న నేతల్లో కొందరికి టికెట్‌ ఇవ్వొద్దని అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కేసీఆర్‌కు విజ్ఞాపనలు అందాయి. దమ్ముంటే సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి సవాల్‌ ట్రాప్‌లో ఆయన పడ్డారు. ఫలితంగా ఓటమిని కోరి తెచ్చుకున్నారు. ప్రజలు, రాజకీయ పరిశీలకులు చెప్పినట్టు 20-30 సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎంపీ పీ రాములు, మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్‌, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు లాంటి వాళ్లు పార్టీ వీడేవారు కాదేమో! అలాగే స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ నిరాకరించినా తాటికొండ రాజయ్య పార్టీలోనే కొనసాగారు. ఆయనకు తాజాగా వరంగల్‌ ఎంపీ సీటు ఇచ్చినా, లేదా సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ తిరిగి ఇచ్చినా ఇద్దరిలో ఒకరు పార్టీలోనే ఉండేవారు. కానీ కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలో ఒక్కరిద్దరు నేతలకే అధిక ప్రాధాన్యం ఇచ్చి, వారికే సర్వాధికారాలు అన్న విధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కడియం శ్రీహరి కూతురు డాక్టర్‌ కావ్యకు టికెట్‌ ఇచ్చారు. కానీ.. కావ్య పోటీచేసేందుకు నిరాకరించారు. కూతురు విజయలక్ష్మి కోసం కే కేశవరావు పార్టీ మారుతున్నట్టే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్‌లోకే వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఆయనకు మంత్రి పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ తండ్రి కోసం కూతురు కావ్య కూడా పార్టీ మారుతారని, కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేస్తారనే టాక్‌ వినిపిస్తున్నది. కేసీఆర్‌ అంచనాలు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పాయి. ఇప్పుడు అదే పునరావృతమౌతున్నది. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినా గుర్తింపులేదని వారితో పాటు అప్పటికప్పుడు వచ్చి అవకాశాలు తీసుకున్నవాళ్లు, పదేళ్లు పదవులు అనుభవించిన వాళ్లు కూడా పార్టీ వీడుతున్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసిపోయినట్టు బీఆర్‌ఎస్‌ పరిస్థితి తయారైంది. దీనంతటికీ కేసీఆర్‌ స్వయం కృతమే కారణమే కదా అని ప్రజలు, వాళ్ల పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

Latest News