గయారాం అనే నేత చేసిన పనితోనే.. ‘ఆయా రాం.. గయా రాం’.. ఏ రాష్ట్రంలో?

అసెంబ్లీల్లో బల నిరూపణ ఉందంటే చాలు.. క్యాంపు రాజకీయాలు మొదలవుతుంటాయి. ఫలితాలు వెల్లడికాగానే ఆయా పార్టీలు గెలిచినవారిని వేరే ప్రాంతాలకో

  • Publish Date - February 5, 2024 / 02:13 PM IST

ఆయా రాం.. గయా రాం.. ఆద్యుడెవరో తెలుసా?

విధాత ప్రత్యేకం: అసెంబ్లీల్లో బల నిరూపణ ఉందంటే చాలు.. క్యాంపు రాజకీయాలు మొదలవుతుంటాయి. ఫలితాలు వెల్లడికాగానే ఆయా పార్టీలు గెలిచినవారిని వేరే ప్రాంతాలకో, వేరే రాష్ట్రాలకో సురక్షితంగా తరలించి, అక్కడ కాపాడుకుంటూ ఉంటాయి. ప్రమాణస్వీకారం రోజున వారిని నేరుగా అసెంబ్లీలకు తీసుకుని వస్తుంటారు. గెలిచినవారి పట్ల అపనమ్మకమో, ప్రత్యర్థి పార్టీల పట్ల అపనమ్మకమో.. ఏదైతేనేం రెండు మూడు రోజులో అవసరమైతే వారం రోజులో ఒక రిసార్టులో లేదా ప్రఖ్యాత హోటల్‌లో వారికి ‘బస’ కల్పించి, వారి బాగోగులు చూసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారికి ఫోన్‌లు కూడా అందుబాటులో ఉండవు! కర్ణాటకలో మొన్నంటే కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చింది కానీ.. అంతకు ముందు పార్టీ నేతలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వచ్చింది. తాజాగా తెలంగాణ ఎన్నికల సమయంలో ఫలితాల అనంతరం పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను హోటల్‌ ఎల్లాకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా జార్ఖండ్‌ నుంచి జేఎంఎం సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంపై సొరేన్‌ విశ్వాస పరీక్ష నేపథ్యంలో హైదరాబాద్‌లోనే క్యాంపునకు తరలించారు. వారు అలా వెళ్లారో లేదు.. వెంటనే బీహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బల నిరూపణ నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్లో 16 మంది హైదరాబాద్‌లో ల్యాండయ్యారు. ఫిబ్రవరి 12న నితీశ్‌కుమార్‌ బల నిరూపణ ఉన్నది. ఈ లోపు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడతారనే అనుమానంతో వారిని హైదరాబాద్‌కు పార్టీ నేతలు తరలించారు. మిగిలినవారిని కూడా హైదరాబాద్‌ తరలించే ఏర్పాట్లలో ఉన్నారు.

ఏదైనా పార్టీ మెజార్టీ అంచుల వరకూ వచ్చి ఆగిపోతే.. ఎదుటి పార్టీలోని ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం అనేది ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. గతంలో బీఆరెస్‌ ప్రభుత్వం తగిన మెజార్టీ కలిగి ఉన్నా.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలను టోకున కొనేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే పేరిట.. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం రివాజుగా తయారైంది. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణలో అదే వ్యూహాల్లో ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

నిజానికి రిసార్టు రాజకీయం లేదా క్యాంపు రాజకీయం అనేది ఇప్పటిది కాదు. దేశంలో చాలా కాలం నుంచి వస్తున్నదే. ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాల్లో పాపులర్‌గా మారాయి. గత కొన్నేళ్లలో మహారాష్ట్ర, బీహార్‌, జార్ఖండ్‌, కర్ణాటక, రాజస్థాన్‌ తదితర అనేక రాష్ట్రాలు రిసార్టు రాజకీయాలకు వేదికలయ్యాయి.

దీని మూలాల్లోకి వెళితే ఆసక్తికర సంగతులు తెలుస్తున్నాయి. మొట్టమొదటిసారిగా 1982లో హర్యానా రాష్ట్రంలో రిసార్టు రాజకీయం ఆవిష్కృతమైంది. అప్పటి వరకూ దేశం చూడని ఒక కొత్త పరిణామం అది. మరో విశేషం ఏమిటేంటే.. ఇప్పుడు రాజకీయాల్లో బాగా వినిపించే ‘ఆయా రాం.. గయా రాం’ మాట పుట్టిందే హర్యానా రాజకీయాల్లో అని చెబుతుంటారు. పదే పదే పార్టీలను మార్చేవారిని ఉద్దేశించి 1960 దశకంలో ఈ మాట వినుతికెక్కింది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. గయా రాం అనే హర్యానా ఎమ్మెల్యే 1967లో ఒకే రోజు మూడు పార్టీలు మారారు. అదిగో అప్పటి నుంచే ఆయా రాం.. గయా రాం అనే మాట పుట్టింది.

రిసార్టు రాజకీయాలకు వస్తే..

1982లో హర్యానాలో తొలిసారి రిసార్టు రాజకీయం పురుడు పోసుకున్నది. ఆ ఏడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటాపోటీ నడిచింది. ఆ ఎన్నికల్లో దేవీలాల్‌ నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ అయిన ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్డీ) అప్పటికి జాతీయ స్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్‌కు సవాలు విసిరింది. ఒక బలమైన రాజకీయ శక్తిగా ముందుకు వచ్చింది. ఐఎన్‌ఎల్డీ-బీజేపీ కూటమి ఆ ఎన్నికల్లో 37 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్‌కు 36 సీట్లు దక్కాయి. 90 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఏ పార్టీ/కూటమి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ పొందలేదు.

ఆ సమయంలో హర్యానా గవర్నర్‌ జీడీ తాపసే.. ఐఎన్‌ఎల్డీ-బీజేపీ కూటమిని కాదని.. ప్రభుత్వ ఏర్పాటుకు భజన్‌లాల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను ఆహ్వానించారు. ఈ నిర్ణయంతో దేవీలాల్‌ కస్సుమన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ సాధించే క్రమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకుంటారన్న అనుమానంతో తమ కూటమి ఎమ్మెల్యేలతోపాటు.. పలువురు ఇండిపెండెంట్లను కూడా కలుపుకొని.. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలతో హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లా పర్వానూలో ఒ కహోటల్‌లో దిగారని సీనియర్‌ పాత్రికేయుడు ఎన్‌పీ ఉల్లేఖ్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

ఆ సమయంలో పెద్ద డ్రామా చోటు చేసుకున్నది. ఒక ఎమ్మెల్యే లచ్‌మన్‌ సింగ్‌ హోటల్‌ గది బయట ఉన్న పైపులును పట్టుకుని కిందికి దిగి పరారవ్వడం సంచలనం రేపింది. హోటల్‌ నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే.. వెళ్లి కాంగ్రెస్‌తో చేయి కలిపారు. అదిగో.. అప్పటి నుంచే సంకీర్ణ కూటమి రీ ఇంజినీరింగ్‌ అనేది మొదలైంది. దీని ఫలితంగా 1982లో కాంగ్రెస్‌.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. భజన్‌లాల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. చేసేది ఏమీ లేక.. 1987 దాకా ముఖ్యమంత్రి పీఠం కోసం దేవీలాల్‌ ఎదురు చూడాల్సి వచ్చింది.

దేశం దృష్టిని ఆకర్షించిన కర్ణాటక 1983 రిసార్టు రాజకీయం

హర్యానా రిసార్టు రాజకీయాల అనంతరం కర్ణాటకలో 1983లో క్యాంపు రాజకీయం హల్‌చల్‌ చేసింది. తదుపరి కాలంలో కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌ అధికార కుమ్ములాటల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు ఆ రాష్ట్రం మెట్టినిల్లైంది. 1983లో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే.. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు వెలుపలి లగ్జరీ రిసార్టులకు తరలించారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హెగ్డే ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే క్రమంలో ఎమ్మెల్యేలను తరలించారు. కర్ణాటకలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే.

1995లో గుజరాత్‌లో కేశూభాయ్‌ పటేల్‌ను ముఖ్యమంత్రిగా బీజేపీ నియమించడంతో శంకర్‌ సింగ్‌ వాఘేలా తిరుగుబాటు చేయడంతో దాదాఉ 40 మంది ఎమ్మెల్యేలను మధ్యప్రదేశ్‌లోని రిసార్టుకు తరలించారు. తదపరి కాలంలో అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో ఇలా రిసార్టు రాజకీయాల పేరిట ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అవసరంగా, అనివార్యంగా మారిపోయింది.

Latest News