Congress | ఒకరు పోతే ఇద్దరు..! కాంగ్రెస్‌లోకి జిట్టా, చింతల
Congress తెర వెనుక మంతనాలు పూర్తి చేరికలకు రంగం సిద్దం విధాత: భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి బిఆర్ఎస్‌లో చేరడంతో అలర్ట్ అయిన ఆ పార్టీ నాయకత్వం దానికి దీటుగా కాంగ్రెస్‌లోకి చేరికల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. భువనగిరి నియోజకవర్గానికి చెందిన బీజేపి నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, బిఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డి, వంగాల వెంకన్న గౌడ్‌లను కాంగ్రెస్ లోకి రప్పించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే జిట్టా, […]

Congress
- తెర వెనుక మంతనాలు పూర్తి
- చేరికలకు రంగం సిద్దం
విధాత: భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి బిఆర్ఎస్‌లో చేరడంతో అలర్ట్ అయిన ఆ పార్టీ నాయకత్వం దానికి దీటుగా కాంగ్రెస్‌లోకి చేరికల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. భువనగిరి నియోజకవర్గానికి చెందిన బీజేపి నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, బిఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డి, వంగాల వెంకన్న గౌడ్‌లను కాంగ్రెస్ లోకి రప్పించేందుకు రంగం సిద్ధం చేసింది.
ఇప్పటికే జిట్టా, చింతలతో పీసీసీ చీఫ్ రేవంత్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెర వెనుక చర్చలు పూర్తి చేశారు. ఈ నెలాఖరులోగా వారు పార్టీలో చేరుతారని భావిస్తున్నారు. నిజానికి భువనగిరి అసెంబ్లీ స్థానం నుండి బీసీలకు టికెట్ ఇస్తారన్న ప్రచారంతో పాటు వెంకటరెడ్డితో గ్రూపు రాజకీయాలతో వేగలేక కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టారు.
ఈ దఫా తనకు భువనగిరి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ రావడం లేదని, ఈ సీటును బీసీలకు కేటాయిస్తున్నారని, ఎంపీ టికెట్ కూడా రాదని తనకు సన్నిహితంగా ఉండే జిల్లా కాంగ్రెస్ సీనియర్, మాజీ మంత్రి ద్వారా కుంభం తెలుసుకున్నారు. కాంగ్రెస్ లో ఇక తనకు భవిష్యత్తు లేదని గ్రహించి కాంగ్రెస్ ను అయిష్టంగానే వదిలి వెళ్లారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సదరు మాజీ మంత్రి తన అనుచరుడైన కుంభం పార్టీ వీడకుండా ఆపకపోవడంతో ఆయన కూడా మునుముందు బిఆర్ ఎస్ లోకి వెళ్తారా అన్న సందేహాలను రేకెత్తించాయి. మరోవైపు బీఆర్ ఎస్ నుంచి కూడా కుంభం కు వచ్చే ఎన్నికల్లో భువనగిరి ఎంపీ టికెట్ లేదా ఎమ్మెల్సీ ఆఫర్ రావడంతో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.
ఏదో ఒక టికెట్ పై ఆశతోనే కాంగ్రెస్ లోకి..
జిట్టా, చింతల తమకు భువనగిరి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఏదో ఒక టికెట్ దక్కపోతుందా అన్న ఆశతో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. గత మూడు పర్యాయాల అసెంబ్లీ ఎన్నికల్లోను భువనగిరి నుంచి పోటీ చేసి ఓడిన జిట్టా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ లకు దీటుగా త్రిముఖ పోటీ సాగేలా చేశారు.
చింతల సైతం ఒక పర్యాయం కాంగ్రెస్ అభ్యర్థిగా భువనగిరిలో పోటీ చేసి ఓడారు. కాగా కాంగ్రెస్ నుండి టికెట్ విషయమై జిట్టాకు స్పష్టత లేకపోయినా.. తను తీవ్రంగా వ్యతిరేకించే కేసిఆర్ పట్ల బిజెపి స్టాండ్ మారి లోపాయికారి అవగాహనతో సాగుతున్నందునా బిజెపిని వీడాలని జిట్టా నిర్ణయించుకున్నారు.
భువనగిరి అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ టికెట్ బీసీలకు ఇస్తే తాను వారి గెలుపు కోసం పనిచేస్తానని, తనకి ఇస్తే వారు కూడా తన గెలుపుకు పని చేయాలని ఇప్పటికే జిట్టా స్పష్టం చేశారు. అయితే సీనియర్ బీసీ నేత పంజాల రామాంజనేయులు గౌడ్ పేరు భువనగిరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీలో బలంగా వినిపి స్తుంది.
అయితే పంజాల కంటే మరింత బలమైన అభ్యర్థి కోసం బిఆర్ ఎస్ నుండి వంగాల వెంకన్న గౌడ్ ను కాంగ్రెస్ లోకి రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరుతున్న జిట్టా, చింతల లకు ఆ పార్టీ ఏ రకంగా న్యాయం చేస్తదీ.. వంగాల కాంగ్రెస్‌లో చేరుతారా అన్నదీ వేచి చూడాల్సిందే.