గుజ‌రాత్ మోడ‌ల్.. ఎట్టిదనినా! స‌గ‌టు జీవి అర్ధాక‌లి!

విధాత‌: న‌రేంద్ర మోదీ నోరు తెరిస్తే.. గుజ‌రాత్ మోడ‌ల్ గురించి మాట్లాడుతుంటారు. దేశాన్ని కూడా గుజ‌రాత్ లాగా చేస్తాన‌ని చెప్పి రాష్ట్ర ముఖ్య‌మంత్రి నుంచి దేశ ప్ర‌ధానిగా ఎదిగారు. నిజానికి గుజ‌రాత్ మోడ‌ల్ అంటే ఏమిటి? దాని స్వ‌రూప స్వ‌భావాలు ఎలా ఉన్నాయి? అది దేశానికి ఏ రంగంలో, ఏ అర్థంలో ఆద‌ర్శం? అన్న‌ది చూస్తే.. అభివృద్ధికి మూడు విధానాలు.. న‌రేంద్ర‌మోదీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా అధికారం చేప‌ట్టినప్ప‌టి నుంచీ 2002-03 నుంచి 2011-12 మ‌ధ్య కాలంలో గుజ‌రాత్ […]

  • By: krs    latest    Nov 23, 2022 2:31 PM IST
గుజ‌రాత్ మోడ‌ల్.. ఎట్టిదనినా! స‌గ‌టు జీవి అర్ధాక‌లి!

విధాత‌: న‌రేంద్ర మోదీ నోరు తెరిస్తే.. గుజ‌రాత్ మోడ‌ల్ గురించి మాట్లాడుతుంటారు. దేశాన్ని కూడా గుజ‌రాత్ లాగా చేస్తాన‌ని చెప్పి రాష్ట్ర ముఖ్య‌మంత్రి నుంచి దేశ ప్ర‌ధానిగా ఎదిగారు. నిజానికి గుజ‌రాత్ మోడ‌ల్ అంటే ఏమిటి? దాని స్వ‌రూప స్వ‌భావాలు ఎలా ఉన్నాయి? అది దేశానికి ఏ రంగంలో, ఏ అర్థంలో ఆద‌ర్శం? అన్న‌ది చూస్తే..

అభివృద్ధికి మూడు విధానాలు..

న‌రేంద్ర‌మోదీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా అధికారం చేప‌ట్టినప్ప‌టి నుంచీ 2002-03 నుంచి 2011-12 మ‌ధ్య కాలంలో గుజ‌రాత్ వృద్ధిరేటులో దూసుకు పోయిందన్నారు. రెండంకెల వృద్ధి సాధించింద‌ని చెప్పారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో గుణాత్మ‌క మార్పులు క‌నిపించాయ‌న్నారు. ఉత్ప‌త్తిలోనూ అభివృద్ది క‌నిపించింది. దీనికి గాను మోదీ మూడు విధానాలు అనుస‌రించాన్నారు.

అడిగితే చాలు అనుమ‌తులు మంజూరు

రాష్ట్రానికి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌టానికి పారిశ్రామికాధిప‌తుల‌కు పెద్ద ఎత్తున రాయితీలు క‌ల్పించారు. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు రోడ్లు, విద్యుత్తు, నీరు త‌దిత‌రాల‌ను రాయితీలిచ్చి అందుబాటులో ఉంచారు. పారిశ్రామిక యూనిట్ల స్థాప‌న‌కు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల అనుమ‌తుల‌ను సింగిల్ విండో ద్వారా అందించేలా ప్ర‌భుత్వాన్ని ప‌ని చేయించారు.

ఎలాంటి దానికైనా అడిగిందే త‌డ‌వుగా అనుమ‌తులు మంజూరు చేశారు. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు అవ‌స‌ర‌మైన భూముల‌ను పెద్ద ఎత్తున దాదాపు ఉచితంగా ఇచ్చారు. ఒక్కో ప‌రిశ్ర‌మ కోసం వంద‌లు వేలాది ఎక‌రాల‌ను ఒక రూపాయికి ఎక‌రా చొప్పున అప్ప‌జెప్పారు. పాడి పంట‌ల భూములైనా స‌రే రైతుల నుంచి గుంజి ప‌రిశ్ర‌మ‌ల యాజామాన్యాల‌కు క‌ట్ట‌బెట్టారు.

గ‌ణాంకాల్లోనే వృద్ధిరేటు రెండింత‌లు

ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు రాయితీలు, స‌బ్సిడీలు స‌రేస‌రి. చేతికి ఎముక‌లేని రీతిగా ప‌రిశ్రమల అధిప‌తుల‌కు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ రాయితీలు ఇచ్చారు. ఉదాహ‌ర‌ణ‌కు టాటా నానో కంపెనీకి రూ.30వేల కోట్ల రాయితీలు ఇచ్చారు. ఇదే విధంగా హుండాయ్‌, సుజుకీ కంపెనీల‌కు కూడా ఇచ్చి మోదీ ధాతృత్వాన్ని చాటుకున్నారు. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న పేర పెట్టుబ‌డిదారుల‌కు ఇచ్చిన రాయితీలు, స‌బ్సిడీలు, అప్ప‌గించిన స‌హ‌జ వ‌న‌రుల‌తో వారంతా కుబేరుల‌య్యారు. దీంతో అంకెల్లో రాష్ట్ర వృద్ధిరేటు రెండింత‌లు పెరిగిన‌ట్లు గ‌ణాంకాల్లో క‌నిపించింది.

మారిపోయిన ప్ర‌భుత్వ ప్రాధాన్యాలు

ఇదంతా నాణాకి ఒక వైపు మాత్ర‌మే. గుజ‌రాత్‌లో జ‌రిగిన అభివృద్దికి మ‌రో వైపు ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు చూస్తే క‌నీస మెరుగు క‌నిపించ‌క పోగా స‌గ‌టు జీవి కృషించి పోయాడు. వ్య‌వ‌సాయ యోగ్య‌మైన భూములు అన్యాక్రాంతం కావ‌టంతో గ్రామీణ ప్ర‌జ‌ల్లో నిరుద్యోగం పెరిగింది. గ్రామాల్లో ఆహార‌ ధాన్యాల కొర‌త ఏర్ప‌డింది. స‌గ‌టు జీవి అర్ధాక‌లితో అల‌మ‌టించే రోజులు వ‌చ్చాయి.

మ‌రో వైపు ప్ర‌భుత్వ ప్రాధాన్యాలు మారిపోవ‌టంతో ప్ర‌భుత్వం సేవారంగానికి కేటాయించాల్సిన నిధుల‌న్నీ పెట్టుబ‌డిదారుల‌కు సబ్సిడీలు, రాయితీల రూపంలో చేరిపోవ‌టంతో సేవా రంగాల‌కు క‌నిష్టంగానైనా నిధుల కేటాయింపు జ‌రుగ‌లేదు. దీంతో ప్ర‌భుత్వం అందించాల్సిన సేవ‌ల‌న్నీ కుదేల‌య్యాయి. వ్య‌వ‌సాయ రంగంలో చూస్తే గ‌తంలో పోలిస్తే.. 10నుంచి 12శాతం నిధుల్లో కోత విధించారు. దీంతో నీటిపారుద‌ల రంగం, వ్య‌వ‌సాయ‌ రంగం నీర‌సించిపోయింది. ఇది గుజ‌రాత్ గ్రామీణ ప్రజానీకంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపింది.

ప్ర‌జా సంక్షేమంపై ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం

పారిశ్రామిక అధిప‌తుల సేవ‌ల్లో మునిగిన మోదీ స‌ర్కార్ ప్ర‌జా సంక్షేమానికి, అభివృద్ధికి నిధుల కేటాయింపులో తీవ్ర నిర్ల‌క్ష్యం చూపింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే మొత్తంగా ప్ర‌జ‌ల జీవితాల‌ను గాలికి వ‌దిలేసింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విద్య‌పై ఆయా ప్ర‌భుత్వాలు 5 నుంచి 6శాతం నిధులు కేటాయిస్తుంటే, గుజ‌రాత్లో మోదీ ప్ర‌భుత్వం 2శాతం నిధులు కేటాయించింది. ప్ర‌జారోగ్యం కోసం 4 నుంచి 6శాతం కేటాయించాల్సిన నిధుల్లో కోత విధించి 0.8శాతం కేటాయించింది. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే గుజ‌రాత్‌లో 45శాతం మంది విద్యార్థులు పోష‌కాహార లోపంతో బాధ‌ ప‌డుతున్నారు.

తాండ‌వం చేస్తున్న‌నిరుద్యోగం

మాన‌వ వ‌న‌రులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని చెప్పుకొంటున్నరాష్ట్రంలో నిరుద్యోగం తాండ‌వం చేస్తున్న‌ది. కేవ‌లం 6శాతం మందికి మాత్ర‌మే ఉద్యోగ క‌ల్ప‌న జ‌రిగింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించామ‌ని గొప్ప‌లు పోతున్న గుజ‌రాత్‌లో ఇంకా 40 నుంచి 45శాతం కుటుంబాలు గ్రామాల్లో జీవ‌నాధారం కోసం ఇంటిప‌నులు, పాడి, గొర్రెలు, మేక‌ల పెంప‌కం పైనే ఆధార‌ ప‌డుతున్నారు.

కాకుల‌ను కొట్టి గ‌ద్ద‌ల‌కు వేయ‌డమే ఆద‌ర్శ‌మా..

మోదీ పాల‌న‌లో గుజ‌రాత్‌లో ఏ వ‌ర్గం ప్ర‌జ‌లకు మేలు జ‌రిగిందో దీంతో అర్థ‌మ‌వుతూనే ఉన్న‌ది. యువ‌త నిరుద్యోగంతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. రైతులు జీవ‌నాధారం కోల్పోయి క‌రువు కాట‌కాలతో బాధ‌ ప‌డుతున్నారు. విద్య‌, వైద్యం ప్ర‌జ‌ల‌కు క‌నీసంగానైనా అంద‌ని దుస్థితి ఏర్ప‌డింది. ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

గుజ‌రాత్ హైకోర్టు ఒకానొక‌ సంద‌ర్భంలో.. మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ.. మేము కూడా గుజ‌రాత్‌లో అంత‌ర్భాగమేన‌ని గుర్తించాల‌ని చెప్పుకునే ప‌రిస్థితి వ‌చ్చిందంటే.. ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తున్న‌ది. ఇలాంటి అభివృద్ది ఎవ‌రికీ, ఎన్న‌టికీ వాంఛ‌నీయం కాదు. కాకుల‌ను కొట్టి గ‌ద్ద‌ల‌కు వేసే మోదీ విధానం గుజ‌రాత్ మోడ‌ల్‌ ఎన్న‌టికీ ఆద‌ర్శం కాదు, కాబోదు.