ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాల్లో పెద్దపీట వేస్తామని, మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు

- మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు
- 12న పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మందితో మహిళా శక్తి సదస్సు
- విజయా డెయిరీ ఇన్సెంట్ చెల్లిస్తాం
- కండ్లకోయ మహిళా సంఘాల భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
విధాత, హైదరాబాద్ : ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాల్లో పెద్దపీట వేస్తామని, మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. శనివారం కండ్ల కోయ వద్ద ఎలివేటేడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారి –44పై ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి మీదుగా ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణం రూ. 1580 కోట్ల వ్యయంతో 5.3కి.మీ మేర నిర్మించనున్నారు. అనంతరం కండ్లకోయలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను, ఆదాయ మార్గాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తామని తెలిపారు. అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ లలో స్థానికంగా సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు. ఇప్పుడు మీరు లక్షాధికారులేనని, ఇందిరమ్మ రాజ్యంలో మీరు కోటీశ్వరులయ్యేలా చేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లను ఆడబిడ్డల పేరు మీదే ఇవ్వాలనుకుంటున్నామని వెల్లడించారు.
12న మహిళా శక్తి సదస్సు
ఈ నెల 12న సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో లక్ష మంది డ్రెస్‌కోడ్ ఉద్యోగ మహిళలతో కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంతో సమాజానికి మహిళా శక్తిని చాటుదామన్నారు. విజయా డెయిరీ ఇన్సెంట్ ప్రతి నెల అందించేలా చూస్తానని, కేసీఆర్ అన్ని పెండింగ్‌లో పెట్టారని ఒక్కోక్కటి సరిచేసుకునేందుకే నా నడుంలు వంగిపోతున్నాయన్నారు. పాత ఇన్సెంట్ సంగతి పక్కన పెడితే కొత్త ఇన్సెంట్‌లను ఎప్పటికప్పుడు మీకు అందించేలా చేస్తానన్నారు. పదేళ్లుగా గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సుల ప్రయాణంతో 24కోట్ల మంది ప్రయణించారని, ఆరోగ్య శ్రీ 5నుంచి 10లక్షలు చేశామన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో దీపం పథకంతో 400కు సిలిండర్ ఇస్తే మోదీ, కేసీఆర్ 1200కు చేశారని, మళ్లీ సోనియాగాంధీ మీకోసం సిలిండర్ 500చేశారని చెప్పారు. 200యూనిట్ల గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నామన్నారు. మీరందరి కలిసి ప్రభుత్వాన్ని తెచ్చారని మీ కోసం పనిచేస్తుందన్నారు.
ఈ సందర్భంగా 306కోట్ల 12లక్షల బ్యాంకు లింకేజీల చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మల్ రెడ్డిరంగారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.