నువ్వా..నేనా! బెట్టింగ్ రాయుళ్ల సర్వేల్లో బీఆరెస్‌కు.. మీడియా సర్వేల్లో కాంగ్రెస్‌కు మొగ్గు

- తెలంగాణలో ద్విముఖ పోటీ
- ఈ ఎన్నికల్లో కాంగ్రెస్- బీఆరెస్ మధ్యే హోరా హోరీ
- మొహరించిన ఇరు పార్టీల శ్రేణులు
- ఖర్చులకు వెనుకాడని వైనం
- ప్రత్యర్థి పార్టీ అసంతృప్తులకు గాలం వేయడానికి ప్రత్యేక బడ్జెట్
- ఈసారి బీజేపీ, బీఎస్పీల పాత్ర అంతమాత్రమే
విధాత, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాల్లో షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల పోరు తీవ్రమైంది. ఈసారి తాడోపేడో అన్నట్లు ఇటు అధికార బీఆరెస్, అటు ప్రతిపక్ష కాంగ్రెస్‌లు ఎన్నికల రణరంగంలోకి దిగాయి. అధికారిక షెడ్యూల్ విడుదల కాకపోయినా, ఎన్నికల కురుక్షేత్రంలో ఎవరి బలాలు వాళ్లు లెక్కేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల బలహీనతలను వాడుకోవడానికి ప్రత్యేక బడ్జెట్ కూడా పెట్టేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బీఆరెస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. అక్కడక్కడా వ్యక్తమైన అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉంది… ఏకంగా కేటీఆర్, హరీష్‌రావులు రంగంలోకి దిగారు. తాజాగా తాడికొండ రాజయ్య-కడియం శ్రీహరిల మధ్య స్నేహం కుదిర్చారు. మరోవైపు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నామినేటెడ్ పదవి ఆశచూపి అసంతృప్తి చల్లార్చగా, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మాత్రం జనగామ ఎమ్మెల్యే టికెట్‌ను ఖరారు చేశారు. దీంతో కొద్ది రోజులుగా వరంగల్, జనగామ జిల్లాల్లో బీఆరెస్ పార్టీలో రగులుతున్న అసంతృప్తులపై నీళ్లు చల్లినట్లయింది.
కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఇంకా అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలోనే ఉంది. ఒకవేళ అభ్యర్థుల ప్రకటన జరిగితే మాత్రం అక్కడా అసంతృప్తిజ్వాలలు రగిలే అవకాశం ఉంది. దానికోసం రేవంత్‌రెడ్డితోపాటు, మాణిక్‌రావ్ ఠాక్రే, డి.కే. శివకుమార్, సునీల్ కనగోలులు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రచారం షురూ చేసిన బీఆరెస్-కాంగ్రెస్
ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఈసారి తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చావో రేవో లాగా మారితే, మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న కసి బీఆరెస్ పార్టీలో ఉంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ రాజకీయ ప్రచారాన్నితీవ్ర తరం చేశాయి. అభ్యర్థుల కన్నా పార్టీ గుర్తుకే ఎక్కువ ప్రాధాన్యత వచ్చేలా ప్రచారాన్ని దాదాపు ప్రారంభించాయి. రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం, బీఎస్సీ, కమ్యూనిస్టులు పోటీ చేస్తున్నా, ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆరెస్‌ల మధ్యే నెలకొన్నదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు పార్టీల అగ్ర నేతలు డూ ఆర్ డై అన్నతీరుగా వ్యవహరిస్తున్నారు. మూడవ దఫా గెలిచి హ్రట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో బీఆరెస్ ఉండగా, ఈ ఎన్నికల్లో తాము గెలిచి బీఆరెస్‌కు బ్రేక్ వేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది.
కాగా రాష్ట్రంలో బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం మేమేనంటు ఇన్నాళ్లూ ఊదరగొట్టిన బీజేపీ మాత్రం ఎందుకో ఓట్ల రాజకీయంలో వెనుకబడిపోయిందంటున్నారు. బీఆరెస్-బీజేపీ ఒక్కటే అన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారమో, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకపోవడమో తెలియదుకానీ, మొత్తంగా బీజేపీ పట్ల ఓటర్లలో మునుపటి ఆదరణ లేదన్నది వివిధ సర్వేల్లో వెల్లడైంది. దీంతో ఆ పార్టీ నాయకత్వం కూడా బండి సంజయ్‌ని పక్కనబెట్టి, కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. బండి వర్గం మొత్తం చురుగ్గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని, మరోవైపు ఈటల వర్గం కూడా అంతంత మాత్రంగానే ఉంటోందని చెబుతున్నారు.
ఇక ఎప్పటినుంచో బిజేపీని అంటిపెట్టుకున్న లక్ష్మణ్ వర్గం తటస్థంగా ఉండటం వల్ల ఈసారి బీజేపీ పాత్ర నామమాత్రంగానే ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ ఏ ఎన్నికల్లోనూ తెలంగాణలో బీఎస్పీ పెద్దగా ప్రభావం చూపించలేదు. 2004 ఎన్నికల్లో మాత్రం బీఎస్పీ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం దక్కించుకుంది. అయితే ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలంగాణ బిఎస్పీ పగ్గాలు చేపట్టాక, ఆ పార్టీ కొంత మేరకు పుంజుకున్నా ఎన్నికల్లో ఓట్లు చీల్చేంత స్థాయిలో బలపడలేదని సర్వేల్లో స్పష్టమవుతోంది. ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా గెలవడం కష్టమనే తీరుగా సర్వేలు వెల్లడవుతున్నాయి.
మొన్నటిదాకా బీఆరెస్‌తో చెట్టాపట్టాలేసుకున్న కమ్యూనిస్టుల పాత్ర కూడా ఈ ఎన్నికల్లో పెద్దగా కనిపించే అవకాశాలు లేవంటున్నారు. మునుగోడు వరకూ కమ్యూనిస్టులను వాడుకున్న కేసీఆర్, తరువాత వారిని అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించడమేకాదు, ఏకపక్షంగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి పొత్తు లేదన్న విషయాన్ని చెంప చెళ్లు మనేలా చెప్పారు. దీంతో గుర్రుగా ఉన్న కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో చర్చలు జరిపారు.
మాణిక్‌రావ్ ఠాక్రేతో చర్చల తరువాత ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. కాకుంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని స్థానాలు కమ్యూనిస్టులకు ఇస్తుందన్న విషయంలో స్పష్టత లేదు. శనివారం నాటి సంప్రదింపుల్లో కమ్యూనిస్టులకు బెల్లంపల్లి, కొత్తగూడెం, మునుగోడు, హుస్నాబాద్ నాలుగు స్థానాలు కేటాయించాలని ప్రతిపాదించారు. దీనిపై కాంగ్రెస్ ఇంకా పరిశీలన చేస్తున్నదే తప్ప… పొత్తుపైకానీ, సీట్ల కేటాయింపుపైగానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రభావం అంతంత మాత్రమే అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

సర్వేలు ఏమి చెపుతున్నాయంటే..
రాష్ట్రంలో గెలుపు ఓటములపై పలువురు నిర్వహించిన సర్వేలలో కాంగ్రెస్, బీఆరెస్‌ల మధ్య పోటా పోటీ ఉన్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా ఇటీవల ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి62, బీఆరెస్ 42 సీట్లలో ఆధిక్యంలో ఉంటుందని తెలిపింది. ఇలా పలు మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలలో సంఖ్యా పరంగా ఒకటి అటు ఇటుగా ఉన్నా కాంగ్రెస్‌కు బొటా బొటి మెజార్టీ చూపిస్తున్నది.
ఒక వైపు మీడియా సంస్థలు, ఆయా రాజకీయ పార్టీలు ఎవరికి వారు సర్వేలు చేయించుకుంటుండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగినట్లు తెలిసింది. రాష్ట్రంలో రెండు మూడు దఫాలుగా తమ బృందాలను ప్రత్యేకంగా రంగంలోకి దింపి సర్వేలు చేయించినట్లు సమాచారం. ఈ బెట్టింగ్ ముటాలు అత్యంత రహస్యంగా నిర్వహించిన సర్వేల్లో బొటా బొటిగా బీఆరెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటుందని వచ్చినట్లు తెలిసింది. బీఆరెస్ 64, కాంగ్రెస్ 35 నుంచి 40 మధ్య ఆధిక్యంలో ఉంటే అవకాశం ఉందని బెట్టింగ్ రాయుళ్ల సర్వేలో వచ్చినట్లు సమాచారం.
కాగా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇటీవలి కాలంలో ఒక 30 నియోజకవర్గాలలో నిర్వహించిన సర్వేల్లో 16 స్థానాల్లో బీఆరెస్, 14 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లు ఫలితం వచ్చినట్లు తెలిసింది. ఇలా కాంగ్రెస్, బీఆరెస్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. కాగా సర్వేలు చేయిస్తున్న వాళ్లకు ఆసక్తి కరమైన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌కు మొగ్గు చూపుతున్న వాళ్లు కూడా పార్లమెంటుకు మాత్రం కాంగ్రెస్‌కే జై కొడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

దూకుడు పెంచిన పార్టీలు
పలువురు నిర్వహించిన సర్వేలలో కొద్ది పాటి తేడాతోనే గెలుపోటములు ఉండే వాతావరణం ఏర్పడడంతో కాంగ్రెస్, బీఆరెస్ పార్టీలు దూకుడు పెంచాయి. ఈ రెండు పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తులు, తిరుగుబాటు దారులకు గాలాలు వేస్తున్నాయి. మరో వైపు సొంత పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్నాయి. ఇలా బీఆరెస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు సొంత పార్టీలను చక్కబెట్టుకోవడంతో పాటు ఇతర పార్టీల నేతలను గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా బీఆరెస్, బీజేపీలకు చెందిన కీలకమైన నేతలను పార్టీలోకి తీసుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. బీఆరెస్ సీనియర్ నేతలు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావుతదితర సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగా బీజేపీ నుంచి మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్, జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్‌లో చేరారు.
తాజాగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మల్యే వేముల వీరేశంలు కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దమయ్యారు.అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు కాంగ్రెస్‌లో చేరారు. ఇలా బీఆరెస్‌లో బలమున్న పార్టీ నేతలను కాంగ్రెస్ చేర్చుకున్నది. 2018 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన కేసీఆర్‌కు చెక్ పెట్టాలన్న కృత నిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆదిశగా తీవ్ర యత్నాలు చేస్తున్నారు. ఎంత మేరకైనా ఖర్చు చేయడానికి వెనుకాడ కూడదన్న కృత నిశ్చయంతో కాంగ్రెస్ నేతలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ పార్టీపై నేరుగా ఏఐసీసీ అగ్రనేతలు కేంద్రీకరించడం గమనార్హం.
ఇదే తీరుగా బీఆరెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలపై నజర్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి బంగపడే నేతలందరిని దగ్గరకు తీయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు తెలిసింది. ఇందు కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడ కూడదన్న నిర్ణయంతో బీఆరెస్ అధినేత కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారన్న ప్రచారం జరుగుతోంది. ఒక్కో నాయకుడికి నియోజక వర్గంలో ఏమేరకు ఓటర్లలను ప్రభావితం చేయగలడనే అంచనాతో కొనుగోలు చేయాలని అభ్యర్థులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు నిధులన్ని నేరుగా తామే పంపిస్తామని చెప్పినట్లు సమాచారం. ఇలా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అసంతృప్త నేతలకు కోట్లలోనే చెల్లించడానికి అధికార పార్టీ సిద్దమైనట్లు తెలుస్తోంది.