Modi | జమిలి ఎన్నికలపై మోదీ యూటర్న్? ప్రతికూలత వల్లేనా? లేక వ్యూహాత్మకమా?
Modi | మూడేళ్లుగా మోదీ జమిలి మంత్రం ఇప్పుడప్పుడే సాధ్యం కాదన్న కేంద్రం సందేహాలు రేపిన కేంద్రం ప్రకటన వ్యతిరేకత గుర్తించే వద్దనుకున్నరా? జమిలికి వెళ్లాలంటే భారీగా కసరత్తు అనేక అధికరణలు సవరించాల్సిన స్థితి జమిలి అమలైన తర్వాత అనేక సమస్యలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పెద్దగా ఆశలు పెట్టుకోని బీజేపీ నాయకత్వం ఈ పరిస్థితిలో జమిలికి వెళితే నష్టమే! (విధాత ప్రత్యేక ప్రతినిధి) ఒకే దేశం.. ఒకే ఎన్నిక పేరుతో అటు లోక్‌సభకు, ఇటు అన్ని […]

Modi |
- మూడేళ్లుగా మోదీ జమిలి మంత్రం
- ఇప్పుడప్పుడే సాధ్యం కాదన్న కేంద్రం
- సందేహాలు రేపిన కేంద్రం ప్రకటన
- వ్యతిరేకత గుర్తించే వద్దనుకున్నరా?
- జమిలికి వెళ్లాలంటే భారీగా కసరత్తు
- అనేక అధికరణలు సవరించాల్సిన స్థితి
- జమిలి అమలైన తర్వాత అనేక సమస్యలు
- రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పెద్దగా ఆశలు పెట్టుకోని బీజేపీ నాయకత్వం
- ఈ పరిస్థితిలో జమిలికి వెళితే నష్టమే!
(విధాత ప్రత్యేక ప్రతినిధి)
ఒకే దేశం.. ఒకే ఎన్నిక పేరుతో అటు లోక్‌సభకు, ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఉబలాటపడిన ప్రధాని నరేంద్రమోదీ యూటర్న్ తీసుకున్నారా? ఇన్నాళ్లూ జమిలి మంత్రం పఠించిన ప్రధాని.. వాటి గురించి భయపడుతున్నారా? జమిలి ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రకటించడం.. ఇప్పుడు అనేక సందేహాలను కలిగిస్తున్నది. దేశంలో బీజేపీ వ్యవహారం పట్ల, మోదీ పరిపాలన పట్ల క్రమంగా పెరుగుతున్న వ్యతిరేకతను ముందుగానే గుర్తించిన బీజేపీ అధిష్ఠానం.. ఒకేసారి ఒకే ఎన్నికలకు వెళ్తే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని భావించిందా? అన్న ప్రశ్న ఉదయిస్తున్నది.
సాధారణంగా బీజేపీ విధానపరమైన నిర్ణయాలలో ప్రధాని మోదీ వెనుకడుగు వేయడం చాలా అరుదు. గతంలో దాదాపు ఏడాది పాటు రైతులు వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తే.. ఎన్ని ప్రాణాలు పోయినా.. రైతులు ఆందోళన సందర్భంగా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా.. చలించని మోదీ.. ఎట్టకేలకు రైతుల ఉద్యమ తీవ్రతకు అయిష్టంగానైనా తలవంచాల్సి వచ్చింది. రైతులకు క్షమాపణ చెబుతూ వాటిని వాపస్ తీసుకున్నారు. తాజాగా ఉమ్మడి పౌరస్మృతి విషయంలో కూడా అదే వాయిదా పద్ధతిని అనుసరించే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నది.
ఇదే క్రమంలో జమిలి ఎన్నిక కూడా చేరిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎజెండాలోని ప్రధాన అంశాలపై మోదీ ప్రభుత్వం ఇటీవల వెనక్కి తగ్గడానికి దేశంలో మారిన రాజకీయ పరిస్థితులే కారణం కావచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. ఇండియా కూటమి ఏర్పాటుతో దేశంలో విపక్షాలు బలం పుంజుకునే దిశగా పరిస్థితి ఏర్పడుతుందన్న భావనతో ఉన్న మోదీ అండ్ కో.. జమిలి ఎన్నికల విధానం తెస్తే బీజేపీ కంటే ఇండియా కూటమికి సానుకూలత ఉంటుందన్న భయాన్ని ఎదుర్కొంటున్నదని, అందుకే జమిలి ప్రక్రియను ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్టు కనిపిస్తున్న దని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మూడేళ్లుగా మోదీ జమిలి మంత్రం
గడచిన మూడేళ్లుగా జమిలి ఎన్నికల నిర్వహణ దిశగా మోదీ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. 2017లో నీతి అయోగ్ జమిలి సాధ్యాసాధ్యాలపై చర్చించి నివేదిక ఇవ్వగా, లా కమిషన్ ఆమోదించింది. అఖిలపక్ష సమావేశానికి హాజరైన 41 పార్టీలలో 21 పార్టీలు జమిలికి అనుకూలంగా అప్పట్లో తెలిపాయి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్రం పార్లమెంటు స్థాయీ సంఘాన్ని నియమిస్తే.. అది కూడా సానుకూలంగా స్పందించింది. ఎన్నికల సంఘం కూడా సైతం జమిలికి జై కొట్టింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల దిశగా కేంద్రం ముందుకే వెళుతుంది అంతా భావించారు. కానీ.. జమిలికి ఎదురయ్యే ఆటంకాలను చూపి, ఇప్పటికే స్థాయి సంఘం ఇచ్చిన నివేదికను, దాని సిఫారసులను లా కమిషన్ పరిశీలనకు పంపించి, రోడ్ మ్యాప్ నిర్దేశించాలని ప్రకటన చేయడం విపక్షాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఐదు అధికరణలు.. అవరోధాలు
జమిలి ఎన్నికలు సాధ్యం కాదని కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటన చేసే క్రమంలో లాభనష్టాలను నివేదిస్తునే, ఆటంకాలను కూడా వెల్లడించింది. లాభాలను ప్రస్తావిస్తూ.. పదేపదే ఎన్నికల నిర్వాహణ పరిస్థితులు పోయి, ప్రజాధనం ఆదా అవుతుందని, పరిపాలన, శాంతిభద్రతల విభాగాలు ఎన్నికల విధులను పలుమార్లు నిర్వహించే పరిస్థితి తప్పుతుందని పేర్కొన్నది.
ఎన్నికల ప్రచారంలో పార్టీలకు, అభ్యర్థులకు ఖర్చు ఆదా అవుతుందని, రెండు ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించడం ద్వారా ఎన్నికల కోడ్ ఆంక్షలు ఎక్కువ కాలం అమలులో ఉండకుండా, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవ్వడంతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనపై దృష్టి కేంద్రీకరించే సానుకూలత లభిస్తుందని కేంద్రం వివరించింది. ఇదే సమయంలో జమిలి విధానం తీసుకొచ్చేందుకు రాజ్యాంగంలో ఐదు సవరణలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.
ఇవీ ఆ ఐదు అధికరణాలు
మొదటిది పార్లమెంట్ కాల పరిమితికి సంబంధించిన అధికరణం 83. లోక్‌సభను రద్దు చేసేందుకు రాష్ట్రపతికి ఈ అధికరణం అధికారాలు కల్పిస్తున్నది. రాష్ట్రాల శాసన సభల కాల పరిమితిని నిర్ధారించే అధికరణం 172. రాష్ట్రాల అసెంబ్లీ రద్దు అధికరణం 174. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే 356 అధికరణం. జమిలికి వెళ్లటానికి ముందు వాటిన్నంటినీ సవరించాల్సి ఉంటుందని తెలిపింది.
ఇందుకు రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాల్సి వస్తుండటం, సమాఖ్య పాలన వ్యవస్థ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం తీసుకోవాల్సి ఉండటం, జమిలికి సరిపడా ఈవీయంలు, వీవీ ప్యాట్‌లు సమకూర్చుకునేందుకు వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉండటం, ఒకేసారి ఎన్నికలకు అదనపు పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలను సమకూర్చుకోవడం వంటి సమస్యలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. జమిలి ఎన్నికలపై సాధ్యాసాధ్యాల పరిశీలనకు మరింత కసరత్తు చేయాల్సి ఉన్నదని, అందుకే స్థాయీ సంఘం నివేదికను లాకమిషన్‌కు పంపినట్లుగా పేర్కొన్నది.
ప్రయోజనాలు లేకనే బీజేపీ వెనకడుగు
నిజానికి ప్రస్తుతం జమిలి ఎన్నికలపై చట్టం చేసేందుకు కేంద్రానికి ఉభయసభల్లో తగిన సంఖ్యాబలం ఉంది. సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం కోసం ఎన్డీఏ పార్టీల సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వాల సానుకూలత సాధించవచ్చు. అయితే అంతకుమించి బీజేపీకి రాజకీయంగా ఒనగురే ప్రయోజనాలు లేకపోవడంతోనే జమిలికి కేంద్రం వెనకడుగు వేసిందని భావిస్తున్నారు. జమిలి ఎన్నికలకు సిద్ధపడితే మోదీ వంటి నేత ప్రచారంతో అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మేలు జరుగుతుందని తొలుత ఆ పార్టీ అంచనా వేసింది.
అలాగే ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టవచ్చని కూడా భావించింది. క్షేత్ర స్థాయిలో దేశంలో ప్రస్తుతం అలాంటి రాజకీయ వాతావరణం లేదని, ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభావం చూపుతున్న మోదీ చరిష్మా, జాతీయ అంశాలు.. దక్షిణాదిన వర్కవుట్ కావడం లేదని బీజేపీ భావిస్తున్నదని, ఆచరణలో కూడా అది వెల్లడైందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఓటర్లు ఎన్నికల్లో లోక్‌సభకు ఒక పార్టీని, రాష్ట్రాలలో మరో పార్టీని ఎంచుకుంటున్న నేపథ్యం ఉన్నదని, రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లోను బీజేపీకి అనుకూలత లేదని, ఈ పరిస్థితుల్లో జమిలితో తమకు ప్రయోజనం కంటే ప్రతికూలతలే ఎక్కువన్న భావనతో జమిలిపై బీజేపీ దాటవేత వైఖరిని ఎంచుకుందని అంచనా వేస్తున్నారు.
రాజకీయ ఏకాభిప్రాయానికి అడ్డంకులు
జమిలి ఎన్నికలకు వెళ్లేముందు రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావలసి ఉండగా ఎన్డీఏను సవాలు చేస్తూ ఏర్పడిన ఇండియా కూటమి అందుకు సహకారం అందించకపోవచ్చు. అలాగే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నుంచి జమిలికి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కూడా ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించకపోవచ్చు. ఇవి కూడా జమిలిపై బీజేపీ యూటర్న్‌కు కారణంగా చెబుతున్నారు.
అంతేగాక జమిలి ఎన్నికల కోసం ఇప్పటికే ఉన్న కొన్ని రాష్ట్రాల శాసన సభల పదవీ కాలం పొడిగించడం, మరికొన్ని శాసన సభల పదవీ కాలం కుదించడం చేయాల్సి ఉన్నది. దీనికి కూడా రాజ్యాంగ సవరణ అవసరం. ఈ తలనొప్పంతా ఎందుకన్న ఆలోచనతో కూడా బీజేపీ జమిలిపై వాయిదాకు మొగ్గుచూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జమిలి అంశాన్ని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎజెండాగా చేసే అవకాశం లేకపోలేదని, తాము జమిలి తెద్దామంటే విపక్షాలు మద్దతు ఇవ్వలేదంటూ ఎన్నికల్లో పొలిటికల్ క్లైమ్ చేయవచ్చని, అందుకే వ్యూహాత్మకంగా వెనకడుగు వేసిందని మరికొందరు చెబుతున్నారు.
ఆది నుంచి జమిలిపై భిన్నాభిప్రాయాలు
జమిలి ఎన్నికల నిర్వహణపై దేశ రాజకీయ పార్టీలలో ఆది నుంచీ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పదేపదే ఎన్నికల నిర్వహణల ఖర్చు, సమయం, అభివృద్ధి పనులకు కోడ్ ఆటంకాలతో పరిపాలన స్తంభించడం వంటి ప్రధానాంశాలే జమిలికి ఎక్కువ సానుకూల అంశాలు. అయితే భారత్ వంటి విభిన్న సంస్కృతులు, జాతులున్న దేశంలో జమిలి ఎన్నిక సాధ్యం కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మనుగడలు అనేక అంశాలపై ఆధారపడిన దేశంలో అసలు ఆ విధానమే ప్రహసనంగా మారుతుందనే అభిప్రాయాలూ ఉన్నాయి.
సానుకూలంగా కేంద్రం చెబుతున్న అంశాలలో పార్లమెంటు స్థాయీ సంఘం 79వ నివేదికలో దక్షిణా ఫ్రికాలో ప్రతి ఐదేళ్లకు జాతీయ, ప్రాంతీయ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. స్వీడన్‌లో నాలుగేళ్లకు ఒకసారి జాతీయ, స్థానిక అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి సెప్టెంబర్ రెండవ శనివారం రోజు జరుగుతాయని తెలిపింది. యూకేలో పార్లమెంటు పదవీ కాలం స్థిరంగా ఉండేందుకు 2011లో చట్టం చేశారని తెలిపింది. ఆయా అంశాలను జమిలికి అనుకూలంగా కేంద్రం పేర్కొంది. సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్‌లలో పార్టీల జాబితాతో దామాషా ప్రాతిపదికన చట్టసభలలో సీట్లు కేటాయిస్తారన్నఅంశం స్థాయి సంఘం విస్మరించిందన్న విమర్శ ఉంది.
జమిలితో అభివృద్ధి అంతంతమాత్రమే
కేంద్రం పేర్కొన్నట్టు.. జమిలి ఎన్నికలు అమలవుతున్న దేశాలలో అభివృద్ధి పెద్దగా పెరిగిందేమీ లేదన్న వాదన ఉంది. ఇందుకు అమెరికాలో 1962 నుండి 2019 మధ్య 57 ఏళ్ల కాలంలో 22 ఏళ్లలో తిరోగమన వృద్ధిరేటు నమోదైందని, పదహారేళ్లలో ఒక శాతం లోపు, ఐదేళ్లలో ఒకటి నుండి రెండు శాతం వృద్ధిరేటు నమోదైందన్న లెక్కలను జమిలి వ్యతిరేకులు వినిపిస్తున్నారు. అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల్లో 50 రాష్ట్రాలలో మెజారిటీ తెచ్చుకున్న పార్టీకి ఎలక్ట్రోరల్ ఓట్లు కేటాయిస్తారు.
స్వీడన్, బెల్జియం, ఫిలిప్స్ లలో జమిలి ఎన్నికలు ఉన్నా పెద్దగా ఆర్ధిక వృద్ధి రేటు సాధించిలేదని, అయితే రాజకీయ సుస్థిరత పెరిగిందన్న భావన ఉంది. పైగా ఆ దేశాల్లో భారత్‌కు భి్న్నంగా ఎక్కువగా ఒకే జాతీ, సంస్కృతులున్నాయి. మనదేశంలో నిజానికి 1951 నుండి 1967 వరకు దాదాపుగా జమిలి ఎన్నికల మాదిరిగా రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఎన్నికలు ఒకేసారి జరిగాయి. తదుపరి క్రమంగా ఆ పరిస్థితి చెదిరిపోయింది.
జమిలితో కొత్త గందరగోళాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకుంటే జమిలి ఎన్నికలకు ఇబ్బందేమీ లేదు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో తరచూ ప్రభుత్వాలు పడిపోతూ వచ్చే ఎన్నికలకు జమిలి చెక్ పెట్టవచ్చని అనుకున్నారు. అయితే ఆచరణలో జమిలి విధానం తెచ్చినా మధ్యలో హంగ్, అవిశ్వాసాలు వంటి వాటితో కేంద్ర ప్రభుత్వమో, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలో కూలిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలనేది ప్రశ్న. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు సదరు రాష్ట్రంలో ఇతర పార్టీలకు లేదా కూటమికి బలం లేకపోతే అక్కడ ఎన్నికల కోసం మళ్లీ తదుపరి సార్వత్రిక ఎన్నికల దాకా ఆగాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యమ్నాయాన్ని రూపొందించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఎన్నికలు జరిపినా ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీలకు మిగిలిన కాలానికే ఎన్నికలు జరుపాల్సి ఉంటుంది. లేదంటే 356 మేరకు రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రపతి పాలనను ప్రతి ఆరునెలకొకసారి పొడిగించి జమిలి ఎన్నికల దాకా నెట్టుకురావచ్చు.
ఆరు నెలల కంటే ప్రభుత్వం పడిపోయిన రాష్ట్రాల అసెంబ్లీకి గడువు ఎక్కువ ఉంటే మళ్లీ ఆర్డినెన్స్‌తో రాష్ట్రపతి పాలన పొడిగించవచ్చు. ఇలా మూడేళ్ల కాల పరిమితి వరకు మాత్రమే చేయవచ్చు. అప్పటికి జమిలి ఎన్నికలకు, ఆ రాష్ట్రంలోని అసెంబ్లీ కాలపరిమితికి సమయం ఉంటే ఎన్నికల నిర్వాహణ, ప్రభుత్వాల ఏర్పాటు ఎట్లా అన్నది సందేహంగా మిగిలింది.
అలాగే ఎక్కడైనా ఎంపీ, ఎమ్మెల్యే చనిపోతే ఆ ఖాళీ స్థానం ఎన్నిక జమిలి ఎన్నికల వరకు ఆగాల్సిన వస్తుందా? అనే ప్రశ్నకూ సమాధానం దొరకాల్సి ఉన్నది. ఆయా సమస్యలపై ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసినా దీనిపై అన్ని రాజకీయ పార్టీలలో ఏకాభిప్రాయం అసాధ్యంగా మారింది. ఇంకోవైపు జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టమని, శాసన సభల ఎన్నికల నిర్వహణలపై కేంద్రం ఆధిపత్యం పెరుగవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
దీంతో పరోక్షంగా అధ్యక్ష పాలన తరహా రాజకీయ విధానాలు నెలకొనవచ్చని, అవననీ దేశ సమగ్రతను, భిన్నత్వంలో ఏకత్వాన్ని నీరుగారుస్తాయన్న వాదన కూడా వినిపిస్తున్నది. ఈ పరిస్థితులన్నింటి మధ్య జమిలి తలనొప్పి పెట్టుకోవడం కంటే మూడోసారి అధికారంలోకి రావడమే ప్రధానంగా భావించిన బీజేపీ జమిలి ఎన్నికల అంశాన్ని అటకెక్కించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.