నల్లగొండలో ఆందోళన కాదు..దమ్ముంటే అసెంబ్లీలో చర్చిద్దాం: సీఎం రేవంత్

కృష్ణా నది ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని, వారు చేసిన పాపాలను మాపై నెట్టేందుకు కుట్ర

నల్లగొండలో ఆందోళన కాదు..దమ్ముంటే అసెంబ్లీలో చర్చిద్దాం: సీఎం రేవంత్
  • వారి పాపాలను మాపై నెట్టెందుకు కుట్ర
  • కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత బీఆరెస్ నిర్వాకమే
  • రాజకీయ లబ్ధి కోసమే ప్రజల్లో గందరగోళం
  • కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్‌

విధాత, హైదరాబాద్ : కృష్ణా నది ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని, వారు చేసిన పాపాలను మాపై నెట్టేందుకు కుట్ర చేస్తూ, ప్రజలను గందరగోళం రేపి రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగింతపై రేగిన వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి వివరణ ఇచ్చారు. ఆనాటీ సీఎం కేసీఆర్‌, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్‌లు తీసుకున్న నిర్ణయాలను, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. నిజానికి కేసీఆర్ హయాంలోనే కృష్ణా నది జలాల సాధన విషయంలో తెలంగాణకు అధికంగా అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో 84-89 అంశాల వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వాహణ విషయాన్ని పేర్కోన్నారని, అప్పుడు లోక్‌సభలో కేసీఆర్‌, రాజ్యసభలో కేకే ఉన్నారని, విభజన చట్టంలో ప్రతి అక్షరం నన్ను అడిగే రాశారని గతంలో కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నారని, ఆ చట్టానికి, పుస్తకానికి రచయిత కేసీఆరే అన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ప్రక్రియకు 2014లో పునాది పడిందన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా , గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ ఒప్పుకున్నారన్నారు.


811 టీఎంసీల నీళ్లపై పంపకాలు ఎలా జరగాలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించారని, 2015 జూన్ 18న కేఆర్‌ఎంబీ సమావేశం నిర్వహించిందన్నారు. 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు ఏపీకి కేటాయించేందుకు కేసీఆర్, హరీష్ సంతకాలు పెట్టారన్నారు. అప్పుడేందుకు తెలంగాణకు 50 శాతం వాటా అడగకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారని ప్రశ్నించారు. కృష్ణా నది 68శాతం తెలంగాణలో ఉంది.. 32శాతం మాత్రమే ఏపీలో ఉందన్నారు. అంతర్జాతీయ నీటి విధి విధానాల ప్రకారం 5వందల టీఎంసీలు పైచిలుకు తెలంగాణకు, మిగతావి ఏపీకి కేటాయించాల్సివుందన్నారు. కానీ సంతకాలు పెట్టి మరీ తెలంగాణకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని రేవంత్ విమర్శించారు. 15 ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తామని 2022లో సమావేశంలో అంగీకరించారని, 19.05.2023న 17వ కేఆర్‌ఎంబీ సమావేశంలో కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ అంగీకరించారన్నారు. 2023 బడ్జెట్ లో గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు రూ.400 కోట్లు కేటాయించారన్నారు. ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయడం మామా, అల్లుళ్లు కలిసే చేశారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో బీఆరెస్ భాగస్వామి ఉండగా, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినపుడు హరీష్, నాయిని నర్సింహారెడ్డి మంత్రులుగా ఉన్నారన్నారు. కేంద్రంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నారని, పదవులకు ఆశపడి పెదవులు మూసుకుంది మీరు కాదా? పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించుకపోతుంటే కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ నేతలు పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి మాత్రమేనన్నారు. వాళ్లకు సహకరించకుండా వైఎస్ కు లొంగిపోయింది కేసీఆర్ అని చెప్పారు.

14 జనవరి 2020న జగన్ ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి పంచభక్ష పరమాన్నాలు తిని కృష్ణా జలాల పై 6గంటలు సమీక్ష చేశారని, అక్కడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోయేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. తండ్రి పోతిరెడ్డిపాడుతో రోజుకు 4 టీఎంసీలు తరలించుకుపోతే.. కొడుకు రాయలసీమ లిఫ్ట్ తో రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోయారన్నారు. చంద్రబాబు ముచ్చుమర్రి నుంచి 12టీఎంసీలను తరలించుకపోవడానికి కూడా కేసీఆర్ కారణమన్నారు.

రాయలసీమ లిఫ్ట్‌ టెండర్ ఆపేందుకు సమావేశానికి వెళ్లకుండా కేఆర్‌ఎంమీ సమావేశాన్ని వాయిదా వేయాలని లేఖ రాయించారన్నారు. టెండర్ ఒప్పందాలు పూర్తి కావాలనే కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్లలేదని, కేసీఆర్ ధనదాహంతో తెలంగాణ నీటిని తరలించుకుపోయేందుకు సహకరించారు. తెలంగాణ వాట నీళ్లను జగన్‌కు అమ్ముకున్నాడని ఆరోపించారు. ఏపీ జల దోపిడీకి కారణం కేసీఆర్ అన్నారు. పదేళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని, ఉమ్మడి రాష్ట్రంలో జరిగినదానికంటే ఎక్కువ ఈ నిర్లక్ష్యం పదేళ్లలో జరిగిందన్నారు. పదేళ్లు పాలమూరు-రంగారెడ్డి పడావు పడ్డదన్నారు. రెండేళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్… పదేళ్లయినా పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. ఇన్ని పాపాలు చేసి ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేస్తామని బీఆరెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. పాపాలు చేసి ప్రజా ఉద్యమాలంటే ప్రజలు చెప్పుతో కొడతారన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటా, హక్కుల కోసం మేం కొట్లాడుతుంటే అధికారం కోల్పోయి దిక్కుతోచక ఏదో ఒక వంకతో మామా అల్లుళ్లు కాంగ్రెస్ ను బదనాం చేయాలని చూస్తున్నారు.

అసెంబ్లీకి రండి చర్చిద్దాం

కృష్ణా జలాల వివాదంపై మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి తీవ్ర పదజాలంతో విరుచకపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఏపీ పోలీసులు వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పైకి వస్తే నోరు మెదపలేదన్నారు. కేసీఆర్‌ ఒక రండ, రండ పనులు చేసి మాపై విరుచుకు పడుతున్నారని మండిపడ్డారు. నల్లగొండకు వెళ్లి నిరసన తెలపడం కాదు..అసెంబ్లీ లో ప్రాజెక్ట్ లపై బహిరంగ చర్చ పెడుదామని, అవసరం అయితే ఉమ్మడి సమావేశాలు పెడుతామని, మీరు నలుగురు రండి ..మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం ..రెండు రోజులు కాకపోతే ఎన్ని రోజులైన చర్చిద్దాం.. రండి…నేను ఉత్తమ్ ఇద్దరమే మాట్లాడుతాం.. ఒక్క నిమిషం కూడా మీ మైక్ కట్ చేయం , దమ్ముంటే రండి అని సవాల్ చేశారు. నిజానిజాలేంటో నిరూపిద్దాం రండి..ఎవరు ద్రోహి, ఎవరు తెలంగాణకు అన్యాయం చేశారో తేలిపోతుందన్నారు.