క్యాన్సర్‌తో చనిపోయిన మాజీ మిస్‌ ఇండియా త్రిపుర

క్యాన్సర్‌తో రెండున్నరేళ్లు పోరాడిన మాజీ మిస్‌ ఇండియా త్రిపుర రింకీ చక్మా చనిపోయారు. ఆమె వయసు 28 ఏళ్లు. సర్జరీ చేసినా కూడా ఫలితం లేకపోయింది

  • Publish Date - March 1, 2024 / 12:06 PM IST

అగర్తల: క్యాన్సర్‌తో రెండున్నరేళ్లు పోరాడిన మాజీ మిస్‌ ఇండియా త్రిపుర రింకీ చక్మా చనిపోయారు. ఆమె వయసు 28 ఏళ్లు. సర్జరీ చేసినా కూడా ఫలితం లేకపోయింది. చక్మా మృతికి సంతాపం ప్రకటిస్తూ ఫెమీనా మిస్‌ ఇండియా సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెట్టింది. బలమైన సంకల్పాలు, దయ కలిగిన శక్తిమంతమైన మహిళగా అభివర్ణించింది. ఈ కష్టకాలంలో ఆమె కుటుంబానికి హృదయపూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నది. ఆమెకు తొలి సర్జరీ జరిగిన అనంతరం ఊపిరితిత్తుల్లోకి, మెదడులోకి క్యాన్సర్‌ విస్తరించింది.


తన ఆరోగ్య పరిస్థితి గురించి మొట్టమొదటిసారిగా చక్మా గత నెలలోనే ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా ప్రపంచానికి చక్మా తెలిపారు. తాను రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నానని పేర్కొన్నారు. తన అనారోగ్యం గురించి ఎవరికీ చెప్పాలనుకోలేదని వెల్లడించారు. తాను క్యాన్సర్‌పై పోరాటం చేసి గెలవగలనన్న విశ్వాసంతో ఉన్నానని రాశారు. ‘కానీ.. నా ఆరోగ్యం గురించి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అనిపిస్తున్నది. నేను మలిగ్నెంట్‌ ఫిలోడ్స్‌ ట్యూమర్‌ (రొమ్ము క్యాన్సర్‌)తో బాధపడుతున్నాను’ అని తెలిపారు. తన కష్టాన్ని పంచుకుంటే ఊరట లభిస్తుందని ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు పేర్కొన్నారు. తన చికిత్స కోసం కుటుంబం దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చయిపోవడంతో విరాళాలు కూడా తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. తన కోసం ప్రార్థించాలని కూడా విజ్ఞప్తి చేశారు. కానీ.. విధి మరోలా తలచింది. చిన్న వయసులోనే ఆమెను క్యాన్సర్‌ కబళించింది.

Latest News