ఈ పురాత‌న కోట.. మానవ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తుందా? శాస్త్రవేత్త‌ల్లో అయోమ‌యం!

ప‌రిశోధ‌న‌లు ముందుకు సాగే కొద్దీ అప్ప‌టి వ‌ర‌కు మ‌నం నిజ‌మ‌ని న‌మ్మిన కొన్ని విష‌యాల‌ను అనుమానించాల్సి రావ‌డం స‌హ‌జ‌మే

  • Publish Date - December 21, 2023 / 10:59 AM IST

విధాత‌: ప‌రిశోధ‌న‌లు ముందుకు సాగే కొద్దీ అప్ప‌టి వ‌ర‌కు మ‌నం నిజ‌మ‌ని న‌మ్మిన కొన్ని విష‌యాల‌ను అనుమానించాల్సి రావ‌డం స‌హ‌జ‌మే. మ‌న పూర్వీకుల స్థితిగ‌తులు, జీవ‌న విధానానికి (Human Evaluation) సంబందించిన విష‌యాల‌కు సంబంధించి అయితే ఇది మరిన్ని సార్లు జ‌రుగుతుంది. తాజాగా ఒక అంత‌ర్జాతీయ బృందం క‌నుగొన్న ఓ కోట (Oldest Fort) .. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను పూర్తిగా తారుమారే చేస్తున్నాయ‌ని తెలుస్తోంది.


ర‌ష్యా స‌మీపంలోని సైబీరియా (Siberia) మారు మూల ప్రాంతంలో ఈ కోట అవ‌శేషాల‌ను ప‌రిశోధ‌కులు క‌నుగొన్నారు. కార్బ‌న్ డేటింగ్ ద్వారా ఆ అవ‌శేషాల‌ను ప‌రీక్షించి చూడ‌గా దాని వ‌య‌సు సుమారు 8000 ఏళ్ల‌ని తేలింది. ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ అనుకుంటున్న దాని ప్ర‌కారం.. మ‌నిషి ఒక‌చోట ఉండి వ్య‌వ‌సాయం చేయ‌డం నేర్చుకున్నాకే కోట‌లు ఇళ్లు క‌ట్టుకునేవార‌ని.. అంత‌కు ముందు సంచార జీవ‌న‌మే చేసేవారు. కానీ ఈ కోట వ‌య‌సు క‌నుక నిజ‌మైతే వ్య‌వ‌సాయం నేర్చుకోక మునుపే మ‌న పూర్వీకుల‌కు కోట‌లు క‌ట్ట‌డం తెలుస‌నుకోవాల‌ని.. అప్పుడు సంచార జీవ‌నం ఉండేద‌న్న వాద‌నా త‌ప్ప‌వుతుంది.


అందుకే శాస్త్రవేత్త‌లు ఈ కొత్త కోట విష‌యాల‌ను అమిత ఆస‌క్తితో ప‌రిశోధిస్తున్నారు. ఆ వివ‌రాల‌ను యాంటిక్విటీ జ‌ర్న‌ల్‌లో ప్రచురించారు. ద వ‌ర‌ల్డ్స్ ఓల్డెస్ట్ ప్రొమొట‌రీ ఫోర్ట్‌.. ఆమ‌న్యా అండ్ ద యాక్స‌ల‌రేష‌న్ ఆఫ్ హంట‌ర్ గాద‌ర‌ర్ డైవ‌ర్సిటీ ఇన్ సైబీరియా 8000 ఇయ‌ర్స్ ఎగో అనే పేరుతో ఈ ప‌రిశోధ‌న ప‌త్రం ప్రచురిత‌మైంది. ఈ అధ్య‌య‌నానికి (Study) ప్రొఫెస‌ర్ హెన్నీ పియోజోనకా నేతృత్వం వ‌హించారు. ఈ ప‌రిశోధ‌న కోసం అమ‌న్యా ప్రాంతంలో కోట అవ‌శేషాల‌ను త‌వ్వి తీశారు. ప‌క్కనే అమ‌న్యా నది ప్ర‌వ‌హిస్తూ ఉండ‌టంతో ఈ చోటు సుర‌క్షితంగా ఉంటుంద‌ని అప్ప‌టి వారు భావించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.


అంతే కాకుండా కోట ప్ర‌హ‌రీ చుట్టూ 20 చిన్న చిన్న ఇళ్లు ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. అంటే ఇక్క‌డ ఉన్న కోటను పూర్తి భ‌ద్ర‌తా దృష్టితో.. ఎవ‌రూ దాడి చేయ‌కూడ‌ని విధంగా ఉండేలా చేశార‌ని అంటున్నారు. ఇక్క‌డ దొరికిన రాళ్ల‌తో త‌యారుచేసిన బ‌ల్లాల‌ను బ‌ట్టి.. ఇక్క‌డి వారు ప‌క్కనే ఉన్న న‌దిలో చేప‌లు ప‌ట్టడం, అడ‌వి దున్న‌ల‌ను వేటాడ‌టం చేసే వార‌ని తెలుస్తోంది.


అయితే ఇంత భారీ కోట‌ను శ‌త్రుదుర్భేధ్యంగా క‌ట్ట‌డం వెనుక ఉన్న కార‌ణాన్ని శాస్త్రవేత్త‌లు తెలుసుకోలేపోతున్నారు. ఒక వేటాడే జాతికి ఇంత అవ‌స‌రం ఏమొచ్చి ఉంటుంద‌ని మ‌ద‌న‌ప‌డుతున్నారు. ఒక వేళ భ‌ద్ర‌తే ప్రాధాన్యం అనుకున్నా ఒక న‌ది పక్కన ఉండ‌టమే అధిక సురక్షిత‌మ‌ని కోట క‌ట్ట‌డం వృథా ప్ర‌యాసేన‌ని ప్రొఫెస‌ర్ హెన్నీ వివ‌రించారు. ఏదేమైన‌ప్ప‌టికీ దీని వెనుక ఉన్న కార‌ణాన్ని క‌నుగొన‌డానికి మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

Latest News