No-Confidence motion | కేంద్రంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం

No-Confidence motion ప్రతిపాదించిన కాంగ్రెస్‌, బీఆరెస్‌ సభ్యులు ఆమోదించిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్ని పార్టీలతో మాట్లాడి తేదీపై నిర్ణయం సంఖ్యాపరంగా బలంగా ఉన్న ఎన్డీయే వీగిపోనున్న విపక్షాల అవిశ్వాస తీర్మానం కానీ.. సుదీర్ఘ చర్చకు దీనితోనే అవకాశం ఇదే వ్యూహంతో విపక్షాల అవిశ్వాసం న్యూఢిల్లీ: మణిపూర్‌ అంశంలో ప్రధాని మోదీ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటన చేయాలని, అనంతరం దానిపై 267, 184 నిబంధనల కింద రాజ్యసభ, లోక్‌సభల్లో చర్చ జరగాలన్న డిమాండ్‌కు అధికార […]

  • By: Somu    latest    Jul 26, 2023 10:00 AM IST
No-Confidence motion | కేంద్రంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం

No-Confidence motion

  • ప్రతిపాదించిన కాంగ్రెస్‌, బీఆరెస్‌ సభ్యులు
  • ఆమోదించిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా
  • అన్ని పార్టీలతో మాట్లాడి తేదీపై నిర్ణయం
  • సంఖ్యాపరంగా బలంగా ఉన్న ఎన్డీయే
  • వీగిపోనున్న విపక్షాల అవిశ్వాస తీర్మానం
  • కానీ.. సుదీర్ఘ చర్చకు దీనితోనే అవకాశం
  • ఇదే వ్యూహంతో విపక్షాల అవిశ్వాసం

న్యూఢిల్లీ: మణిపూర్‌ అంశంలో ప్రధాని మోదీ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటన చేయాలని, అనంతరం దానిపై 267, 184 నిబంధనల కింద రాజ్యసభ, లోక్‌సభల్లో చర్చ జరగాలన్న డిమాండ్‌కు అధికార పక్షం స్పందించకపోవడంతో ప్రతిపక్షాలు ఆఖరి అస్త్రాన్ని బయటకు తీశాయి. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి.

అవిశ్వాస తీర్మానం ఆమోదించాలంటే కనీసం 50 మంది సభ్యలు మద్దతు ప్రకటించాలి. ఈ తీర్మానానికి మద్దతు పలికేవారు చేతులు ఎత్తాలని కోరిన స్పీకర్‌ ఓం బిర్లా.. తగినంత మంది మద్దతు పలికారని భావించి, అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపట్టనున్నట్టు ప్రకటించారు. 198వ నిబంధన కింద అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు గౌరవ్‌ గగోయ్‌ ప్రతిపాదించారు. దానికి ఇండియా కూటమిలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి.

‘అన్ని పార్టీల నాయకులతో మాట్లాడి, అవిశ్వాసంపై చర్చకు తగిన సమయం, తేదీ నిర్ణయిస్తాను’ అని ఓం బిర్లా ప్రకటించారు. సంఖ్యా బలం రీత్యా అవిశ్వాస తీర్మానం వీగిపోనున్నప్పటికీ.. మణిపూర్‌ అంశంపై చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయంలో తాము విజయం సాధిస్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

కేంద్రంలోని బీజేపీ సర్కారుకు 332 మంది సభ్యుల మద్దతు ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. మణిపూర్‌ అంశంపై పార్లమెంటు ఉభయ సభలు బుధవారం కూడా దద్దరిల్లాయి. దీంతో తొలుత సభను మధ్యహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు.

కార్గిల్‌ యుద్ధంలో మరణించిన సైనికులకు సంతాపసూచకంగా సభ నివాళులర్పించిన అనంతరం ఈశాన్య రాష్ట్రంలో కొనసాగుతున్న హింసపై ప్రతిపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. ప్రధాని సభకు రావాలని, మణిపూర్‌ అంశంపై ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశాయి. ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశాయి.

ఈ సమయంలో సభ్యులు సభాకార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్‌ చేసిన విజ్ఞప్తులు ఫలించలేదు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, ప్రహ్లాద్‌ జోషి తదితరులు సభలో ఉన్నారు. అన్ని అంశాలను చర్చిద్దామన్న స్పీకర్‌.. మణిపూర్‌పై చర్చను ప్రతిపక్షం ఎందుకు కోరుకోవడం లేదని ఎదురు ప్రశ్నించారు.

కాగా.. సభలో గందరగోళం కొనసాగుతుండగానే మూడు ప్రశ్నలు, వాటి అనుబంధ ప్రశ్నలను స్పీకర్‌ చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాలు 20 నిమిషాలకు మించి సాగలేదు. నిరసనలు కొనసాగుతూనే ఉండటంతో తొలుత మధ్యహ్నం 12 గంటలకు వాయిదా సభ వాయిదా పడింది. తర్వాత ప్రారంభమైనా.. నిరసనలు ఆగకపోవడంతో మరోసారి 2 గంటల వరకూ వాయిదా వేశారు. తర్వాత కూడా అవే పరిస్థితులు కొనసాగడంతో గురువారం ఉదయం 11 గంటలకు సభ వాయిదా పడింది.

బీఆరెస్‌ అవిశ్వాసం

ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్‌ సభ్యుడు గగోయ్‌తోపాటు.. బీఆరెస్‌ సభ్యుడు నామా నాగేశ్వర్‌రావు కూడా విడిగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం విశేషం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆరెస్‌ ఇండియా కూటమిలోగానీ, ఎన్డీయే కూటమిలోగానీ భాగస్వామురాలిగా లేదు. అయితే.. బీఆరెస్‌ అవిశ్వాసానికి ఎంఐఎం మద్దతు పలికింది.

‘ఇండియా’ ఐక్యంగా ఉన్నది : మాణిక్కం ఠాగూర్‌

అవిశ్వాసం ప్రతిపాదించాలన్న ఆలోచన ఇండియా కూటమిదేనని లోక్‌సభలో కాంగ్రెస్‌ విప్‌ మణిక్కం ఠాగూర్‌ చెప్పారు. ‘ఇండియా కూటమి ఐక్యంగా ఉన్నది. ఈ ఆలోచన ఇండియా భాగస్వామ్య పక్షాలదే. కాంగ్రెస్‌ సభ్యుడు అవిశ్వాసం ప్రతిపాదిస్తారు. కేంద్ర ప్రభుత్వం అహంకారాన్ని అణచేందుకు, మణిపైర్‌పై అది స్పందించేందుకు మాకున్న ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించడం మా విధి’ అని ఆయన అంతకు ముందు పేర్కొన్నారు.

గతంలో 2018, జూలై 20వ తేదీన మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఆ సమయంలో టీడీపీ సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆ సమయంలోనే కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అధికారపక్ష సభ్యుల బెంచీల వైపు వెళ్లి.. ప్రధాని మోదీని ఆలింగనం చేసుకున్నారు.

2003లో అప్పటి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంపై అప్పటి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. ప్రభుత్వంపై సోనియా గాంధీ ‘చార్జిషీట్‌’తో చర్చమొదలైంది. అయితే.. ఆ తీర్మానం కూడా వీగిపోయింది. కానీ.. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లో వాజ్‌పేయి ప్రభుత్వం ఓడిపోయింది.