Minister Konda Surekha: నా మాటలను వక్రీకరించారు : మంత్రి కొండా సురేఖ

Minister Konda Surekha: ఫైళ్ల క్లియరెన్స్ కు మంత్రులు డబ్బులు తీసుకుంటారంటూ తాను చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా వక్రీకరించి ట్రోల్ చేస్తుందని దీనిని ఆపకపోతే తాను సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన బాలికల జూనియర్ కళాశాల భవనం ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడుతూ కంపెనీల నుంచి క్లియరెన్స్ కోసం ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారని..కాని నేను మాత్రం అలాకాకుండా వారిని సమాజ సేవ చేయాలని కోరడం జరిగిందని..అలా బాలికల జూనియర్ కళాశాల భవనం సీఎస్ఆర్ నిధులతో సాధ్యమైందంటూ చెప్పకొచ్చారు.
మంత్రి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సహజంగానే ఇరకాటంలో పెట్టాయి. ఆమె వ్యాఖ్యలను అవకాశంగా మలుచుకున్న ప్రతిపక్షాలు ప్రభుత్వంలో మంత్రుల తీరుపై విమర్శలు సంధిస్తున్నాయి. దీంతో నష్టనివారణ చర్యలలో భాగంగా మంత్రి కొండా సురేఖ స్పందించారు. మంత్రులు డబ్బులు తీసుకుంటారన్న నా వ్యాఖ్యలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల తీరును ఉద్దేశించి చేసినవని క్లారిటీ ఇచ్చారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని అన్నానని తెలిపారు.
నా వ్యాఖ్యలను వక్రీకరించి బీఆర్ఎస్ మీడియా తప్పుగా ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని మంత్రులంతా చక్కగా పనిచేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ వాళ్లు నన్ను ఎదుర్కోలేక నాపై దుష్ప్రచార దాడి చేస్తున్నారని..దమ్ముంటే కాళేశ్వరం, మిషన్ భగీరథ సహా బీఆర్ఎస్ హయాంలో స్కామ్ లపై చర్చకు రావాలని సురేఖ సవాల్ చేశారు.
కాగా తరుచు ముక్కుసూటిగా..రాజకీయ ఎత్తుగడలకు అతీతంగా తన అభిప్రాయాలను వెల్లడించే కొండా సురేఖ తన మాటలతో ప్రతిపక్షాల చేతిలో ట్రోలింగ్ కు గురవుతున్నారు. బీఆర్ఎస్ పై మాటల దాడి చేసే క్రమంలో..ప్రభుత్వ విధానాలకు మద్ధతుగా చేసే వ్యాఖ్యలలో సురేఖ చేసిన వ్యాఖ్యలే అమెపై ప్రత్యర్థులకు ట్రోలింగ్ కు అవకాశమిస్తున్నాయి. ఇందుకు ఉదాహారణగా హీరో నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు..జిల్లా రాజకీయాల్లో పోలీస్ స్టేషన్ లో స్టేషన్ ఆఫీసర్ సీటులో కూర్చోవడం..కూతురి బర్త్ డే వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు..తన బంధువుల అబ్బాయికి జాబ్ పెట్టించాలని మంత్రి శ్రీధర్ బాబుతో వేదికపై మాట్లాడిన మాటలు..తాజాగా మంత్రుల అవినీతిపై చేసిన వ్యాఖ్యలను పేర్కొంటున్నారు.