ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే..

రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ మ‌ధ్యే పోటీ కొన్ని సీట్ల‌లో కాంగ్రెస్ గ‌ట్టి పోటీ ఇచ్చే స్థితి మేమే ప్ర‌త్యామ్నాయం అంటున్నా.. అభ్య‌ర్థులే దొర‌క‌ని దుస్థితి ఇప్పుడున్న‌వి నిలుపుకోవ‌ట‌మే గ‌గ‌నం మిగ‌తా పార్టీల‌కు ప్ర‌భావం చూపే సీను లేదు విధాత‌: తెలంగాణ స‌మాజంలో అంత‌ర్గ‌తంగా ఎవ‌రికీ క‌నిపించ‌నిదేదో అండ‌ర్ క‌రెంట్‌గా ప్ర‌వ‌హిస్తున్న‌ది. రాజ‌కీయంగా పైకి క‌నిపిస్తున్న‌దంతా నిజం అనుకోలేము. భూ పొర‌ల్లో క‌ద‌లబారుతున్న నీటి ప్ర‌వాహంలా తెలంగాణ గ్రామీణ స‌మాజంలో కంటికి క‌నిపించ‌ని క‌ద‌లిక ఏదో కొన‌సాగుతున్న‌ది. దీనికి […]

  • By: krs    latest    Nov 23, 2022 2:42 PM IST
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే..
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ మ‌ధ్యే పోటీ
  • కొన్ని సీట్ల‌లో కాంగ్రెస్ గ‌ట్టి పోటీ ఇచ్చే స్థితి
  • మేమే ప్ర‌త్యామ్నాయం అంటున్నా.. అభ్య‌ర్థులే దొర‌క‌ని దుస్థితి
  • ఇప్పుడున్న‌వి నిలుపుకోవ‌ట‌మే గ‌గ‌నం
  • మిగ‌తా పార్టీల‌కు ప్ర‌భావం చూపే సీను లేదు

విధాత‌: తెలంగాణ స‌మాజంలో అంత‌ర్గ‌తంగా ఎవ‌రికీ క‌నిపించ‌నిదేదో అండ‌ర్ క‌రెంట్‌గా ప్ర‌వ‌హిస్తున్న‌ది. రాజ‌కీయంగా పైకి క‌నిపిస్తున్న‌దంతా నిజం అనుకోలేము. భూ పొర‌ల్లో క‌ద‌లబారుతున్న నీటి ప్ర‌వాహంలా తెలంగాణ గ్రామీణ స‌మాజంలో కంటికి క‌నిపించ‌ని క‌ద‌లిక ఏదో కొన‌సాగుతున్న‌ది. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా మొన్న జ‌రిగిన మునుగోడు ఎన్నిక‌లే అని చెప్ప‌వ‌చ్చు.

మునుగోడులో గెలిచిందెవ‌రు..

మునుగోడు ఎన్నిక‌ల్లో ప్రాధాన పార్టీలైన టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎంత ప్ర‌తాష్ఠాత్మ‌కంగా తీసుకొని స‌ర్వ‌ శ‌క్తులు ఒడ్డి ఏ రీతిన పోరాడాయో చూశాం. అంగ‌, ఆర్థిక బాలాల‌ను ఏ తీరుగ ప్ర‌యోగించాయో అనుభ‌వంలోకి వ‌చ్చింది. పోటీ అన్న త‌ర్వాత గెలుపు, ఓట‌మి అనివార్యంగా ఉంటాయి. కానీ మునుగోడులో ఎంత చేసినా ఏ పార్టీ గెలువ‌లేదు. గెలిచింది మాత్రం ఓట‌రే.

దేశంలో అతి ఖ‌రీదైన ఎన్నిక‌

బ‌హుశా అతిశ‌యోక్తి కాద‌నుకుంటే దేశంలోనే అతి ఖ‌రీదైన ఎన్నిక‌గా మునుగోడు ఎల‌క్ష‌న్ చ‌రిత్ర‌లో నిలిచిపోనున్న‌ది. అయినా పార్టీలు త‌మ ఆర్థిక‌, అంగ బ‌లంతో ప్ర‌జ‌ల‌ను తాము ఆశించిన స్థాయిలో త‌మ వైపుకు తిప్పుకోలేక పోయాయి. ఎన్నో గొప్ప‌లు పోయిన పార్టీలు బొక్క‌బోర్ల ప‌డ్డాయి. ఓట‌ర్లు త‌మ మ‌నో భావాలకు పెద్ద పీట వేశారు. అధికార పార్టీని గెలిపించి ఓడించారు. ప్ర‌త్య‌ర్థి బీజేపీ పార్టీ రాజ‌గోపాల్ రెడ్డిని ఓడించి గెలిపించారు. ఇందులో ఉన్న‌ది ఏమంటే… ప్ర‌జ‌లు అంత‌ర్గ‌తంగా ప్ర‌స్తుత పాల‌న ప‌ట్ల ఉన్న అసంతృప్తిని, వ్య‌తిరేక‌త‌ను ప్ర‌తిబింబించారు.

పాల‌న అంటే ఇది కాదు..

ఇవ్వాళ తెలంగాణ‌లో ఎక్క‌డైనా ఓ సామాన్య రైతును కదిలిస్తే.. అత‌ని అంత‌ర్గ‌తం అర్థ‌మ‌వుతుంది. రైతు బంధు మొద‌లు సాగునీరు, తాగు నీరు, క‌ల్యాణ ల‌క్ష్మీ, ఆస‌రా ఫించ‌న్ల దాకా అన్నింటినీ గొప్ప ప‌థ‌కాలుగా, మంచివీ అవ‌స‌ర‌మైన‌వీ అని చెప్తూనే.. పాల‌న అంటే ఇది కాద‌యా అంటున్న‌డు. ప్ర‌జ‌ల‌ను బిక్ష‌గాళ్ల‌ను చేసే పాల‌న అక్క‌ర‌లేదంటున్న‌డు. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసి క‌డుపు నిండా తిండి పెడ్తున్న‌మ‌ని జైళ్లో వేస్తే ప‌డి ఉంట‌మా అని నిల‌దీస్తున్న‌డు. నోటికి తాలం వేసి, కాళ్ల చేతుల‌కు బంధ‌నాలు వేసి ఆక‌లి తీరుస్తున్నం క‌దా అంటే ఆ కూడు అక్క‌ర లేదంటున్న‌డు. ఇదీ ఇవ్వాళ‌ ఓ సామాన్యుని భావ‌న‌.

ప్ర‌జ‌ల్లో టీఆర్ఎస్‌పై అసంతృప్తి

పైపై ప‌టాటోపాలు, అట్ట‌హాసాలు చూసి అదే బ‌లం అనుకుంటే అది అమాయ‌క‌త్వ‌మే అవుతుంది. ఈ క్ర‌మంలో తెలంగాణ స‌మాజాన్ని ఎక్స్‌రే చేస్తే.. టీఆర్ఎస్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో బ‌య‌టికి క‌నిపించ‌ని అసంతృప్తి జ్వాల ర‌గులుతున్న‌ది. స్థానిక ఎమ్మెల్యేలపై వ్య‌తిరేకత తీవ్ర‌స్థాయిలో ఉన్న‌ది. ధ‌ర‌ణి పేరుతో తెచ్చిన భూ సంస్క‌ర‌ణ చ‌ట్టం అనేక స‌మ‌స్య‌లతో వేదిస్తున్న‌ది. రైతు బంధు సంగ‌తి స‌రే కానీ, భూమి హ‌క్కుల సంగ‌తేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

బీజేపీకి మూడో స్థాన‌మేనా..

ఈ నేప‌థ్యంలోంచి తెలంగాణ స‌మాజ నాడిని ప‌ట్టి చూస్తే.. స‌మ‌స్తం అర్థ‌మ‌వుతుందని విధాత జ‌ర్న‌లిస్టుల బృందం భావించింది. తెలంగాణ అంత‌టా ఓ లోతైన అధ్య‌య‌నం చేసింది. వెర‌సి రాష్ట్రంలో ఇప్ప‌టి కిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఎవ‌రు గెలుస్తారు? అనే అంశంపై విధాత జ‌ర్న‌లిస్టుల బృందం ఓ అధ్య‌య‌నం చేసింది. అందులో అనేక‌ అంశాలు వెలుగుచూశాయి. ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీఆర్ ఎస్‌ల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ నెల‌కొనే అవ‌కాశం ఉంది. ఎంత హ‌డావిడి చేసినా బీజేపీ మాత్రం రాష్ట్రంలో మూడ‌వ స్థానానికే ప‌రిమితం కానున్న‌ది.

టీఆర్ ఎస్‌కు మెజార్టీ వ‌చ్చే అవ‌కాశాలు లేవు

అయితే టీఆర్ఎస్‌కు ఈసాస‌రి ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుకు చేయ‌డానికి త‌గిన పూర్తి మెజార్టీ వ‌చ్చే అవ‌కాశాలు లేన‌ప్ప‌టికీ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించే అవ‌కాశం మాత్రం ఉంది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఒక‌రి మ‌ద్ద‌తు తీసుకోవాల్సిన ప‌రిస్థితి టీఆర్ఎస్‌కు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీఆర్ఎస్ 45 నుంచి 50 సీట్ల‌లో త‌ప్ప‌నిస‌రిగా గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు

కాంగ్రెస్ పార్టీ 35 నుంచి 40 స్థానాల‌లో గెలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. కాగా రాష్ట్రంలో తామే అధికారంలోకి వ‌స్తామ‌ని చెప్పుకుంటున్న బీజేపీ కేవ‌లం 8 నుంచి 10 స్థానాల‌కే ప‌రిమితం కానున్న‌ట్లు ఈ అధ్య‌య‌నంలో తేలింది. హైద‌రాబాద్ న‌గ‌రంలో 7 స్థానాల‌లో ఎంఐఎం గెలుస్తున్న‌ది. 43 నుంచి 38 సీట్ల‌లో టీఆర్ఎస్ఓడి పోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 14 నుంచి 24 స్థానాల్లో హోరాహోరీగా కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ల మ‌ధ్య పోరాటం జ‌రుగ‌నున్న‌ది. దీనిని బ‌ట్టి ఈ రెండు పార్టీల‌లో ఎవ‌రు గెలిచినా అతి కొద్ది మెజార్టీతోనే బ‌య‌ట ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఊహించ‌ని స్థాయంలో బ‌లంగా ఉన్న కాంగ్రెస్‌

రాష్ట్రంలో అత్య‌ధిక స్థ‌నాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య‌నే ప్ర‌ధాన పోటీ ఉండ‌నున్న‌ది. ఇప్ప‌టికీ 70 స్థానాల్లో క్షేత్ర‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉంద‌ని అధ్య‌య‌నంలో తేలింది. ప్ర‌తి గ్రామంలో కాంగ్రెస్‌కు కార్య‌క‌ర్త‌లు క్షేత్ర స్థాయిలో ప‌ని చేస్తున్నారు. నాయ‌కులు మారినా కేవ‌లం పార్టీ కోసం అంటూ ప‌నిచేస్తున్న కార్య‌క‌ర్త‌లే నేడు కాంగ్రెస్‌కు బ‌లంగా క‌నిపిస్తున్న‌ది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 30 నుంచి 35 స్థానాలు, టీఆర్ఎస్‌కు 45 నుంచి 50 స్థానాలు, బీజేపీకి 8 నుంచి 10 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ప‌లు జిల్లాల్లో టీఆర్ఎస్‌ ఎదురీ

ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ న‌గ‌ర్‌, నల్లగొండ జిల్లాల్లో టీఆర్ఎస్ ఎదురీదుతున్న దాఖ‌లాలున్నాయి. కాగా నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.

ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే..ఫలితాఉ ఆ క్రింది విధంగా ఉన్నాయి.

మొత్తం అసెంబ్లీ స్థానాలు 119

టీఆర్ఎస్ 45-50
కాంగ్రెస్ 35-40
బీజేపీ 08-10
ఎంఐఎం 07