అయోధ్యకు పోటెత్తిన భక్తులు..! రెండోరోజూ కిక్కిరిసిన ఆలయం..!
అయోధ్య రామ మందిరంలో కొలువుదీరిన బాలక్ రామ్‌ను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు

Ayodhya | అయోధ్య రామ మందిరంలో కొలువుదీరిన బాలక్ రామ్‌ను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తొలిరోజు మంగళవారం లక్షలాది మంది రామ భక్తులు తరలివచ్చారు. ఆలయంలో దర్శనాలు ఏడు గంటల నుంచి కల్పిస్తున్నా.. భక్తులు మాత్రం వేకువ జామున 3 గంటలకు చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలిరోజు కొత్త రికార్డును సృష్టించింది. మంగళవారం ఐదు లక్షల మంది భక్తులు శ్రీరామ దర్బార్‌కు హాజరయ్యారు. రాత్రి 9 గంటల వరకు ఆలయంలో దర్శనం కల్పించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు.
అయోధ్యకు చేరుకున్న తర్వాత భక్తులు దర్శనం కోసం ఓపిక పట్టాలని కోరారు. భారీగా భక్తులు తరలివస్తుండడంతో అయోధ్యకు వచ్చే రోడ్‌వే బస్సులను నిలిపివేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అయోధ్య రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జనసందోహంగా భారీగా స్థిరంగానే ఉందని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు రెండురోజుల తర్వాత అయోధ్య ప్రయాణానికి ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెండోరోజు బుధవారం సైతం పెద్ద సంఖ్యలో భక్తులు రాముడి దర్శనానికి తరలివచ్చారు. వేకువ జామునే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
రాంపథ్ వద్ద భారీ సంఖ్యలో బాలక్ రామ్ దర్శనం కోసం చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆలయంలో ఇకపై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనాలు నిరంతరాయంగా దర్శనాలు కల్పించాలని జిల్లా యంత్రాంగం, శ్రీరామజన్మభూమి ట్రస్టు నిర్ణయించాయి. హారతి, భోగ్ కోసం దర్శనాన్ని కొంతసేపు నిలిపివేస్తున్నట్లు డీఎం నితీశ్ కుమార్ పేర్కొన్నారు. ఊహించినదాని కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు రెండువిడుతల్లో దర్శనాలు కల్పించాలని ట్రస్టు నిర్ణయించిన విషయం తెలిసిందే.