Windows 11 | విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్లకు శుభవార్త..! ఏఐ కో పైలట్ సహా 150 ఫీచర్ల తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్..!

Windows 11 | మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. ప్రస్తుతం విండో 11 ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగిస్తున్న యూజర్ల కోసం మరికొన్నింటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ప్రధానమైంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోపైలట్ అసిస్టెంట్ ఫీచర్. ఈ ఏఐ ఆధారిత కో పైలట్ అసిస్టెంట్ ఫీచర్‌తో యూజర్ల పని మరింత తేలిగ్గా మారనున్నది. దీంతో టాస్క్‌లను మరింత వేగంగా పూర్తి చేసేందుకు వీలు కలుగనున్నది. యూజర్లకు కో పైలట్ నుంచి పర్సనలైజ్డ్ జవాబులు ఇవ్వనుండగా.. దాంతో యూజర్లకు సమయం మరింత ఆదాకానున్నది. ప్రైవసీ, సెక్యూరిటీల విషయంలోనూ ఏఐ కో పైలట్ జాగ్రత్తలు తీసుకుంటున్నది.
అప్‌డేట్‌లో 150 వరకు ఫీచర్స్..
విండోస్ 11, మైక్రోసాఫ్ట్ 365, మైక్రో సాఫ్ట్ ఎడ్జ్, బిజ్‌లో అందుబాటులో ఉంటుంది. విండోస్ 11 అప్‌డేట్‌లో సుమారు 150 సరికొత్త ఫీచర్లను మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏఐ సహాయంతో ఎంఎస్ పెయింట్, ఫొటోస్, క్లిప్ చాంప్ తదితర యాప్‌లను సైతం మరింత మెరుగుపరిచింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ పెయింట్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చారు. ఈ యాప్ సహాయంతో డ్రాయింగ్, డిజిటల్ క్రియేషన్ మరింత సులువుకానున్నది. బ్యాక్ గ్రౌండ్ రిమూవర్ ఆప్షన్ సైతం ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది. ఇకపై పెయింట్ యాప్ సహాయంతో కో క్రియేటర్ సైతం యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో సృజనాత్మకత చిత్రాలను రూపొందించుకునే వీలు కలుగనున్నది. విండోస్11లో మరో అప్‌డేట్ చేసిన ఫీచర్లలో స్నిపింగ్ టూల్ సైతం ఒకటి. దీంతో స్క్రీన్ రికార్డింగ్ మరింత తేలిక కానుంది. విండోస్ కీ+షిఫ్ట్+ఆర్ బటన్స్ ఒకేసారి నొక్కడం ద్వార స్క్రీన్‌ను రికార్డు చేసుకోవచ్చు.
పాస్‌కీలు..
ఏఐ సహాయంతో ఫొటోలు యాప్ బ్యాక్ గ్రౌండ్‌లో బ్లర్, ఇంప్రూవ్డ్ సెర్చ్‌ను సైతం కంపెనీ అప్‌డేట్ చేసింది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ కొత్త పాస్‌కీ ఫీచర్‌ను సైతం పరిచయం చేసింది. వేరే వ్యక్తులకు తమ పాస్‌వర్డ్ తెలిస్తే వాటిని ఉపయోగించకుండా, అకౌంట్‌లోకి లాగిన్ అయ్యేందుకు ఫేస్‌లాక్, ఫింగర్ ప్రింట్, ఇతర పిన్స్‌ను ఉపయోగించకుండా అనుమతించే సింగిల్ క్రెడెన్షియల్‌ను సృష్టిస్తుంది. ఇతర పాస్‌వర్డ్‌లతో అవసరం లేకుండా వేగంగా, సౌకర్యవంతంగా పాస్ కీని మార్చబోతున్నది. అలాగే అప్‌డేట్‌లో ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌ని ఆధునికకీకరించింది. కొత్త ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అడ్రస్ బార్, సెర్చ్ బాక్స్ యూజర్లకు సంబంధించిన సమాచారం సులభంగా యాక్సెస్ చేయడంలో సహాయపడేలా మరింత తేలికగా తీర్చిదిద్దింది. అలాగే ఫొటోలను సులభంగా యాక్సెస్ చేసేందుకు గ్యాలరీ ఫీచర్‌ను సైతం జోడిస్తున్నది. ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ర్యార్, జిప్ వంటి ఆర్కైవల్ ఫార్మాట్‌తోను సైతం ఓపెన్ చేయవచ్చని కంపెనీ వివరించింది.