మీ మాట‌ల్లో వ్యంగ్యం ఎక్కువైంది.. వ్య‌వ‌హారం త‌క్కువైంది

ప్ర‌తిప‌క్ష బీఆరెస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శల్లో వ్యంగ్యం ఎక్కువైందని, వ్య‌వ‌హారం త‌క్కువైందని, చక్కగా మాట్లాడితే తప్పకుండా సహకరిస్తామని

  • Publish Date - February 9, 2024 / 01:35 PM IST

చక్కగా మాట్లాడితే సహకరిస్తాం

ఎస్‌ఎల్‌బీసీ, సాగర్ సమస్యలపై సీఎంకు అవగాహాన లేదు

మాజీ మంత్రి టి.హరీశ్ రావు

విధాత, హైదరాబాద్ : ప్ర‌తిప‌క్ష బీఆరెస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శల్లో వ్యంగ్యం ఎక్కువైందని, వ్య‌వ‌హారం త‌క్కువైందని, చక్కగా మాట్లాడితే తప్పకుండా సహకరిస్తామని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడారు.సీఎం రేవంత్‌రెడ్డి చాలా చిన్న వ‌య‌సులో సీఎం కావ‌డం త‌న అదృష్ట‌మ‌న్నారు. వ్యంగ్యం త‌గ్గించుకోని, వ్య‌వ‌హారం మీద దృష్టి సారించాల‌ని సీఎంకు సూచిస్తున్నానన్నారు. రేవంత్ ఏదైనా మాట్లాడితే.. అగ్గిపెట్టె ముచ్చ‌ట తీసుకువ‌స్తారని, అది స‌రికాద‌న్నారు. అమ‌ర‌వీరుల‌కు కాంగ్రెస్ నాయ‌కులు ఏనాడు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించ‌లేదని, అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను పరామ‌ర్శించ‌లేదని, కాంగ్రెసోళ్లు అమ‌రవీరుల‌ పాడే మోసినోళ్లు కాదని,. తుపాకుల‌తో ఉద్య‌మ‌కారులను బెదిరించిన మీకు తెలంగాణ పోరాటం, అమ‌ర‌వీరుల‌కు గురించి తెలుస్త‌ద‌ని అనుకోనన్నారు.. ఇక అరిగిపోయిన గ్రామ‌ఫోన్ రికార్డు లాగా ఈ అగ్గిపెట్టె ముచ్చ‌ట మాట్లాడ‌టం బంద్ చేయండన్నారు.. త‌మ‌ను కించ‌ప‌రిచి, రాజ‌కీయంగా విమ‌ర్శిస్తాం అనుకుంటే.. అది మీ రాజ‌కీయ విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నాను అని హ‌రీశ్‌రావు అన్నారు. ఎస్ఎల్‌బీసీ విష‌యంలో స‌భ‌ను సీఎం రేవంత్‌రెడ్డి త‌ప్పుదోవ ప‌ట్టించారన్నారు.

ప‌దేండ్ల‌లో కిలోమీట‌ర్ త‌వ్వారని చెప్పారని, బీఆరెస్‌ ప్ర‌భుత్వ‌ హ‌యాంలో 11 కిలోమీట‌ర్లు త‌వ్విన‌ట్లు హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. దీన్ని సీఎం క‌రెక్ష‌న్ చేసుకోవాలన్నారు. ఇంకోసారి మాట్లాడేప్పుడు అవ‌గాహ‌న‌తో మాట్లాడాల‌ని రేవంత్‌కు హ‌రీశ్‌రావు సూచించారు. నాగార్జున సాగ‌ర్ విష‌యంలో కూడా సీఎం స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారన్నారు. ఏపీ ప్ర‌భుత్వం కంట్రోల్‌లో శ్రీశైలం, తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్‌లో నాగార్జున సాగ‌ర్‌ను ఇచ్చారని, ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలో సాగ‌ర్‌ను ఏపీ కంట్రోల్‌లోకి తీసుకుందన్నారు. రెండు నెల‌లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ సీఆర్పీఎఫ్ భ‌ద్ర‌త‌లో సాగ‌ర్‌ ఉందని, శ్రీశైలం కూడా ఏపీ హ‌యాంలో ఉందని, సాగ‌ర్‌ను తెలంగాణ ఆధీనంలోకి తీసుకునేందుకు కృషి చేయాలని, దీనికోసం స‌హ‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులంద‌రికీ ఒక‌టో తారీఖున జీతాలు ఇచ్చామ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్ప‌డం అస‌త్యం అన్నారు. ప‌లు శాఖ‌ల్లో ఏడో తారీఖు వ‌ర‌కు కూడా జీతాలు ప‌డ్డాయని, ఇప్ప‌టికీ కొన్ని శాఖ‌ల్లో జీతాలే ప‌డ‌లేదని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల‌కు రెండు నెల‌ల జీతాలు రాలేదని,. ఐకేపీ, బీవోఏల‌కు జీతాలు ప‌డ‌లేదని, విద్యాశాఖ‌లో స‌ర్వ‌శిక్షా అభియాన్‌లో జీతాలు ప‌డ‌ని ప‌రిస్థితి ఉందని, వీటిని సీఎం క‌రెక్ష‌న్ చేసుకోవాలన్నారు.

రైతుబంధు విష‌యంలో సీఎం అస‌త్యాలు మాట్లాడుతున్నారని, తాము రూ. 7500 కోట్ల రైతుబంధు ఇవ్వాల్సి ఉంటే.. దాదాపు రూ. 6 వేల కోట్ల మొద‌టి నెల రోజుల్లోనే ఇచ్చామని, మిగిలి దాని విష‌యంలో ఆల‌స్యం జ‌రిగి ఉండొచ్చని, మీ హయాంలో ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉందని హ‌రీశ్‌రావు అన్నారు. పీవీకి భార‌త‌ర‌త్న అవార్డు ఇవ్వ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణమన్నారు. పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని బీఆరెస్‌ ప్ర‌భుత్వం ఏక‌గ్రీవ తీర్మానం చేసి పంపిస్తే.. ఈ రోజు కేంద్రం వారికి భార‌త‌ర‌త్న ఇచ్చినందుకు ఈ స‌భ‌లో ఏగ‌క్రీవ తీర్మానం చేసి కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం పీవీని ప‌ట్టించుకోలేదని, బీఆరెస్ ప్రభుత్వమే పీవీ ఘాట్‌ను ఏర్పాటు చేసిందని,అసెంబ్లీలో పీవీ చిత్ర‌ప‌టం ఏర్పాటు చేసిందని, పీవీ కుమార్తె సుర‌భి వాణిదేవీకి ఎమ్మెల్సీ ఇచ్చిందని, పీవీ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించిందన్నారు.

Latest News