సల సలా మరుగుతున్న కృష్ణా జలాలు!
చల్లగా పారే కృష్ణా జలాలు.. మరుగుతున్నాయి. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సెగలు రేపుతున్నాయి. మాజీ ప్రభుత్వానికి, తాజా ప్రభుత్వానికి మధ్య నీటి

- అసెంబ్లీ సమావేశాల్లో నీటి యుద్ధమే
- నిర్వహణ బాధ్యత అప్పగించిది ఎవరు?
- పాపం మాదికాదంటున్న కాంగ్రెస్, బీఆరెస్
- జగన్‌తో బీఆరెస్ ప్రభుత్వ కుమ్మక్కు వల్లే
- మండిపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు
- గట్టిగా ఎదుర్కొంటామంటున్న బీఆరెస్
- పదేళ్లలో ప్రాజెక్ట్‌లు అప్పగించలేదన్న హరీశ్
- కేసీఆర్ ఎంపీగా అంగీకరించారన్నరేవంత్
విధాత: చల్లగా పారే కృష్ణా జలాలు.. మరుగుతున్నాయి. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సెగలు రేపుతున్నాయి. మాజీ ప్రభుత్వానికి, తాజా ప్రభుత్వానికి మధ్య నీటి యుద్ధానికి శంఖం పూరిస్తున్నాయి. హైదరాబాద్ తాగునీటితో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగు, తాగునీరు అందించే కృష్ణా నది నీటి వాటాలు తేల్చకుండా ఏకంగా ప్రాజెక్ట్‌ల నిర్వహణ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగింత వివాదాస్పదమైంది. ఈ పాపం మీదే అని బీఆరెస్ కస్సుమంటుంటే.. కాదు.. మీదేనంటూ బీఆరెస్ గయ్‌మంటున్నది. ప్రాజెక్ట్‌లు, జలాల పంపిణీపై అసెంబ్లీలో రెండు రోజులు ప్రత్యేక చర్చ పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్ట్‌లపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. కృష్ణా ప్రాజెక్ట్‌లను బోర్డుకు అప్పగించడానికి కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పడే అంగీరించారనేది రేవంత్ వాదన. కేసీఆర్ ఆమోదం మేరకే విభజన బిల్లులో ఆ అంశాన్ని ప్రవేశపెట్టారని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వివాదం ఇంకా ముదిరిగింది. దీనిపై తీవ్రంగా స్పందించిన మాజీ మంత్రి హరీశ్‌రావు గత పదేళ్లలో తాము ప్రాజెక్ట్‌ల నిర్వహణను కేంద్రానికి అప్పగించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోపే కేంద్రానికి అప్పగిస్తున్నారని ఆరోపణలకు దిగారు. ఈ విషయంలో ఒక విధంగా ఇరు పార్టీల నేతలు బూతు పురాణమెత్తుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు చేసిన పాపాలు కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్‌పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని రేవంత్ ఆరోపిస్తే, ప్రాజెక్ట్‌ల అప్పగింతలపై నిరసనలు వ్యక్తం చేయాలని బీఆరెస్ పిలుపు ఇచ్చింది.
తన రాజకీయ మిత్రుడు ఏపీ సీఎం జగన్‌కు లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ ఆనాడు వ్యవహరించారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు పిలుచుకోవడానికి వీలుగా బోర్డు సమావేశాన్ని నాటి సీఎం వాయిదా వేయించారని ఆరోపించారు. పైగా కృష్ణా పరివాహక ప్రాంతానికి తగిన విధంగా తెలంగాణకు నీటి కేటాయింపులు జరగకుండా 811 టీఎంసీలలో కేవలం 299 టీఎంసీలే కేటాయించి, ఏపీకి 511 టీఎంసీలు కేటాయించేందుకు అంగీకరించారని, ఇదంతా తెలంగాణకు కేసీఆర్ చేసిన అన్యాయంగా రేవంత్ చెపుతున్నారు. బీఆరెస్ పాలనలో దక్షిణ తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరిగిందని, శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పూర్తి చేయకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి కేసీఆర్ నల్లగొండకు తీరని అన్యాయం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పడు తగదునమ్మా అంటూ నల్లగొండలో నిరసన సభ పెట్టడాన్ని ఆక్షేపించింది. ఎన్నికల నాడు జగన్ తన పోలీసులతో నాగార్జున సాగర్ డ్యామ్‌ను ఆక్రమిస్తే ఎందుకు తోకముడిచామని ప్రశ్నించింది. పైగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయకపోవడాన్ని కాంగ్రెస్ తప్పు పట్టింది. వీటన్నింటినీ కాంగ్రెస్ తన శ్వేత పత్రంతో వెల్లడించేందుకు సిద్ధమైంది. వీటిపై చర్చకు సై అంటున్నది.
అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి బీఆరెస్ సిద్ధమైంది. పైగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు మంగళవారం దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. పార్లమెంటు ఎన్నికలలో ఈ ప్రాంతంలో పాగా వేయడానికి కేసీఆర్ తన వ్యూహానికి పదును పెడుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది.